Site icon NTV Telugu

ఇంద్రవెల్లి సభకు కాంగ్రెస్‌ సీనియర్లు డుమ్మా…!

ఇంద్రవెల్లి సభను కాంగ్రెస్‌ పార్టీ.. రేవంత్‌రెడ్డి సవాల్‌గా తీసుకున్నారు. వేదికపై పార్టీ నేతలు భారీగానే కనిపించినా.. కొందరు సీనియర్లు మాత్రం డుమ్మా కొట్టారు. దీంతో పార్టీలో చర్చ వారిపై మళ్లింది. రేవంత్‌తో కలిసి వేదిక పంచుకోలేక సభకు రాలేదేమో అని కొందరు విశ్లేషిస్తున్నారు. ఇంతకీ సభకు రానిది ఎవరు?

జానారెడ్డి ఇంద్రవెల్లికి ఎందుకు రాలేదు?
ఆహ్వానం లేదని ఉత్తమ్‌ అలిగారా?

తెలంగాణ కాంగ్రెస్‌లో తగువులు.. అలకలు సహజమని అనుకుంటారు కానీ.. అవే పార్టీని కొంపముంచే అంశంగా కొందరు చెబుతారు. ఎవరి ఎత్తుగడలు వారివే. ఇప్పుడు ఇంద్రవెల్లి సభకు జానారెడ్డితోపాటు.. ఉత్తమ్‌, వీహెచ్‌, పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్‌ డుమ్మా కొట్టారు. వీరిలో జానారెడ్డికి రేవంత్‌ సన్నిహితంగా ఉంటారు. ఆయినప్పటికీ పెద్దాయన రాలేదు. మొన్నటి వరకు పార్టీ వ్యవహారాలు చూసిన ఉత్తమ్‌ ఊసే లేదు. ఇంద్రవెల్లి సభకు ముందు ఢిల్లీలో రేవంత్‌, ఉత్తమ్‌లు రహస్యంగా గంటపాటు భేటీ అయ్యారు. దాంతో మాజీ పీసీసీ చీఫ్‌ వస్తారని అంతా అనుకున్నారు. కానీ.. ఇంద్రవెల్లి సభకు ఆహ్వానించలేదని ఉత్తమ్‌ అలిగారట. సభకు రావాలని ఆయనకు ఎవరూ సమాచారం కూడా ఇవ్వలేదని ప్రచారం జరుగుతోంది. పైకి ఈ ఇద్దరు నాయకులు అన్నా అన్నా అనుకున్నా.. ఎవరి రాజకీయం వారిదే. ఆ ఎఫెక్ట్‌ సభపై పడిందని టాక్‌.

ఢిల్లీ, విశాఖ వరకు వెళ్లిన వీహెచ్‌ ఇంద్రవెల్లిలో కనిపించలేదు!

వయసు.. ఓపికకు సంబంధం లేకుండా వీ హన్మంతరావు పార్టీ సమావేశాలకు, సభలకు వస్తారు. అలాంటి VH కూడా ఇంద్రవెల్లి సభలో కనిపించలేదు. ఇటీవల ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన VH ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలను కలిసి వచ్చారు. విశాఖలో స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతోన్న ఆందోళనలో కూడా పాల్గొన్నారు. VH ఆస్పత్రిలో ఉన్నప్పుడు రేవంత్‌రెడ్డి వెళ్లి పరామర్శించారు. దాంతో ఇద్దరి మధ్య గ్యాప్‌ తగ్గిందని.. కలిసి పనిచేస్తారని ప్రచారం జరిగింది. మరి.. ఇంద్రవెల్లి సభకు ఎందుకు రాలేదన్నది ప్రశ్నగా ఉంది.

జ్వరంతో బాధపడుతున్నా బోనాల జాతరలో చిందేసిన జగ్గారెడ్డి!

వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి విషయానికి వస్తే.. ఇంద్రవెల్లి సభకు ఆయనే ఇంఛార్జ్‌. రేవంత్ pcc చీఫ్ కాక ముందు బాహాటంగానే వ్యతిరేకించిన జగ్గారెడ్డి.. తర్వాత సైలెంట్‌. పార్టీ నిర్ణయం వరకే పంచాయితీ.. నిర్ణయం అయిపోయాక కలిసి పని చేయడమే అని ప్రకటించారు. కానీ ఇంద్రవెల్లి సభకు రాలేదు. రెండు రోజుల ముందు తాను జ్వరంతో బాధపడుతున్నా.. సభకు రాలేను అని రేవంత్‌కు, పార్టీ ఇంఛార్జ్‌ ఠాగూర్‌కు లేఖ రాశారు. జగ్గారెడ్డికి జ్వరం నిజమే అయినా.. సంగారెడ్డి నియోజకవర్గంలో నిర్వహించిన రెండు బోనాల జాతరల్లో పాల్గొన్నారు. అంతటి జ్వరంలోనూ జాతరలో చిందులేశారు జగ్గారెడ్డి. ఇంద్రవెల్లి సభకు మాత్రం దూరంగా ఉండిపోయారు. ఆయన లెక్కలేంటో అంతుచిక్కడం లేదు పార్టీ నాయకులకు.

కోమటిరెడ్డి బ్రదర్స్‌ సైతం దూరం!

కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా సభలో కనిపించలేదు. వెంకట్ రెడ్డి, రేవంత్ మధ్య సయోధ్య కుదరలేదు. అందుకే ఆయన రాలేదు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిదీ అదే పరిస్థితి. మాజీ మంత్రులు జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబులు సభకు వస్తారో రారో అనుకున్నారు. కానీ వారిద్దరూ హాజరై బయట జరిగే చర్చకు తాత్కాలిక బ్రేక్ వేశారు. మరి.. సభకు సీనియర్లు ఎందుకు రాలేదన్నది కాలమే చెప్పాలి. ఇప్పుడు కాకపోయినా.. భవిష్యత్‌లో ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక రూపంలో డుమ్మా వెనక కారణాలు బయటపడతాయి.

Exit mobile version