NTV Telugu Site icon

రసవత్తరంగా ఆమదాలవలస రాజకీయం.. తమ్మినేని తనయుడు వర్సెస్ కూన రవి !

లోకల్‌ ఫైట్‌ సమయంలో హీటెక్కిన అక్కడి రాజకీయం చల్లారలేదు. ఇంతలో తండ్రికి తనయుడు కూడా తోడయ్యారు. ఇద్దరూ కలిసి ప్రత్యర్థిని కార్నర్‌ చేస్తున్నారు. ప్రత్యర్థి కూడా తక్కువేమీ కాదు. ఒకే బ్లడ్‌. ఒకే కుటుంబం. ఏదైనా అంటే సర్రున లేస్తున్నారు. ఇంతకీ ఎవరా నాయకులు? ఏమా కథ?

మొన్నటి వరకు తమ్మినేని వర్సెస్‌ కూన

శ్రీకాకుళం జిల్లాలో ఫ్యామిలీ పాలిట్రిక్స్‌కు కేరాఫ్ అడ్రస్ అయిన ఆమదాలవలసలో ఇప్పుడు సరికొత్త రాజకీయం రాజుకుంటోంది. ఏడాది క్రితం వరకూ మేనల్లుడు ఏం మాట్లాడినా కౌంటర్ ఎటాక్‌కు దిగిపోయే స్పీకర్‌ తమ్మినేని సీతారాం రూటు మార్చేశారట. పంచాయతీ ఎన్నికలకు ముందు వరకు లోకల్‌ పాలిటిక్స్‌ తమ్మినేని సీతారాం వర్సెస్ కూన రవికుమార్ అన్నట్టు ఉండేది. అలాంటిది తమ్మినేని ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. ఆయన మేనల్లుడు, టీడీపీ నేత రవికుమార్‌ మాత్రం పంథాను మార్చుకోలేదు. అవకాశం చిక్కితే మామను కార్నర్ చేస్తూనే ఉన్నారు. ఇదే సమయంలో నియోజకవర్గానికి తన కుమారుడిని పరిచయం చేయాలని అనుకున్నారో ఏమో.. కూనపైకి తన కూనను ఉసిగొల్పుతున్నారట తమ్మినేని.

read more : 2023లో టీఆర్ఎస్ ఓటమి ఖాయం : ఈటల

ఇప్పుడు కూన వర్సెస్‌ తమ్మినేని తనయుడు

కూన రవిపైకి తన వారసుడైన చిరంజీవి నాగ్‌ను దించారు తమ్మినేని. స్పీకర్‌ రాజకీయాలు మాట్లాడొచ్చా అని విమర్శలు చేస్తున్నవారికి చెక్‌ పెట్టాలనే ఈ వ్యూహం ఎంచుకున్నట్టు పైకి చెబుతున్నా.. కుమారుడి భవిష్యత్‌కు ఇప్పటి నుంచే ఆయన బాట వేస్తున్నారని అనుకునేవాళ్లూ ఉన్నారు. రవి మాత్రం.. మామ.. అల్లుడు అని తేడా లేకుండా తమ్మినేనిని.. ఆయన కుమారుడిని వదిలి పెట్టడం లేదు.

పరిషత్‌ ఎన్నికల్లో ఇరకాటంలో పడ్డ కూన

పరిషత్ ఎన్నికల సమయంలో జరిగిన ఓ గొడవలో రవికుమార్‌ ఇరకాటంలో పడ్డారు. కేసులో ఇరుక్కున్నారు. ఇలా కేసుల్లో బుక్కవడం.. బెయిల్ తెచ్చుకోవడం ఆయనకు కొత్తేమీ కాకపోయినా.. దూకుడు మాత్రం తగ్గించడం లేదు. అందువల్లే పంచాయతీ ఎన్నికల నాటి నుంచి వైరిపక్షాల మధ్య ఓ రేంజ్‌లో మాటల యుద్ధం నడుస్తోంది.

ఆసక్తిగా మారిన ఆమదాలవలస రాజకీయం

ఇరు కుటుంబాల మధ్య నడుస్తోన్న సవాళ్లతో ఆమదాలవలసలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అప్పట్లో ఆ మామా అల్లుళ్లు…ఇప్పట్లో ఈ మామా అల్లుళ్లు అని చెవులు కొరుక్కుంటున్నారు జనం. మరి.. వచ్చే ఎన్నికల నాటికి ఎవరు పైచెయ్యి సాధిస్తారో చూడాలి.