NTV Telugu Site icon

కరిగిపోయిన ‘సిరివెన్నెల’…

తనదైన శైలితో తెలుగువారిని విశేషంగా అలరించిన గీత రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి శాశ్వతంగా కలం మూసేశారు. తెలుగు సినిమా పాటలతోటలో సీతారామశాస్త్రి వాణి, బాణీ ప్రత్యేకమైనవి. ‘సిరివెన్నెల’ సినిమాలో అన్ని పాటలూ పలికించి, జనాన్ని పులకింప చేసిన సీతారామశాస్త్రి, ఆ సినిమా టైటిల్ నే ఇంటిపేరుగా మార్చుకున్నారు. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగా జేజేలు అందుకున్న ఆయన కొద్ది రోజుల క్రితం కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. నిమోనియాతో బాధపడుతున్నట్టు వైద్యులు తెలిపారు. అప్పటి నుంచీ వెంటిలేటర్ పై ఉన్న సీతారామశాస్త్రి మంగళవారం తుదిశ్వాస విడిచారు. సీతారామశాస్త్రి వయసు 66 సంవత్సరాలు. ఆయనకు భార్య పద్మావతి, ఇద్దరు కుమారులు యోగి, రాజా ఉన్నారు.

సీతారామశాస్త్రి ఇంటిపేరు చేంబోలు. 1955 మే 20న ఆయన జన్మించారు. వారి స్వస్థలం అనకాపల్లి. పదవతరగతి వరకు ఆయన విద్యాభ్యాసం అనకాపల్లిలోనే సాగింది. కాకినాడలో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎమ్.ఏ. చేస్తున్న సమయంలోనే ఉద్యోగంలో చేరారు. అప్పట్లో ‘భరణి’ కలం పేరుతో కవిత్వం రాసేవారు సీతారామశాస్త్రి. కళాతపస్వి కె.విశ్వనాథ్ కు పరిచయస్థుల వల్ల సీతారామశాస్త్రి కవిత్వం గురించి తెలిసింది. కె.విశ్వనాథ్ చిత్రాల ద్వారా ఎంతో పేరు గడించిన వేటూరి సుందరరామమూర్తి, అప్పట్లో బిజీ అయిపోయారు. అందువల్ల కె.విశ్వనాథ్ కొత్తవారికి అవకాశం కల్పిద్దాం అన్నట్టు తాను తెరకెక్కించిన ‘జననీ జన్మభూమి’లో సీతారామశాస్త్రికి తొలి అవకాశం కల్పించారు. అందులో “తడిసిన అందాలలో…” పాటను పలికించారు సీతారామశాస్త్రి. ఆ తరువాత విశ్వనాథ్ రూపొందించిన ‘సిరివెన్నెల’లో ఆయనకు అన్ని పాటలూ రాసే అవకాశం కల్పించారు. అందులో “విధాత తలపున ప్రభవించినది…” పాట విశేషాదరణ చూరగొంది. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినా, సాహిత్యం జనాన్ని పులకింప చేసింది. దాంతో సీతారామశాస్త్రి పేరు ముందు ‘సిరివెన్నెల’ ఇంటిపేరుగా నిలచిపోయింది.

‘సిరివెన్నెల’ పాటలతో తొలి నంది అవార్డును అందుకున్న సీతారామశాస్త్రి వరుసగా మూడేళ్ళు ఉత్తమ గేయరచయితగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వ నంది అవార్డులు సొంతం చేసుకొని ‘హ్యాట్రిక్’ సాధించారు. ఇక మొత్తం 11 సార్లు ఆయన ఉత్తమ గీత రచయితగా నంది అవార్డులు సంపాదించడం విశేషం! 2019లో ఆయనను కేంద్రప్రభుత్వం ‘పద్మశ్రీ’ అవార్డుతో గౌరవించింది. చిత్రసీమలో ఎంతోమంది యువదర్శకులకు సీతారామశాస్త్రి పాటలు కలసివచ్చాయి. రామ్ గోపాల్ వర్మ మొదలు మొన్నటి క్రిష్ దాకా, నేటి యంగ్ డైరెక్టర్స్ వరకు సీతారామశాస్త్రి పాటలతోనే పలువురు విజయాలను సాధించారు. అందుకే వారందరూ ఆయనను ‘గురువు గారు’ అంటూ గౌరవిస్తూంటారు. ఇక సీతారామశాస్త్రి సైతం తన నిర్మాతలు, దర్శకులు మెచ్చేలా పాటలు రాసి పరవశింపచేశారు. అందువల్ల ఆయన పాట కోసమే దర్శకనిర్మాతలు ఎందరో వేచి ఉండేవారు. సీతారామశాస్త్రి ఎంత బిజీగా ఉన్నా, ఆయనతో ఒక్క పాటయినా రాయించాలని తపించేవారు ఆయన అభిమాన నిర్మాతలు, దర్శకులు.

రాజమౌళి తాజా చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్.’లో సీతారామశాస్త్రి రాసిన “దోస్తీ…” పాట వచ్చీ రాగానే జనాన్ని భలేగా ఆకట్టుకుంది. ఇప్పటికే 33 మిలియన్లకు పైగా వ్యూస్ సంపాదించిందీ గీతం. “ఉలికీ విలుకాడికీ… తలకీ ఉరితాడుకీ… కదిలే కార్చిచ్చుకి… కసిరే వడగళ్ళకి… రవికి మేఘానికీ… దోస్తీ దోస్తీ… దోస్తీ…” అంటూ ఈ పాట సాగుతుంది. వైరుద్ధ్య కవిత్వంతో “ఆది భిక్షువు వాడిని ఏది కోరేది…” అంటూ సిరివెన్నెల సాగించిన పాటల ప్రయాణం అదే తీరున “దోస్తీ…” గీతంలోనూ పయనించడం గమనార్హం! ఆయన మృతి తెలుగు చిత్రసీమను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని పలువురు సినీప్రముఖులు కోరారు. సీతారామశాస్త్రి కుటుంబానికి తీవ్రసంతాపం వెలిబుచ్చారు.

https://youtu.be/bB9f2ttINxU