NTV Telugu Site icon

ధర్మకర్త అశోక్‌ గజపతిరాజు కొత్త ఎత్తుగడ…?

ఆయనేమో అనువంశిక ధర్మకర్త. వాళ్లేమో అధికారులు. ఈ రెండు వ్యవస్థల మధ్య అనూహ్యమైన గ్యాప్ వచ్చింది. కారణాలేవైనా చైర్మన్‌కు ఎదురుపడేందుకే ఈవోలు సాహసించడం లేదు. దీంతో ధర్మకర్త దండం పుచ్చుకొనేందుకు సిద్ధమయ్యారట. ఇంతకీ ఆయన ఏం చేయబోతున్నారు?

అశోక్‌తో మాట్లాడేందుకు ఈవోలు విముఖం!

సింహాచలం దేవస్థానం ఛైర్మన్ పదవి చుట్టూ పెద్ద ధారావాహికమే నడుస్తోంది. ధర్మకర్త పదవి నుంచి అశోక్ గజపతిరాజును తప్పించిన ప్రభుత్వం.. ఆ ప్లేస్‌లో సంచయితను తెచ్చి పెట్టింది. ఆమె నియామకాన్ని సవాల్ చేసి.. హైకోర్టు ఆదేశాలతో తిరిగి ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు అశోక్‌. సింగిల్‌ జడ్జి బెంచ్‌ ఉత్తర్వులకు వ్యతిరేకంగా వేసిన పిటిషన్లను హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ తోసిపుచ్చింది. న్యాయ వివాదాలు ఓఎత్తైతే.. అసలు సంకటస్థితి మాత్రం మాన్సాస్, సింహాచలం దేవస్థానం ఈవోలది. కోర్టు ఆదేశాలతో అశోక్‌ ఛైర్మన్‌గా పగ్గాలు చేపట్టి 2 నెలలు అవుతోంది. అయినప్పటికీ ఈవోలు సూర్యకళ, వెంకటేశ్వరరావులు చైర్మన్‌తో నేరుగా మాట్లాడేందుకు ఆసక్తి చూపించడం లేదట. వివిధ కారణాలతో తప్పించుకుంటున్నారనే ఆగ్రహంతో ఉన్నారు అశోక్.

నేరుగా ఈవోల ఆఫీస్‌కు వెళ్లాలని అశోక్‌ నిర్ణయం!
ఒకవైపు ప్రభుత్వం.. మరోవైపు కోర్టు.. మధ్యలో ఈవోల టెన్షన్‌!

ముఖంచాటేస్తున్న అధికారులను దారిలోకి తెచ్చుకునేందుకు ప్లాన్ బీ సిద్ధం చేశారట అశోక్‌. అనువంశిక ధర్మకర్త హోదాలో నేరుగా ఈవోల కార్యాలయాలకు వెళ్లి పరిపాలనా వ్యవహారాలను సమీక్షించాలని నిర్ణయించారట. దీంతో ఈవోలు అడకత్తెరలో పడ్డారు. అశోక్ లక్ష్యంగా ఏడాదిన్నర కాలంగా అనేక పరిణామాలు జరిగాయి. ఇప్పుడు అటు తిరిగి ఇటు తిరిగి సమస్య ఈవోల మెడకు చుట్టుకునేలా ఉందట. సింహాచలం, మాన్సాస్ ట్రస్ట్ ఈవోల తీరుపై అశోక్ గజపతిరాజు అసంతృప్తితో ఉన్నారు. ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించాక సింహాచలం ఆలయానికి, మాన్సాస్ ట్రస్ట్‌కు ఆయన వెళ్లారు. ఈ సమయంలో ఈవోలు ఆయన్ని కలిసేందుకు సాహసించలేదు. ఆయనతో మాట్లాడితే ఏమౌతుందోనని గుంభనంగా ఉండిపోయారు. ఇది అశోక్‌గజపతికి ఆగ్రహం కలిగించింది. లేఖాస్త్రాలు సంధించి లిఖిత పూర్వకంగా సమాధానాలు కోరారు. ఛైర్మన్ ఆదేశాలు బేఖాతరు చేస్తే కోర్టు ధిక్కారం అవుతుంది. అలాగని గౌరవిస్తే ప్రభుత్వం ఎలా స్పందిస్తుందోననే టెన్షన్‌ ఈవోలది.

సంచయిత తీసుకున్న నిర్ణయాలపై వివరాలు కోరిన అశోక్‌!

వాస్తవానికి కార్యనిర్వహణాధికారిగా ఎవరు ఉన్నా.. దేవస్థానం నిర్వహణ, విధాన నిర్ణయాలు, ఇతర అభివృద్ధి పనులకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఛైర్మన్‌ దృష్టికి తీసుకెళ్లాలి. సంచయిత చైర్‌పర్సన్‌గా ఉన్నప్పుడు ఈవోలు అదే చేశారు. ఇప్పుడు ఆ సాహసం చేయడం లేదు. తాను రాసిన లేఖలకు సమాధానాలు రాకపోవడంతో నేరుగా ఈవోల కార్యాలయాలకు వెళ్లాలని డిసైడయ్యారట. సింహాచలంలో ట్రస్ట్‌బోర్డు, సంచయిత తీసుకున్న ప్రతి నిర్ణయంపైన వివరాలు కోరుతూ ఈవో సూర్యకళకు ప్రత్యేకంగా ఆయన లేఖలు రాశారు. కొన్నింటికి సమాధానాలు చెప్పినప్పటికీ.. చాలా విషయాలను దాటవేశారనేది అశోక్ అభిప్రాయం.

సంచయిత కార్లను వెనక్కి ఇచ్చారా లేదా అని ఆరా!
అశోక్‌ ప్రశ్నలకు ఈవోలు ఉక్కిరిబిక్కిరి!

దేవస్థానం చైర్మన్‌గా నియమితులైన వారికి వాహన సదుపాయం కల్పించడం ఆచారం. పదవి నుంచి దిగిపోగానే ఆ కారును సరండర్‌ చేస్తారు. గతంలో అశోక్‌గజపతిరాజు అలాగే చేశారట. తిరిగి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయనకు కారు ఇవ్వలేదట. పైగా పాత చైర్‌పర్సన్‌ కారును సరెండర్‌ చేశారా.. లేదా? అని వాకబు చేశారట. సంచయిత కోసం దేవస్థానం అధికారులు రెండు కొత్త ఇన్నోవా కార్లు కొనుగోలు చేశారు. ఇవి వెనక్కి వచ్చాయా.. లేదా? అన్నది అశోక్‌ ప్రశ్న. పంచ గ్రామాల సమస్యపై ప్రభుత్వం, ప్రత్యేకంగా ఏర్పాటైన కమిటీలు ఏమైనా నిర్ణయాలు తీసుకున్నాయా? వాటిపై దేవదాయ శాఖ చేసిన ప్రతిపాదన ఏమిటి? అంటూ ఆయన ప్రశ్నించారు. ఈ ప్రశ్నల పరంపరతో ఈవోలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారట. ఇప్పుడు ముఖాముఖి మాట్లాడేందుకు నేరుగా ఛైర్మన్ రంగంలోకి దిగితే ఏంటన్నది వారికి అర్థం కావడం లేదట. దానిపైనే ఇప్పుడు చర్చ జరుగుతోంది.