NTV Telugu Site icon

రివ్యూ: షేర్నీ (హిందీ సినిమా)

జాతీయ ఉత్తమ నటిగా అవార్డును అందుకున్న విద్యాబాలన్ గత యేడాది మేథమెటీషియన్ శకుంతల దేవి బయోపిక్ లో నటించారు. అది ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యింది. ఈ యేడాది కూడా డాక్యూ డ్రామాను తలపించే ‘షేర్నీ’ మూవీలో ఆమె యాక్ట్ చేశారు. గత శుక్రవారం నుండి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. 2018లో మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లాలో అవని (టి 1) అనే ఆడపులి దాదాపు పదమూడు మందిపై దాడి చేసి చంపేసింది. ఆ మ్యాన్ ఈటర్ ను కొందరు వేటగాళ్ళు హతమార్చారు. దానిపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. పులికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి, సజీవంగా పట్టుకుని అడవిలో వదిలే ప్రయత్నం చేయకుండా క్రూరంగా చంపేశారని, అసలు అది మ్యాన్ ఈటర్ అనడానికి ఆధారాలు లేవని కొందరు వన్యప్రాణ సంరక్షకులు ఆందోళన చేశారు, కోర్టు తలుపులూ తట్టారు. ఈ అంశాలనే ఆధారం చేసుకుని కోర్టు డ్రామా లేకుండా దర్శకుడు అమిత్ మసూర్కర్ ‘షేర్నీ’ సినిమాను తీశారు.

కథ విషయానికి వస్తే… విద్యా విన్సెంట్ (విద్యా బాలన్) డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్. దాదాపు ఎనిమిదేళ్ళు డెస్క్ వర్క్ చేసి, ఫీల్డ్ లోకి వస్తుంది. వచ్చి కూడా కేవలం ఒకటిన్నర మాసాలే అవుతుంది. ఒంటరి మహిళగా ఆ అటవీ ప్రాంతంలో ఉద్యోగం చేయలేక రాజీనామా చేస్తానని ముంబైలో ఉండే భర్త పవన్ (ముకుల్ చద్దా)కు చెప్పినా, అతను ససేమిరా అంటాడు. ప్రభుత్వ ఉద్యోగం వదులుకోవడం మూర్ఖత్వమని వాదిస్తాడు. ప్రేమించి పెళ్ళి చేసుకున్న భర్త మాట కాదనలేక పంటి బిగువన ఉద్యోగ ధర్మాన్ని ఆమె నిర్వర్తిస్తుంటుంది. అంతలోనే విద్య పరిథిలోని అటవీ ప్రాంతంలో ఓ ఆడపులి గిరిజనులను చంపటం ప్రారంభిస్తుంది. ప్రభుత్వ పరంగా విద్య ఎలాంటి నివారణ చర్యలను చేపట్టినా, ఆమె పై అధికారి బన్సాల్ (బిజేంద్ర కాలా) మోకాలడ్డుతుంటాడు. గిరిజన ప్రాంతంలోని రెండు రాజకీయ పార్టీల నేతలు ఈ అంశాన్ని ఓటు పాలిటిక్స్ గా మార్చేస్తారు. అటవీ అధికారుల మీదకి గిరిజనులను దాడికి పురికొల్పి, వారి వాహనాన్ని దగ్దం చేస్తారు. రోజు రోజుకూ పరిస్థి చేయి దాటి పోతుంటుంది. సందట్లో సడేమియా అన్నట్టుగా పింకు (శరత్ సక్సేనా) పులుల్ని వేటాడంలో తాను సిద్ధహస్తుడినని తనను ఉపయోగించుకోమని అటవీ అధికారులపై ఒత్తిడి తెస్తాడు. ఈ మొత్తం వ్యవహారంలో విద్యకు అండగా నిలిచేది ఒక్క జువాలజీ ప్రొఫెసర్ కమ్ డీఎన్ఎ పరీక్షలు చేసే హసన్ నురానీ (విజయ్ రాజ్) మాత్రమే. అతని సహాయంతో విద్య… షేర్నీ నుండి గిరిజనులను రక్షించగలిగిందా? ఆ ఆడపులిని ఎలాగైనా వేటాడి చంపాలి అనుకున్న పింకు యత్నాలు ఫలించాయా? అటవీ అధికారుల అవినీతి కార్యకలాపాలకు ఫుల్ స్టాప్ పడిందా? పులి వేటను సైతం రాజకీయంగా మలిచే నేతలకు ఎవరు గుణపాఠం చెప్పారు? ఈ ప్రశ్నలకు ద్వితీయార్థంలో సమాధానాలు లభిస్తాయి.

