Site icon NTV Telugu

ఆ మాజీ ఎమ్మెల్యేకి ఓటమి తెచ్చిపెట్టిన కష్టాలేంటి..?

ఆయన మాజీ ఎమ్మెల్యే. అధికార పార్టీ నేత. మొన్నటి ఎన్నికల్లో గెలిస్తే మంత్రి అయ్యేవారో లేదో కానీ.. ఓటమి మాత్రం కష్టాలు తెచ్చిపెట్టింది. స్వపక్షంలోని వైరివర్గాల ఎత్తుగడలతో పవర్‌ కట్‌ అయిందనే చర్చ జరుగుతోంది. పార్టీలో ఆయన మనుగడే కష్టమైందని టాక్‌. ఇంతకీ ఎవరా నాయకుడు? అధికార పార్టీలో ఎవరితో పడటం లేదు?

ఎమ్మెల్యే చిరుమర్తి చేరిక తర్వాత వీరేశానికి కష్టాలు?

వేముల వీరేశం. ఉమ్మడి నల్లగొండ జిల్లా నకిరేకల్‌ మాజీ ఎమ్మెల్యే. 2014లో టీఆర్ఎస్‌ టికెట్‌పై గెలిచి.. ముందస్తు ఎన్నికల వరకు నియోజకవర్గంలో పూర్తిస్థాయిలో పెత్తనం చేశారు. 2018 ఎన్నికల్లో మరోసారి బరిలో దిగినా స్వల్ప తేడాతో ఓడిపోయారు. 2018లో గెలిస్తే ఎస్సీ కోటాలో మంత్రి అవ్వొచ్చని అనుకున్నారట వీరేశం. ఆ ఓటమి కుంగదీసినా.. రాష్ట్రంలో టీఆర్ఎస్‌ రెండోసారి అధికారం చేపట్టడంతో ఆయన తేరుకున్నారు. కానీ.. తనపై గెలిచిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.. గులాబీ కండువా కప్పుకోవడంతో వీరేశం బ్యాడ్‌ టైమ్ స్టార్ట్‌ అయిందని టీఆర్‌ఎస్‌ వర్గాలు కథలు కథలుగా చెప్పుకొంటాయి.

ఆధిపత్యపోరుతో పలుమార్లు రోడ్డెక్కిన అనుచరులు!

నకిరేకల్‌లో టీఆర్ఎస్‌ రెండు వర్గాలుగా విడిపోయింది. ఒక వర్గానికి ఎమ్మెల్యే లింగయ్య, మరో వర్గానికి వీరేశం కాపు కాస్తున్నారట. వీరి మధ్య ఆధిపత్యపోరు.. రోడ్డుకెక్కిన సందర్భాలూ ఉన్నాయి. మున్సిపల్‌ ఎన్నికల్లో తన అనుచరులకు టికెట్లు ఇవ్వకపోవడంతో ఫార్వర్డ్‌ బ్లాక్‌ తరఫున పోటీ చేయించారట మాజీ ఎమ్మెల్యే. ఆ మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ అభ్యర్థులు 11 వార్డుల్లో, వీరేశం అనుచరులు 6 చోట్ల గెలిచారు. ఒకరిపై ఒకరు పైచెయ్యి సాధించేందుకు ఇద్దరూ వేయని ఎత్తుగడలు లేవు. ఓ మంత్రి కూడా ఎమ్మెల్యేతో కలిసి తమను ఇబ్బంది పెడుతున్నారని వీరేశం వర్గం అనుమానిస్తోందట. ఈ గొడవల వల్ల గుర్తింపు లభించడం లేదని అనుకుంటున్నారో ఏమో.. కేడర్‌ కూడా వీరేశం దగ్గర నుంచి జారిపోతోందని ప్రచారం జరుగుతోంది.

వీరేశానికి ప్రభుత్వ భద్రత తొలగింపు!

తాజాగా వీరేశానికి భద్రతగా ఉన్న గన్‌మెన్స్‌ను ప్రభుత్వం తొలగించింది. 2 ప్లస్‌ 2గా ఉన్న భద్రతను ఉపసంహరించడంతో మళ్లీ చర్చల్లోకి వచ్చారు మాజీ ఎమ్మెల్యే. సెక్యూరిటీ విత్‌డ్రా వెనక కారణాలేవైనా.. వీరేశం వైరివర్గం ఒత్తిళ్ల వల్లే చెక్‌ పెట్టారని ప్రచారం జరుగుతోందట. ఉమ్మడి నల్లగొండ జిల్లాలకు చెందిన ఇతర మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలకు భద్రత కొనసాగుతుండగా ఒక్క వీరేశానికే ఎందుకు తొలగించారని ప్రశ్నిస్తున్నారట ఆయన అనుచరులు.

టీఆర్‌ఎస్‌లో ఉనికి కోసం పోరాటం?

గతంలో వామపక్ష ఉద్యమాల్లో చురుకుగా పనిచేశారు వీరేశం. అందువల్ల ఆయనకు ప్రాణహాని ఉందన్నది మాజీ ఎమ్మెల్యే అనుచరుల వాదన. అయితే ఇటీవల కాలంలో ఆయన తీరు.. పార్టీలో చర్చగా మారుతోందట.. అనుమానాలు రేకెత్తించేలా ఉందని టీఆర్‌ఎస్‌లో చర్చ జరుగుతోందట. పార్టీలో ప్రాధాన్యం తగ్గించడానికి అది కూడా ఒక కారణంగా వైరివర్గం ప్రచారం చేస్తోందట. మొత్తానికి టీఆర్ఎస్‌లో ఉనికి కోసం మాజీ ఎమ్మెల్యే పోరాడాల్సిన పరిస్థితి నెలకొందని వాపోతున్నారట అనుచరులు. మరి.. ఆధిపత్యపోరులో నెగ్గుకురావడానికి వీరేశం ఏం చేస్తారో చూడాలి.

Exit mobile version