మొన్నటి వరకూ ఆయన సైకిల్ పార్టీకి ఏపీ అధ్యక్షుడు. అలాంటి నాయకుడికి ఇప్పుడు సొంత ఇలాకాలోనే ఓ నేత కంట్లో నలుసులా మారారు. పార్టీలో నుంచి బహిష్కరించినా .. టీడీపీ జెండా వదలడం లేదట. కీలక నేతకు కునుకు లేకుండా చేస్తున్నారట. ఇప్పుడిదే హాట్ టాపిక్.
కళాకు కంట్లో నలుసులా మారిన కలిశెట్టి!
శ్రీకాకుళం జిల్లాకు ముఖద్వారమైన ఎచ్చెర్లలో రాజకీయం ఎప్పుడూ రసవత్తరమే. పార్టీలు అధికారంలో ఉన్నా లేకపోయినా లోకల్ పాలిటిక్స్ ఆసక్తిగా ఉంటాయి. ఒకప్పుడు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా పనిచేసిన కళా వెంకట్రావు గతంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆస్థాయి లీడర్ కాబట్టి ఎచ్చెర్లలో కళాకు తిరుగే లేదని అనుకుంటే పొరపాటే. నియోజకవర్గంలో ఆయనకు టీడీపీ బహిష్కృత నేత కలిశెట్టి అప్పలనాయుడు కంట్లో నలుసులా మారారు. కలిశెట్టి గతంలో పొందూరు మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గానూ పనిచేశారు. 2019 ఎన్నికల్లో కళా వెంకట్రావు ఓటమి తర్వాత నియోజకవర్గంలో కలిశెట్టి గేర్ మార్చడంతో టీడీపీ రాజకీయాలు ఆసక్తిగా మారాయి.
అప్పట్లోనే కలిశెట్టిపై వేటు!
ఓటమికి దారితీసిన పరిస్థితులపై కళా వెంకట్రావు ఫోకస్ పెట్టారు. ఎక్కువ సమయం ఎచ్చెర్లలోనే ఉంటున్నారు. ఈ సమయంలో తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న పార్టీ నేతలపై దృష్టి పెట్టారట కళా. గడిచిన ఐదేళ్లలో తనకు వ్యతిరేకంగా పనిచేసిన వారిపై యాక్షన్ మొదలుపెట్టారు. ఎచ్చెర్ల పార్టీ కార్యాలయంలో కళా ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుగుతున్న సమయంలోనే రణస్థలంలో కలిశెట్టి ప్రత్యేకంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. దీంతో ఎచ్చెర్ల టీడీపీలో వేరుకుంపట్లు ఉన్నాయనే చర్చ తెరపైకి వచ్చింది. దీంతో తన మాట కాదని.. సొంతంగా పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్న వారిపై యాక్షన్‌లోకి దిగిపోయారు వెంకట్రావు. పార్టీ కార్యకర్తల సమన్వయ సమావేశంలో ఆ విషయాన్ని ప్రకటించడంతోపాటు కలిశెట్టిపై వేటు వేశారు.
వేటు వేసినా.. టీడీపీ కార్యక్రమాల్లో తగ్గని కలిశెట్టి దూకుడు!
ఎలాగూ కళాతో పడదనే విషయం బయట పడింది కనుకు ఇక అంతా ఓపెన్ అన్నట్టు కలిశెట్టి కానిచ్చేస్తున్నారట. సస్పెన్ష్‌ను లైట్ తీసుకున్న ఆయన పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా తగ్గట్లేదు.
వేటు వేసి 4 నెలలైనా.. కలిశెట్టి పార్టీ జెండా పట్టుకునే తిరుగుతున్నారు. గతంలోకంటే రెట్టించిన ఉత్సాహంతో టీడీపీ కార్యక్రమాల్లో కళాకంటే ముందుగా పాల్గొంటూ.. తనకంటూ ప్రత్యేకంగా డెన్‌ను ఏర్పాటు చేసుకునే దిశగా వేగంగా పావులు కదుపుతున్నారట.
కలిశెట్టిని టీడీపీ నుంచి బహిష్కరిస్తూ మరోసారి ప్రకటన!
ఎచ్చెర్లలో కళా అండ కలిశెట్టికి లేకపోయినప్పటికీ.. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆశీసులు కలిశెట్టికి పుష్కలంగా ఉన్నట్టు టాక్. దీంతో కళా శిబిరంలో కలవరం మొదలైందట. ఇటీవల విజయనగరం జిల్లా పార్టీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున పేరిట మరోమారు కలిశెట్టిని పార్టీలోంచి తీసేశాం.. ఆయనకు టీడీపీకి ఏమీ సంబంధం లేదంటూ మరో ప్రకటన విడుదల చేయించారట. తాజా ప్రకటనే ఎచ్చెర్ల తమ్ముళ్లలో చర్చగా మారింది. టీడీపీ నుంచి పంపేసినా.. పదేపదే నియోజకవర్గంలో పసుపు జెండా పట్టుకుని శ్రేణులతో సమావేశాలు.. పలకరింపులు.. పరామర్శల పేరుతో కలిశెట్టి వ్యవహరిస్తున్న తీరు కళాకు మింగుడు పడటం లేదు. మొత్తానికి రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తికే ఈ పరిస్థితి ఎదురు కావడంతో ఎచ్చెర్ల ఎపిసోడ్ పార్టీలో ఆసక్తి రేకెత్తిస్తోంది.
