Site icon NTV Telugu

అలరించిన అభినేత్రి ప్రియమణి

South actress Priyamani Birth Day Special

(జూన్ 4న ప్రియమణి పుట్టినరోజు)
తెలుగు చిత్రాలతోనే వెలుగు చూసిన కన్నడ కస్తూరి ప్రియమణి. అందం, అభినయం కలబోసుకున్న ప్రియమణి తెలుగునాట తకధిమితై తాళాలకు అనువుగా చిందులు వేసింది. కనువిందులు చేసింది. తమిళ చిత్రం ‘పరుతివీరన్’తో ఉత్తమనటిగా జాతీయ అవార్డును సొంతం చేసుకున్న ప్రియమణి, తన దరికి చేరిన ప్రతీపాత్రకూ న్యాయం చేయాలని తపించింది. దక్షిణాది నాలుగు భాషల్లోనే కాదు, ఉత్తరాదిన హిందీలోనూ ప్రియమణి అభినయం అలరించింది. అయితే ప్రియమణికి మాత్రం తెలుగు చిత్రాలతోనే అశేష ప్రేక్షకాభిమానం లభించిందని చెప్పవచ్చు.

చూడగానే బాగా పరిచయం ఉన్న అమ్మాయిలా కనిపించే ప్రియమణి అభినయంతో పాటు అందాల ఆరబోతతోనూ అలరించింది. అందువల్లే ప్రియమణి అభిమానగణాలకూ కొదువలేదు. టాలీవుడ్ టాప్ స్టార్స్ తోనూ, యంగ్ హీరోస్ తోనూ ప్రియమణి నర్తించిన తీరు ప్రేక్షకులకు పరమానందం పంచింది. తెలుగులో ప్రియమణి పలుచిత్రాలలో నటించినా, రాజమౌళి ‘యమదొంగ’లో జూ.యన్టీఆర్ జోడీగా ఆమె అలరించిన వైనం జనాన్ని భలేగా ఆకట్టుకుంది. నాయికగా అనేక చిత్రాలలో సందడి చేస్తూ సాగిన ప్రియమణి ‘చెన్నై ఎక్స్ ప్రెస్’ హిందీ సినిమాలో ఐటమ్ గాళ్ గానూ మురిపించింది. పెళ్ళయిన తరువాత ప్రియమణి నటనకు గుడ్ బై చెబుతుందేమో అనుకున్నారు. అయినా, తన వద్దకు వచ్చిన అవకాశాలను సక్రమంగా వినియోగించుకుంటున్నారామె. రానా ‘విరాటపర్వం’లో కామ్రేడ్ భారతక్కగా నటించిన ప్రియమణి, ‘నారప్ప’లో వెంకటేశ్ సరసన నటిస్తోంది. ఈ రెండు తెలుగు చిత్రాలతో పాటు తమిళ, కన్నడ సినిమాల్లోనూ ప్రియమణి తన అభినయంతో ఆకట్టుకోనుంది. పెళ్ళయ్యాక కూడా బిజీగా సాగుతోన్న ప్రియమణి రాబోయే తన చిత్రాలలో ఏ తీరున సాగారో చూడాలి.

Exit mobile version