NTV Telugu Site icon

మ‌ర‌పురాని రోజార‌మ‌ణి

Senior Actress Roja Ramani Birthday

(సెప్టెంబ‌ర్ 16న న‌టి రోజార‌మ‌ణి పుట్టిన‌రోజు)
ఎదురుగా య‌స్వీ రంగారావు వంటి భారీ విగ్ర‌హం ఉన్న మ‌హాన‌టుడు భ‌య‌పెట్టే హిర‌ణ్య‌క‌శ్య‌పునిగా న‌టిస్తున్నా, అద‌ర‌క బెద‌ర‌క ప‌సిప్రాయంలోనే భ‌ళా అనిపించేలా భ‌క్త ప్ర‌హ్లాద‌లో న‌టించారు రోజార‌మ‌ణి. ఆ చిత్రంలో ఆమె న‌ట‌న‌కు బాల‌న‌టిగా జాతీయ అవార్డు ల‌భించాల్సిందే. అప్ప‌టికి ఇంకా జాతీయ అవార్డుల్లో ఉత్త‌మ బాల‌న‌టుల విభాగం ఏర్పాటు చేయ‌లేదు. ఆ త‌రువాతి సంవ‌త్స‌రం నుంచీ ఆ కేటగిరీ మొద‌ల‌యింది. అయితే, రోజార‌మ‌ణి భ‌క్త ప్ర‌హ్లాదునిగా న‌టించిన చిత్రాన్ని నాటి రాష్ట్ర‌ప‌తి స‌ర్వేప‌ల్లి రాధాకృష్ణ ప్ర‌త్యేకంగా ప్ర‌ద‌ర్శ‌న వేయించుకొని తిల‌కించారు. రోజార‌మ‌ణి ఆ సినిమాలో ఏనుగులు, పాముల‌తో ఏ మాత్రం బెద‌ర‌కుండా న‌టించ‌డం చూసి ఆయ‌న ముగ్ధుల‌య్యారు. అలా రాష్ట్ర‌ప‌తి ప్ర‌శంసా ప‌త్రం రోజార‌మ‌ణికి సొంత‌మ‌యింది. ఆ తీరున ప్ర‌త్యేకంగా అవార్డు పొందిన బాల‌న‌టి కానీ, బాల‌న‌టుడు కానీ మ‌రొక‌రు కాన‌రారు. త‌రువాతి రోజుల్లో ప‌లు చిత్రాల‌లోనూ బాల‌న‌టిగా రోజార‌మ‌ణి ఆక‌ట్టుకున్నారు. ఆ రోజుల్లో రోజార‌మ‌ణి స్టార్ కిడ్ అని చెప్ప‌వ‌చ్చు. త‌రువాతి రోజుల్లో ముగ్ధ‌మ‌నోహ‌రంగా నాయిక పాత్ర‌ల్లో మురిపించారు. అయితే ఎక్కువ‌గా ఆమెకు హీరోల చెల్లెళ్ల పాత్ర‌లే ల‌భించేవి. దాంతో రోజార‌మ‌ణి అన‌గానే అందాల చెల్లెలు అనే ముద్ర ప‌డిపోయింది. ద‌క్షిణాది అన్ని భాష‌ల్లోనూ రోజార‌మ‌ణి త‌న‌దైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నారు. ఇక ఒరియా భాష‌లో మాత్రం స్టార్ హీరోయిన్ స్టేట‌స్ సాధించారు రోజార‌మ‌ణి.

ఇప్ప‌టికీ రోజార‌మ‌ణి పేరు త‌ల‌చుకోగానే ఆ నాటి ప్రేక్ష‌కుల‌కు 1967లో భ‌క్త ప్ర‌హ్లాద‌లో ఆమె న‌టించిన తీరు గుర్తుకు వ‌స్తుంది. త‌రువాత సత్య‌కాల‌పు స‌త్తెయ్య‌ వంటి చిత్రాలు స్ఫురిస్తాయి. తాత‌మ్మ‌క‌ల‌, జేబుదొంగ‌, రామ్-ర‌హీమ్, బ‌లిపీఠం, మొన‌గాడు, డ్రైవ‌ర్ రాముడు వంటి చిత్రాల్లోని చెల్లెలి పాత్ర‌లూ మెద‌లుతాయి. కె.విశ్వ‌నాథ్ తెర‌కెక్కించిన ఓ సీత క‌థ‌, బి.ఎస్. ఆంజ‌నేయులు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన క‌న్నెవ‌య‌సు వంటి చిత్రాల‌లో నాయిక‌గానూ అల‌రించారు రోజార‌మ‌ణి. సింగీతం శ్రీ‌నివాస‌రావు రూపొందించిన సొమ్మొక‌డిది-సోకొక‌డిది చిత్రంలో క‌మ‌ల్ హాస‌న్ ద్విపాత్రాభిన‌యం చేయ‌గా, ఓ క‌మ‌ల్ కు జోడీగా న‌టించారు. మ‌ళ‌యాళ చిత్రాల‌లో నాయిక‌గానూ అల‌రించారు. న‌టుడు చ‌క్ర‌పాణిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. వీరిద్ద‌రూ ఒరియా చిత్రాల‌లో జోడీగా న‌టించి ఆక‌ట్టుకున్నారు. ముఖ్యంగా ఒరియాలో వీరిద్ద‌రూ సీతారాములుగా న‌టించిన సీతాల‌వ‌కుశ‌ మంచి విజ‌యం సాధించింది. దాంతో భార్యాభ‌ర్త‌లిద్ద‌రికీ స్టార్ స్టేట‌స్ ల‌భించింది. పిల్లలు పుట్టిన త‌రువాత రోజార‌మ‌ణి న‌ట‌న‌కు దూరంగా జ‌రిగార‌నే చెప్పాలి. ఏదో ఒక‌టి రెండు చిత్రాల‌లో న‌టించారంతే! అయితే ఎంతోమంది నాయిక‌ల‌కు ఆ రోజుల్లో రోజార‌మ‌ణి గాత్ర‌దాన‌మే వారి న‌ట‌న‌కు ప్రాణం పోసింది. దాదాపు 400పైగా చిత్రాల‌కు రోజార‌మ‌ణి డ‌బ్బింగ్ చెప్పారు.

బ్లూ క్రాస్ సంస్థలో కీల‌కంగా ఉంటూ, జంతుసంర‌క్ష‌ణ‌లో త‌న‌వంతు పాత్ర పోషిస్తున్నారు రోజార‌మ‌ణి. ఆమె త‌న‌యుడు త‌రుణ్ కూడా త‌ల్లి బాట‌లో బాల‌న‌టునిగా భ‌లేగా మెప్పించారు. నువ్వేకావాలితో యంగ్ హీరోగానూ త‌రుణ్ జ‌నం ముందు నిల‌చి వారి మ‌న‌సులు గెలిచారు. రోజార‌మ‌ణి, చ‌క్ర‌పాణి దంప‌తుల‌కు అమూల్య అనే కూతురు కూడా ఉన్నారు. ఏది ఏమైనా తెలుగు చిత్ర‌సీమ‌లో త‌న‌కంటూ ఓ చెరిగిపోని స్థానం సంపాదించారు రోజార‌మ‌ణి.