అటవీ ప్రాంతాలను ఆక్రమించుకోవడం ఇవాళ కొత్త కాదు. మైనింగ్ పేరుతో అధికారికంగా కొంత, అనధికారికంగా కొంత చొప్పున కోట్ల ఎకరాలను ఎంతో కాలంగా కాంట్రాక్టర్లు తవ్వేస్తున్నారు. ఇప్పుడు కొత్త సంస్కృతి ఒకటి మొదలైంది. పర్యావరణ పరిరక్షణ పేరుతో అడవికి – జనావాసానికి మధ్యలో ఉండే వేల ఎకరాల్లో మొక్కలను నాటడం ప్రారంభించారు. దాంతో పశువులు కాసుకునే పరిసర గ్రామస్థులకు ఇది నిషిద్ధ ప్రాంతంగా మారిపోయింది. నిజం చెప్పాలంటే… మనిషి ఇవాళ నిరాటంకంగా అడవిలోకి వెళ్ళిపోయి తనకు కావాల్సినవి తెచ్చుకుంటున్నాడు. మరి ఆ అడవిలో ఉండే జంతువులు జనావాసాల్లోకి వచ్చి తమకు కావాల్సిన ఆహారాన్ని తీసుకుంటే తప్పేమిటీ? ఈ ప్రకృతిలో అన్ని జీవరాశులతో పాలు మనిషి కూడా ఒక్కడు. కానీ తన స్వార్థం కోసం అన్ని జీవరాశులన్నీ తన అధీనంలోకి తెచ్చుకునే క్రూరుడిగా మారిపోతున్నాడు. ఈ ‘షేర్నీ’ సినిమాలో దర్శకుడు అమిత్ మసూర్కర్ అదే అంశాన్ని చూపించాడు.

విశేషం ఏమంటే… ఇది కేవలం అడవిలో ఉండే ‘షేర్నీ’ కథ మాత్రమే కాదు. అడవిని మించి క్రూరమృగాలు ఉండే సమాజంలో ప్రతి రోజూ సమస్యలతో సతమతమయ్యే ఓ ఉద్యోగిని కథ కూడా. అడవిలోని ఆడపులిని చంపటానికి రకరకాల ఎత్తులు వేసినట్టుగానే, ఈ మహిళా అధికారిని తన పని తాను చేసుకోనివ్వకుండా రకరకాల ఇబ్బందులకు గురిచేస్తుంటారు. పై అధికారుల నిర్లక్ష్యధోరణి, అహంకారపూరిత వ్యవహారం, గిరిజనుల నిస్సహాయత, అడవి భూములను ఆక్రమించుకునే కాంట్రాక్టర్లు, పర్యావరణ హితం పేరుతో కొందరు కల్పించే అడ్డంకులు, రాజకీయ నేతల పన్నాగాలు… వీటిని విద్య ఎలా తట్టుకుందన్నదే ఈ చిత్ర కథ. కానీ బాధాకరం ఏమంటే… మనకు రెగ్యులర్ సినిమాల్లో కనిపించే విన్నింగ్ క్లయిమాక్స్ ను ఇందులో చూపించడానికి దర్శకుడు అమిత్ ఇష్టపడలేదు. సహజత్వానికి ప్రాధాన్యమిస్తూ… విద్య క్యారెక్టర్ ను నిస్సహాయురాలిగానే ఉంచేశారు. కొంతలో కొంత ఆమె మనసుకు నచ్చే పని చేయడంతో సినిమా ముగుస్తుంది. దాంతో సాధారణ సినిమా ప్రేక్షకుడికి ఈ ముగింపు పేలవంగా అనిపిస్తుంది. కానీ జీవితాన్ని కాచి ఒడపోసిన వారికి, ఇంతకంటే పరిష్కారం ఏముంటుందనే భావన కలుగుతుంది.

