Site icon NTV Telugu

ఉమ్మడి నల్లగొండజిల్లాపై మాజీ ఐపీఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఫోకస్‌..!

పొలిటికల్‌ లీడర్‌గా మారిన ఆ మాజీ ఐపీఎస్‌.. అప్పుడే బరిపై గురిపెట్టారా? వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేయాలో గ్రౌండ్‌ ప్రిపేర్‌ చేసుకుంటున్నారా? ఆ జిల్లాపై స్పెషల్‌ ఫోకస్‌కు కారణం కూడా అదేనా? ఇంతకీ ఆయన ఎంచుకున్న నియోజకవర్గాలేంటి?

ఉమ్మడి నల్లగొండలోని మూడు నియోజకవర్గాలపై ప్రవీణ్‌ ఫోకస్‌?

ఏనుగెక్కి ప్రగతిభవన్‌కు వెళ్తామని ప్రకటించిన బీఎస్పీ నేత ప్రవీణ్‌కుమార్‌.. ఉమ్మడి నల్లగొండ జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టారట. ఇదే జిల్లాలో సభ పెట్టడం దగ్గర నుంచి.. వచ్చే ఎన్నికల వరకు ఒక ప్రణాళిక ప్రకారం ఆయన అడుగులు పడుతున్నట్టు చర్చ జరుగుతోంది. 1997లో కాన్షీరాం చివరిసారిగా సభ ఏర్పాటు చేశారని చెబుతూ.. ఎన్టీకాలేజీలో మీటింగ్‌ పెట్టినా.. వెనక మాత్రం బలమైన కారణాలు ఉన్నాయట. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా ఈ ప్రాంతంలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాలపై ఆయన గురిపెట్టినట్టు సమాచారం. వాటిల్లో ఒకటి నల్లగొండ కాగా.. మిగతావి నకిరేకల్‌, తుంగతుర్తిగా పొలిటికల్‌ వర్గాల టాక్‌. ఇప్పటి నుంచే ఈ నియోజకవర్గాల్లో బీఎస్పీ యాక్టివిటీస్‌ పెంచేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.

నకిరేకల్‌ నుంచి పోటీ చేస్తారా?

నకిరేకల్‌పై ప్రవీణ్‌ ప్రధానంగా దృష్టిపెట్టినట్టు చెబుతున్నారు. గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిన వేముల వీరేశం కొంతకాలంగా బహుజనవాదాన్ని ఎత్తుకుంటున్నారట. ఎన్టీ కాలేజీలో బీఎస్పీ సభకు ఆయన పరోక్షంగా సహకరించినట్టు ప్రచారం జరుగుతోంది. దళిత బహుజన ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉన్న నకిరేకల్‌ నుంచి పోటీ చేస్తే తప్పకుండా విజయం సాధించే వీలుందని ప్రవీణ్‌ కుమార్‌ అండ్‌ కో ఆలోచన చేస్తున్నట్టు టాక్‌.

నల్లగొండ నుంచి పోటీ చేస్తే కలిగే ప్రయోజనాలపై చర్చ!

రాజకీయ చైతన్యం కలిగిన నల్లగొండ నుంచి బరిలో దిగితే ఎలా ఉంటుందని కూడా ఒకానొక దశలో ప్రవీణ్‌కుమార్‌ చర్చించినట్టు తెలుస్తోంది. నల్లగొండ నుంచి పోటీ చేస్తే.. ఐపీఎస్‌ అధికారిగా తాను చేసిన సేవలను గుర్తుపెట్టుకుని గెలిపించే అవకాశం ఉంటుందని ఆయన భావిస్తున్నారట. జనరల్‌ స్థానం నుంచి పోటీ చేస్తే రాజకీయంగా పంపే సిగ్నల్స్‌ మరోలా ఉంటాయని లెక్కలు వేస్తున్నారట. పైగా నల్లగొండ నుంచి పోటీ చేసిన వారిలో ఎక్కువ మంది స్థానికేతరులేనని.. అది కూడా తమకు కలిసి వస్తుందని చెప్పుకొంటున్నారట.

తుంగతుర్తిపైనా బీఎస్పీ నేత ఫోకస్‌ పెట్టారా?

ఇక బీఎస్పీ సభ తర్వాత తుంగతుర్తిలో ఎమ్మెల్యే గాదరి కిషోర్‌ కామెంట్స్‌పై స్వైరోస్‌ తీవ్రంగా రియాక్ట్‌ అయింది. రెండు వర్గాల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం నడిచింది. అక్కడ ఆ హీట్‌ కొనసాగిస్తే.. వచ్చే ఎన్నికల నాటికి తుంగతుర్తి కూడా బీఎస్పీకి ప్లస్‌ అవుతుందని అనుకుంటున్నారట నాయకులు. మొత్తానికి ఈ మాజీ ఐపీఎస్‌ మనసులో ఏముందో కానీ.. నల్లగొండ, నకిరేకల్‌, తుంగతుర్తి నియోజకవర్గాల చూటూ చర్చ అయితే ఆసక్తిగా సాగుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ మూడింటిలో ఒక చోట నుంచి ప్రవీణ్‌కుమార్‌ పోటీ ఖాయమని బీఎస్పీ, స్వైరోస్‌ సభ్యులు అభిప్రాయపడుతున్నారట. మరి.. మాజీ ఐపీఎస్‌ ఎక్కడ నుంచి పోటీ చేస్తారో చూడాలి.

Exit mobile version