Site icon NTV Telugu

భారత్‌లో ‘ఒమిక్రాన్‌’ టెన్షన్‌..! సౌతాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తికి పాజిటివ్..

ఇప్పుడు అందరినీ టెన్షన్‌ పెడుతోన్నది ఒక్కటే.. అదే కరోనా ఒమిక్రాన్‌ వేరియంట్.. ఇప్పటికే 13 దేశాలను చుట్టేసింది ఈ కొత్త రూపంలోని కోవిడ్.. ఇక, ఈ వేరియంట్‌ వెలుగుచూసిన సౌతాఫ్రికా నుంచి ఎవరు వచ్చినా అనుమానంగా చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.. తాజాగా సౌతాఫ్రికా నుంచి మహారాష్ట్రలోని థానేకు ఓ వ్యక్తికి వచ్చాడు.. అయితే, అతడి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్‌గా తేలింది.. దీంతో అతడిని ఐసోలేషన్‌లో పెట్టారు అధికారులు..

Read Also: భారీ వర్షాల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అలెర్ట్..

థానేలోని దొంబివ్లీ ప్రాంతానికి చెందిన ఆయన ఈనెల 24వ తేదీన సౌతాఫ్రికా నుంచి ఢిల్లీకి వచ్చాడు.. ఆ తర్వాత ముంబైకి వెళ్లాడు.. కరోనా పాజిటివ్‌గా తేలడంతో.. అతడి నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపించామని వైద్యులు తెలిపారు. అతని కుటుంబ సభ్యులకు కూడా పరీక్షలు చేశామని.. సోదరునికి మినహా మిగతా అందరికీ పాజిటివ్‌గా తేలిందని.. అందరినీ ఐసోలేషన్‌లో పెట్టామని అధికారులు చెబుతున్నారు. అయితే, వారికి సోకింది.. ఒమిక్రాన్‌? లేదా మరో వేరియంటా? అనేది తేలాల్సి ఉంది. మరోవైపు.. సౌతాఫ్రికా నుంచి బెంగళూరు వచ్చిన ఇద్దరు ప్రయాణికులకు కూడా పాజిటివ్‌ వచ్చిన విషయం తెలిసిందే కాగా.. అది ఒమిక్రాన్‌ కాదని, డెల్టా స్ట్రెయిన్‌ అని పరీక్షల్లో తేలిన సంగతి తెలిసిందే.

Exit mobile version