నటీనటుల విషయానికి వస్తే… డీఎఫ్ఓ అధికారిణిగా విద్యా బాలన్ చక్కగా చేసింది. అయితే రెండేళ్ళ క్రితం వచ్చిన ‘మిషన్ మంగళ్’ మూవీలోని చురుకుదనం ఆమెలో కనిపించలేదు. ఆ మధ్య వచ్చిన ‘శకుంతలదేవి’ పాత్రలో స్టేబుల్ గా నటించడం ఓకే కానీ, ఈ సినిమాలో విద్యాబాలన్ పోషించింది ఓ ఫారెస్ట్ ఆఫీసర్ పాత్ర. దానిలో ఇంకాస్తంత ఇన్వాల్వ్ అయి, యాక్టివ్ గా చేసి ఉంటే బాగుండేదనిపిస్తుంది. అయితే విద్యాబాలన్ తనదైన బాడీ లాంగ్వేజ్ తో, హావభావాలతో ఏ పాత్రనైనా అవలీలగా పోషించేయగలదని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇందులోనూ అదే పనిచేసింది. ఆమె పై అధికారి బన్సాల్ గా బిజేంద్ర కాలా వీక్షకులకు కాస్తంత వినోదాన్ని అందించాడు. హసన్ నురానీ పాత్రలో విజయ్ రాజ్ ఒదిగిపోయాడు. తెలుగు చిత్రాల్లో విలన్ గా నటించిన శరత్ సక్సేనా ఇందులో వేటగాడు పింటు భయ్యాగా చక్కని నటన ప్రదర్శించాడు. ఇతర ప్రధాన పాత్రలను విజయేందర్ కల్లా, లోకేష్ మిట్టల్, నీరజ్ కబీ, ఇలా అరుణ్ తదితరులు పోషించారు. రాకేశ్ హరిదాస్ కెమెరా అడవి అందాలను చక్కగా చూపించింది. మరీ ముఖ్యంగా రాత్రి సన్నివేశాలను ఉత్కంఠభరితంగా తెరకెక్కించారు. లానే వైడ్ యాంగిల్ అండ్ ఏరియల్ షాట్స్ బాగున్నాయి. బెనిడిక్ట్ టేలర్ నేపథ్య సంగీతం సన్నివేశాలను ఎలివేట్ చేసింది. ఆస్థా టీకు స్క్రీన్ ప్లే ఇంకాస్తంత బిగువగా ఉండాల్సింది. అయితే… ఇందులో దర్శకుడు అమిత్ తో కలిసి యశస్వి మిశ్రా రాసిన సంభాషణలు చాలా సహజంగా ఉన్నాయి. అదే సమయంలో ఆలోచింపచేసేలనూ ఉన్నాయి. ‘నువ్వు అడవిలోకి వెళ్ళిన వంద సార్లలో పులిని ఒకసారి చూస్తే, అది నిన్ను తొంభై తొమ్మిది సార్లు చూస్తుంది’ వంటి డైలాగ్స్ బాగున్నాయి.

కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా ఓ కథను నమ్మి దానిని అత్యంత సహజంగా తెరకెక్కించడానికి కారకులైన భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, విక్రమ్ మల్హోత్ర, అమిత్ వి మసూర్కర్ లను అభినందించాలి. ‘న్యూటన్’ వంటి అర్థవంతమైన చిత్రం తీసిన అమిత్ నుండి ఇంకాస్తంత మంచి సినిమాను అతని అభిమానులు కోరుకుంటారు. ఆ విషయంలో మాత్రం అతను కొంత నిరాశ పర్చినట్టే. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాను పర్యావరణ ప్రేమికులు, ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ మూవీస్ ను ఇష్టపడే వారు చూడొచ్చు.

రేటింగ్: 2.25 / 5

ప్లస్ పాయింట్స్
నటీనటుల సహజ నటన
సినిమాటోగ్రఫీ, డైలాగ్స్
నేపథ్య సంగీతం

మైనెస్ పాయింట్
స్లో నెరేషన్
డాక్యూ డ్రామాను తలపించడం

ట్యాగ్ లైన్: కోరలు తీసిన ‘షేర్నీ’!

Show comments