ఇంత కాలం సినిమా వాళ్లకి యాక్టింగ్ చేయటమే తెలిసేది. కానీ, కరోనా వైరస్, దాని ఫలితంగా నెత్తిన పడ్డ లాక్ డౌన్ సినీ సెలబ్రిటీలకు కొత్త పాఠాలు నేర్పుతోంది. ముఖ్యంగా ఇంట్లో కూర్చుని సమయం వృథా కాకుండా ఎలా క్యాష్ చేసుకోవాలో లాక్ డౌన్ నేర్పుతోంది!
దేశంలోని అందరు క్రేజీ స్టార్స్ లాగే కింగ్ ఖాన్ షారుఖ్ కూడా తన సినిమా మధ్యలో ఆపేసి ఇంటిపట్టున కూర్చున్నాడు. అయితే, ఈయన ప్యాండమిక్ కంటే ముందు నుంచే ఎన్నో నెలలుగా కెమెరాకి దూరంగా ఉన్నాడు. అప్పుడెప్పుడో వచ్చిన అట్టర్ ఫ్లాప్ ‘జీరో’ మూవీ తరువాత బిగ్ గ్యాప్ తీసుకున్నాడు. తీరా ఆచితూచి ‘పఠాన్’ మూవీ ఎంచుకున్నాక ఇప్పుడు షూటింగ్ ముందుకు సాగటం లేదు. అయితే, లాక్ డౌన్ వేళ ఇంట్లో ఖాళీగా కూర్చోవటం లేదు బాద్షా. తనలోని బిజినెస్ మ్యాన్ కి పని చెప్పాడు!
షారుఖ్ కి ‘రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్’ అనే నిర్మాణ సంస్థ ఉంది. దానిపైన సినిమాలే కాక ఓటీటీ కంటెంట్ కూడా రూపొందిస్తుంటాడు. ఇమ్రాన్ హష్మీతో ఇప్పటికే ‘బార్డ్ ఆఫ్ బ్లడ్’ అనే వెబ్ సిరీస్ ప్రొడ్యూస్ చేశాడు. బాబీ డియోల్ ‘క్లాస్ ఆఫ్ ‘83’ సిరీస్ కూడా రెడ్ చిల్లీస్ బ్యానర్ నుంచీ వచ్చిందే. ఇలా ఆన్ లైన్ లోనూ నిర్మాతగా అలరిస్తోన్న షారుఖ్ లాక్ డౌన్ సమయాన్ని ఓటీటీ కంటెంట్ సృష్టించేందుకు వినియోగిస్తున్నాడట. ఇప్పటికే పలు కథలు ఓకే చేశాడని టాక్. 2021 చివరికల్లా రెడ్ చిల్లీస్ నుంచీ వివిధ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ పై షారుఖ్ ఖాన్ నిర్మించిన వెబ్ సిరీస్ లు అందుబాటులోకి రావచ్చంటున్నారు. చూడాలి మరి, యాక్టర్ గా పెద్ద తెరపైకి త్వరగా రాలేకపోతోన్న ఎస్ఆర్కే ప్రొడ్యూసర్ గా ఎలాంటి జోరు చూపిస్తాడో…