Site icon NTV Telugu

గజ్వేల్‌ కాంగ్రెస్‌లో వర్గపోరు…!

గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన.. ప్రస్తుతం జిల్లా కాంగ్రెస్‌కు చీఫ్‌. అక్కడ పార్టీకి పెద్ద అయినా.. కేడర్‌తో అంతులేని గ్యాప్‌ ఉందట. ఇప్పుడు అది కాస్తా ఓపెన్‌ అయిపోయింది. నేరుగా పీసీసీ చీఫ్‌కే ఫిర్యాదులు చేసేవరకు వెళ్లిందట. దీంతో పార్టీవర్గాల్లో ఒక్కసారిగా చర్చల్లోకి వచ్చారు ఆ నాయకుడు. ఆయన ఎవరో ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.

గజ్వేల్‌లో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిపై వ్యతిరేకవర్గం గుర్రు!

తూముకుంట నర్సారెడ్డి. గతంలో ఉమ్మడి మెదక్‌ జిల్లా గజ్వేల్‌ నుంచి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే. 2014 ఎన్నికల్లో గులాబీ బాస్‌ కేసీఆర్‌ చేతిలో ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో నర్సారెడ్డిది థర్డ్‌ప్లేస్‌. మరి.. ఆ ఓటమితో జ్ఞానోదయమందో లేక.. కాంగ్రెస్‌లో భవిష్యత్‌ లేదనుకున్నారో.. ఎన్నికలైన రోజుల వ్యవధిలోనే హస్తానికి హ్యాండిచ్చి.. గులాబీ కండువా కప్పేసుకున్నారు. టీఆర్‌ఎస్‌ కూడా ఆయనకు తగిన గౌరవమే ఇచ్చింది. తెలంగాణ రోడ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీకి ఛైర్మన్‌గా నియమించారు. కానీ.. టీఆర్‌ఎస్‌లోనూ తగిన గుర్తింపు లభించడం లేదని భావించి.. 2018 ఎన్నికలకు ముందు ఆయన తిరిగి కాంగ్రెస్‌లోకి వచ్చేశారు. అప్పటి నుంచి కాంగ్రెస్‌లోనే ఉన్నారు. సిద్ధిపేటజిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు. ఇంతవరకు భాగానే ఉన్నా.. ఈ మధ్య కాలంలో నర్సారెడ్డి పేరు చెబితే కాంగ్రెస్‌ కేడర్‌ కస్సున లేస్తోందట. పార్టీలో ఆయనకు వ్యతిరేకంగా ఓ బలమైనవర్గం తయారైనట్టు సమాచారం. ఇప్పుడా వర్గపోరే చర్చగా మారింది.

నేరుగా రేవంత్‌కే ఫిర్యాదు చేసిన నర్సారెడ్డి వైరివర్గం!

నర్సారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడైనా.. కేడర్‌తో చాలా గ్యాప్‌ వచ్చిందన్నది పార్టీ వర్గాల మాట. ఎవరూ కలిసి పనిచేయడం లేదు. పార్టీ జెండాలు పట్టుకుని ఎవరి శిబిరం వారు నిర్వహిస్తున్నారు. నర్సారెడ్డిని DCC ప్రెసిడెంట్‌గా తొలగిస్తేనే కలిసి పనిచేసే అవకాశం ఉందని పార్టీ పెద్దలకు చెప్పేస్తున్నారట. ఇదే అంశంపై బండారు శ్రీకాంత్‌ నేతృత్వంలో కాంగ్రెస్‌ శ్రేణులు హైదరాబాద్‌ వెళ్లి పీసీసీ చీఫ్‌ రేవంత్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. నర్సారెడ్డి కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్‌లో చేరిన సమయంలో గజ్వేల్‌ నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలను శ్రీకాంత్‌ భుజనా వేసుకున్నారట. నర్సారెడ్డి తిరిగి కాంగ్రెస్‌లోకి వచ్చాక శ్రీకాంత్‌ను పక్కన పెట్టినట్టు చెబుతున్నారు.

నర్సారెడ్డి సారథ్యాన్ని ఒప్పుకోమంటున్న వ్యతిరేకవర్గం

జిల్లా కాంగ్రెస్‌లో.. ముఖ్యంగా గజ్వేల్‌లో తనకు పార్టీలో పోటీ లేకుండా ఉండేందుకు నర్సారెడ్డి వేయని ఎత్తుగడ లేదట. శ్రీకాంత్‌ను ఎదుర్కొనేందుకు వైరిపక్షాలకు కూడా సహకరిస్తున్నట్టు అనుమానిస్తున్నారట. ఇదే విషయాన్ని హైదరాబాద్‌లో రేవంత్‌, ఇంఛార్జ్‌ ఠాగూర్‌లకు చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌ కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీని వీడి వెళ్లిన వ్యక్తి తిరిగొచ్చి తమపై పెత్తనం చేస్తే ఎలా ఊరుకొంటామని ప్రశ్నిస్తున్నారట.

ఫిర్యాదులను లైట్‌ తీసుకుంటున్న నర్సారెడ్డి!

నర్సారెడ్డి కుమార్తె ఆంక్షారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్‌ బాధ్యతలు చూస్తున్నారు. ఆమె నాయకత్వంపై అభ్యంతరాలు లేకపోయినా.. నర్సారెడ్డిపైనే వ్యతిరేకవర్గం సన్నాయి నొక్కులు నొక్కుతోందట. అలాగే దుబ్బాక ఉపఎన్నికలో నర్సారెడ్డి పోటీ చేయాలని అనుకున్నా చెరుకు శ్రీనివాసరెడ్డికి టికెట్‌ ఇవ్వడంతో కినుక వహించారట. అప్పటి నుంచి చెరుకు, నర్సారెడ్డిలకు మధ్య గ్యాప్‌ వచ్చినట్టు సమాచారం. ఇప్పుడు హైదరాబాద్‌లో ఫిర్యాదుల పర్వం తెలిసిన తర్వాత తాను వాటిపై స్పందించాల్సిన పనిలేదని లైట్‌ తీసుకుంటున్నారు నర్సారెడ్డి. ఏం చేయాలో తనకు తెలుసని అనుచరులకు చెబుతున్నారట. మరి.. గజ్వేల్‌ కాంగ్రెస్‌లో రేగిన ఈ కుంపటి ఎటు దారి తీస్తుందో చూడాలి.

Exit mobile version