అధికారంలో లేకపోయినా సరే అస్సలు తగ్గట్లేదు. అదే పంతాలు.. అవే పట్టింపులు. ప్రస్తుతం ఆ పార్లమెంట్ పరిధిలోని టీడీపీ నేతల తీరు అలాగే ఉంది. నాలుగు నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ఇప్పుడేంటో కూడా తెలియదు. అయినప్పటికీ అక్కడి నేతలు తాము చెప్పిన వారికే పదవులు ఇవ్వాలని పంతం పడుతున్నారట. ఫలితంగా పార్లమెంట్ కమిటీ ఎంపికను అధిష్ఠానం ఎటూ తేల్చలేదు. ఈసారి మాత్రం సరికొత్త వ్యూహాం రచిస్తోందట. అదేంటో ఇప్పుడు చూద్దాం.
అనంతపురంలో పార్టీ కమిటీ ఏర్పాటులో టీడీపీ దూకుడికి బ్రేక్!
టీడీపీ అధిష్ఠానానికి కొరకరాని కొయ్యగా మారారట అనంతపురం పార్టీ నేతలు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా రాష్ట్రంలో పార్టీ కమిటీలను ఏడాది క్రితం ప్రకటించారు. కొన్నిచోట్ల అధ్యక్షులను ఎంపిక చేసి మిగతా కమిటీ సభ్యులను వదిలేశారు. దీనికి కారణం ఆయా నియోజకవర్గాల్లో ఏకాభిప్రాయం లేకపోవడమే. ఆ కోవలోకే అనంతపురం వస్తోందట. అనంతపుర పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడుగా మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు.. హిందూపురం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు బీకే పార్థసారధి ఉన్నారు. వీరిద్దరూ బోయ, కురుబ సామాజికవర్గాలకు చెందినవారు. హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శిగా అంబికా లక్ష్మీనారాయణను నియమించారు. అక్కడ సమస్య రాలేదు. కానీ.. అనంతపురంలో మాత్రం పార్టీ దూకుడికి బ్రేక్ పడింది.
పదవుల కోసం శింగనమల, ఉరవకొండ టీడీపీ నేతల పట్టు!
అనంతపురం పార్లమెంట్ పరిధిలోని రెండు మూడు నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరు నడుస్తోందట. అంతేకాకుండా శింగనమల, ఉరవకొండ నియోజకవర్గాలల్లో ఎవరికి వారు ప్రధాన కార్యదర్శి పోస్ట్ కోసం పట్టుబడుతున్నారట. రామలింగారెడ్డి, శ్రీధర్ చౌదరి అనే నేతలిద్దరూ పోటీ పడుతున్నట్టు చెబుతున్నారు. ప్రధాన కార్యదర్శితోపాటు మిగిలిన పదవులను కూడా తమవారికి ఇవ్వాలంటే తమవారికి ఇవ్వాలని నియోజకవర్గ ఇంఛార్జిలు పట్టుబడుతున్నారట. ఇది టీడీపీ అధిష్ఠానానికి పెద్ద తలనొప్పిగా మారింది.
పదవి ఏదైనా సరే మా వాళ్లకే ఉండాలన్నది నేతల కాన్సెప్ట్!
టీడీపీ అధికారంలో ఉన్న సమయంలోనూ అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఇలాంటి తలనొప్పే ఉండేది. కనీసం ఇప్పుడు అధికారంలో లేం కదా.. అని సర్దుకుని ధోరణి ఏ ఒక్క నేత చేయడం లేదు. పదవి ఏదైనా సరే మా వాళ్లకే ఉండాలన్నదే వాళ్ల లెక్క. అందుకే ఎక్కడా తగ్గట్లేదు. దీంతో టీడీపీ అధిష్ఠానం ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఇప్పటికే కాలాతీతం కావడంతో పూర్తిస్థాయి కమిటీని ప్రకటించేందుకు త్రిసభ్య బృందాన్ని ఏర్పాటు చేయబోతున్నారట. ఆ త్రిసభ్య బృందంలోని నాయకులు అన్ని నియోజకవర్గాల నుంచి అభిప్రాయాలను తీసుకుని ఒక క్లారిటికీ వస్తారని సమాచారం. మరి.. ఏడాదిగా జరగని పని.. త్రిసభ్య కమిటీతో కొలిక్కి వస్తుందో లేదో చూడాలి.
