Site icon NTV Telugu

సీఎం జగన్‌ కాళ్లకు మొక్కిన డిప్యూటీ సీఎం…

రెండున్నరేళ్ల డెడ్‌లైన్‌ దగ్గర పడుతోంది. మంత్రుల్లో టెన్షన్‌ మొదలైంది. ఎంత లేదన్నా పవర్‌ పవరే కదా? దాన్ని కాపాడుకోవడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారు. అవసరం లేకుండా తాను సశ్చీలుడునని చెప్పుకొంటున్నారు ఓ డిప్యూటీ సీఎం. అంతేకాదు చివరకు తనకంటే వయసులో చాలా చాలా చిన్నవాడైన సీఎం జగన్‌ కాళ్లమీద పడ్డారు. ఇవన్నీ ఆయన పవర్ని కాపాడతాయా?

నిజాయితీగా పేదవారి కోసం పనిచేశానని చెబుతున్నారు
ఎవరు కనిపించినా ఒకటే పాట పాడుతున్న డిప్యూటీ సీఎం!

మంత్రి పదవి రాగానే ఏసీ రూముల్లో కూర్చొని ఎంజాయ్‌ చేస్తామంటే కుదరదు. పని చేసి ప్రజల్లో మార్కులు సంపాదించాలి. పరీక్షలు రాసి అధినేత దగ్గర మార్కులు తెచ్చుకోవాలి. ఈ రెండింటిలో ఏ మాత్రం తేడా వచ్చినా పదవి హుష్‌ కాకి. ఇప్పటికే రకరకాల టెస్టులు రాసిన ఏపీ మంత్రులకు.. పరీక్షల ఫలితాలు సిద్ధమవుతున్న వేళ నిద్రపట్టడం లేదని టాక్. ‘మా అధినేత జగన్.. మాకు పదవులు ఇచ్చేటప్పుడే చెప్పారు. రెండున్నర సంవత్సరాల తర్వాత మీ అవసరం ఉంటే ఉంటారు లేదంటే లేదని. నేను నిజాయితీగా పనిచేశాను. పేదవారికోసం పనిచేశాను. ఇప్పుడు నా పదవీ గురించి మీరంతా మట్లాడుతున్నారు’ అని ఓ సమావేశంలో చెప్పుకొచ్చారు డిప్యూటీ సీఎం నారాయణస్వామి. అసలు సమావేశం ఒకటైతే.. నారాయణ స్వామి అక్కడ మాట్లాడింది ఇంకొకటి. ఉన్నట్టుండి మంత్రి ఎందుకీ కామెంట్స్‌ చేశారని వైసీపీలో చర్చిస్తున్నారు. ఎవరు చేయని విధంగా నేను పనిచేశాను. ఒక్క రూపాయి అవినీతి చేయలేదని అవసరం ఉన్న లేకపోయినా.. సభలు, సమావేశాలు, సమీక్షల్లో.. ఆఖరికి మీడియా కనిపించినా డిప్యూటీ ఒకటే పాట పాడుతున్నారట. ఇవన్నీ వింటున్న అనుచరులు, నాయకులు.. ఎక్కడో ఏదో తేడా కొడుతోందే అన్నట్టుగా చెవులు కొరుక్కుంటున్నారు.

డిప్యూటీ సీఎం అయ్యాక వరస వివాదాలు!

నారాయణస్వామి.. జిల్లా వైసీపీలో సీనియర్ లీడర్. వరసగా మూడుసార్లు గంగాధరనెల్లూరు నుంచి గెలుపొందారు. ఎమ్మెల్యేగా పనిచేసినా సమయంలో ఎటువంటి ఇబ్బందులు పడని ఆయనకు డిప్యూటీ సీఎం అయ్యాక ఏ మంత్రి ఎదుర్కోని ఇబ్బందులు వచ్చాయట. ముఖ్యంగా డాక్టర్‌ అనితారాణి వ్యవహారం కావచ్చు.. మైనారిటిలను కించపరచే విధంగా మాట్లాడరని వచ్చిన విమర్శలు కావచ్చు.. ఎమ్మెల్యే రోజాతో గొడవలు.. ఇలా వరసగా ఆయన్ని వివాదాలు చుట్టుముట్టాయి. ఇప్పుడు అవన్నీ ఆయనకు పదవీ పోడిగింపునకు ఇబ్బందిగా మారాయని జిల్ల్లాలో టాక్‌. ఇదే విషయాన్ని స్వయంగా నారాయణస్వామి ప్రతిసభలో ప్రస్తావిస్తున్నారు. ఇప్పుడు అంతా తన పదవి ఉంటుందా పోతుందా అని మాట్లాడుతున్నారట.

ఏదో అనుమానం.. భయం వెంటాడుతున్నాయి

డ్యామేజ్‌ కంట్రోల్‌ చేయడానికి తాను అభివృద్ధి చేశానని.. ఒక్కరూపాయి అవినీతి లేకుండా పనిచేశానని సమయం దొరికినప్పుడల్లా చెబుతున్నారు నారాయణస్వామి. పంచాయతీ ఎన్నికల ఫలితాల ద్వారా అధినేత దగ్గర మంచి మార్కులు వచ్చాయని.. తనకు ఎలాంటి ఇబ్బంది లేదని కొన్ని కామెంట్స్‌ చేస్తున్నారట. మొత్తానికి రెండున్నరేళ్లలో మంత్రి పదవిలో తనకు పాస్‌ మార్కులు పడతాయని పైకి చెబుతున్నా ఎక్కడో ఏదో అనుమానం, భయం ఆయన్ను వెంటాడుతున్నాయని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయట.

నాడు తలలు ఊపి.. ఇప్పుడు కొనసాగింపుపై ఆశలు

రెండున్నరేళ్లు అయినా చాలు చాలు అని నాడు సీఎం జగన్‌ దగ్గర తలలు ఊపిన వాళ్లంతా ఇప్పుడు కొనసాగింపు కోరుకుంటున్నారు. నారాయాణస్వామి కూడా అదే జాబితా. ఎందుకైనా మంచిదని తన క్యారెక్టర్‌ను ఏకరవు పెడుతున్నారు. అంతేనా.. వయసులో తనకంటే సంగం కూడా లేని సీఎం జగన్‌ కాళ్ల మీద కూడా పడ్డారు. ‘పవర్‌’ అలాంటది మరి..!

Exit mobile version