Site icon NTV Telugu

అవినీతిలో ఆరితేరిన గద్వాలలోని కొందరు ఖాకీలు…!

వాళ్లంతా గడుసు ఖాకీలు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడంలో సిద్ధహస్తులట. మాఫియాలతో అంటకాగడంలో వారికి మించినవాళ్లు లేరనే చర్చ డిపార్ట్‌మెంట్‌లోనే ఉందట. పైగా ఫ్రెండ్లీ పోలీస్‌ మాటకు కొత్త అర్థం చెబుతున్న పోలీసులపై పెద్ద బాస్‌లు కన్నేశారు. ఇంకేముందీ మళ్లీ చర్చలోకి వచ్చారు ఆ జిల్లాలోని పోలీసులు. వారెవరో.. ఎక్కడివారో ఈ స్టోరీలో చూద్దాం.

గద్వాల ప్రాంతంలో ఖాకీల అవినీతిపై ఓపెన్‌గానే చర్చ!

కంచే చేను మేసిన తీరుగా ఉందట గద్వాల జిల్లా పోలీసుల తీరు. నడిగడ్డ ప్రాంతంగా పిలుచుకునే ఈ జిల్లాలో లీగల్ కంటే ఇల్లీగల్‌ దందాలే ఎక్కువ. ఏపీ, కర్ణాటక సరిహద్దులు కలిసిన ఈ తెలంగాణ ప్రాంతంలో అక్రమార్కులు ఏ పని చేపట్టినా వారిని అడ్డుకునే వారు ఉండరు. పోలీస్‌శాఖలో కొందరు అవినీతి అధికారులు అన్ని విధాలా వారికి సాయం చేస్తారని ఇక్కడ ఓపెన్‌గానే చెప్పుకొంటారు. ఒకవేళ ఎవరైనా కేసుల్లో చిక్కుకుంటే.. తిమ్మిని బమ్మిని చేసైనా బయటకు పంపేస్తారట ఖాకీలు. ఈ విషయంలో పోలీసులు, రెవెన్యూ అధికారులతో అందవేసిన చెయ్యిగా చెబుతారు.

ఆరోపణలపై ఏఎస్పీ రషీద్‌ఖాన్‌ రహస్య విచారణ?

గద్వాల జిల్లాలోని పోలీస్‌ శాఖలో పనిచేస్తున్న పలువురు అధికారులు తీరుపై ఇటీవల తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఆరోపణల తీవ్రత ఘాటుగానే ఉండటంతో విచారణకు ఆదేశించారు పెద్దబాస్‌. విచారణలో ఏం తేలుతుందో ఏమో ఎంక్వైరీ పేరు వింటేనే కొందరు ఉలిక్కి పడుతున్నారు. ఇలాంటి విషయాల్లో రాటుదేలిన అధికారులు మాత్రం లైట్ తీసుకుంటున్నారట. గట్టు, ధరూర్‌, మల్దకల్‌, కేటిదొడ్డి, గద్వాల రూరల్, పట్టణ పోలీస్‌స్టేషన్ల పరిధిలో పనిచేస్తున్న కొందరు ఖాకీల పనితీరుపై వికారాబాద్‌ ASP రషీద్‌ఖాన్‌ రహస్య విచారణ చేశారట. పోలీసుల వల్ల ఇబ్బందిపడ్డ బాధితులను వికారాబాద్‌కు పిలిపించి ప్రశ్నించినట్టు తెలుస్తోంది. 2018 నుంచి ఇప్పటి వరకు జరిగిన ఘటనలు నమోదైన కేసులు.. పోలీసులపై వచ్చిన ఆరోపణలపై ఆరా తీస్తున్నారట. ఇదే సమయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖాకీల ఆస్తిపాస్తులపై ఫోకస్ పెట్టినట్టు చర్చ జరుగుతోంది.

దాడులపై ముందే మాఫియాకు లీకులు?

అలంపూర్‌ పరిధిలో ఇసుక, మట్టి, మద్యం, రేషన్‌ బియ్యం మాఫియాలు చెలరేగిపోతున్నా.. ఈ ప్రాంతంలో పోలీసులు చూసీచూడనట్లు ఉంటున్నారట. అలాంటి వారిపై కూడా పైవరకు ఫిర్యాదులు వెళ్లినట్టు చెబుతున్నారు. మాఫియా స్థావరాలపై టాస్క్‌ఫోర్స్‌ లేదా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ దాడులకు సిద్ధమైతే ఆ సమాచారాన్ని క్షణాల్లో నిర్వాహకులకు చేరవేస్తున్నారట కొందరు అవినీతి పోలీసులు. ఒకవేళ దాడులు జరిగితే మాత్రం.. అన్నీ సక్రమంగానే ఉన్నాయని సర్టిఫై చేయించడానికి చొరవ తీసుకుంటున్నారట. ఇటీవల గద్వాలలో అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని భారీగా పట్టుకున్నారు. కలెక్టరేట్‌కు చెందిన అధికారితోపాటు.. పోలీసుల అండ దండలు ఉన్నాయని తెలుసుకుని చర్యలు తీసుకున్నారు.

ఏఎస్పీ విచారణలో దొంగ ఖాకీలు చిక్కుతారా?

రాజకీయంగా ఎలాంటి విమర్శలు.. ఆరోపణలు రాకుండా.. అధికార, విపక్ష పార్టీల నాయకులతో స్నేహంగా మసులుకోవడం అవినీతి ఖాకీలకు అలవాటు. దాంతో ఈ దఫా ASP చేపట్టిన విచారణలో దొంగ పోలీసుల బండారం బయటపడుతుందా? సూత్రధారులు.. పాత్రధారుల పాపం పండుతుందా? అనే చర్చ సాగుతోంది. మరి.. ఇక్కడ అవినీతి ఖాకీల కథ కంచికి చేరుతుందో లేక కటకటలా వెనక్కి పంపుతుందో లేదో చూడాలి.

Exit mobile version