Site icon NTV Telugu

ఏపీ బీజేపీ నేతలు రూటు మార్చారా…?

పాత చింతకాయ పచ్చడిలా ఉండే ఏపీ బీజేపీ నేతలు.. రూటు మార్చారా? చేస్తున్నదానికీ.. చేయాల్సిన దానికీ తేడా తెలుసుకున్నారా? రెండేళ్ల తర్వాత ఇప్పుడు లైన్‌లోకి వెళ్లారా?

ఏపీ ప్రభుత్వంపై బీజేపీ సమావేశంలో తీవ్ర విమర్శలు!

ఏపీ బీజేపీలో రకరకాల గ్రూపులు. అంతా పార్టీ విధేయులైనా ఆయా అంశాలపట్ల ఎవరి తీరు వారిదే. ప్రభుత్వంతో ఎలా ఉండాలి? ప్రధాన ప్రతిపక్షంతో ఎలా వ్యవహరించాలన్న విషయంలోనూ ఎవరి గ్రూప్ వారిదే. అయితే కొద్దిరోజుల క్రితం జరిగిన బీజేపీ రాష్ట్ర కమిటీ సమావేశంలో పక్కా ఛేంజ్‌ కనిపించిదట. ఏపీ సర్కార్‌ను ఒకమాట అనాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకునే నాయకులు ఎగబడి విమర్శలు చేశారట. సమావేశానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారికి.. ఆ మాటలు.. విమర్శలు కాస్త కొత్తగా అనిపించాయట.

గతానికంటే భిన్నంగా సాగిన సమావేశం

ధాన్యం కొనుగోలు, పన్నుల పెంపు వంటి అంశాలపై ఇప్పటికే నిరసన తెలిపిన బీజేపీ తదుపరి కార్యచరణపై సమావేశం పెట్టుకుంది. ఆ భేటీలో వైసీపీ లక్ష్యంగా హాట్ కామెంట్స్ చేశారట పార్టీ నేతలు. అధికారపక్షాన్ని విపక్షం విమర్శించడం సాధారణమే అయినప్పటికీ గతానికంటే భిన్నంగా జరిగిందట సమావేశం.

ఏపీ పదేళ్లు వెనక్కి పోయిందని నేతల ఫైర్‌!

ఏపీలో రాజకీయంగా వ్యాక్యూమ్‌ ఉందని.. దానిని ఫిల్‌ చేయాలనేది బీజేపీ ఆలోచన. ఆ క్రమంలోనే వైసీపీ సర్కార్‌ రెండేళ్ల పాలనపై సమావేశంలో తీర్మానం చేసింది. ఈ రెండేళ్లలో ఏపీ పదేళ్లు వెనక్కి పోయిందని మండిపడ్డారట నాయకులు. విమర్శల ఘాటు పెంచారట. గతంలో ఆచితూచి పదప్రయోగం చేసిన ఎంపీ జీవీఎల్‌ సైతం రూటు మార్చడం ఆశ్చర్యపరిచినట్టు చెబుతున్నారు. పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోతున్నాయని.. శాంతిభద్రతలు సరిగా లేవని మండిపడ్డారట. కేంద్రం ఇస్తున్న నిధులతో చేపట్టిన పోలవరం తప్ప రాష్ట్రంలో మరే ఇరిగేషన్‌ ప్రాజెక్టు పనులు సాగడం లేదని అభిప్రాయపడ్డారట కమలనాథులు.

మిల్లర్లతో మంత్రులు కుమ్మక్కైయ్యారని ఆరోపణలు

ఇప్పటికే ప్రభుత్వ వైఫల్యాలపై ఏపీ బీజేపీ చీఫ్‌ సోము వీర్రాజు పదునైన వ్యాఖ్యలు చేస్తున్నారు. మిల్లర్లతో మంత్రులు కుమ్మక్కై రైతులను దోచేస్తున్నారని ఆయన సమావేశంలో ఆరోపించారట. కేంద్రం నిధులు వాడుకుంటూ ఎక్కడా ప్రధాని మోడీ పేరు చెప్పడం లేదని బాధపడ్డారట బీజేపీ నాయకులు. ఇలా చాలా అంశాలు స్టేట్‌ కమిటీలో ప్రస్తావనకు రావడం.. గతానికంటే భిన్నంగా వాటిపై స్పందిచడమే పార్టీ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది.

చంద్రబాబు, గత ప్రభుత్వ ప్రస్తావన లేకుండా సాగిన సమావేశం

ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించాల్సి వస్తే గత సర్కార్‌ను ప్రస్తావించకుండా బీజేపీ నేతలు ప్రకటనలు చేయరనే అభిప్రాయం.. చర్చ ఉంది. ఈసారి మాత్రం గత ప్రభుత్వం పేరు, చంద్రబాబు ప్రస్తావన లేకుండానే సమావేశం జరిగిందట. ముఖ్యంగా అటు ఇటుగా మాట్లాడతారనే వారు కూడా ఒకే లైన్‌లో తమ అభిప్రాయలు చెప్పారట. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర ఇంచార్జ్, కేంద్రమంత్రి మురళీధరన్‌ హాజరయ్యారు. ప్రజా సమస్యలపై ప్రత్యేక ప్రణాళికతో పోరు మొదలు పెట్టాలని ఆయన సూచించారట. మరి.. మారిన వైఖరి.. పదునైన విమర్శలు అంతర్గత సమావేశాలకే పరిమితమా.. లేక బయట కూడా దూకుడుగా వెళ్తారో లేదో చూడాలి.

Exit mobile version