NTV Telugu Site icon

ఓహో… అభినయ’రాశి’

(జూన్ 29న నటి రాశి పుట్టినరోజు)

బాలనటిగా భళా అనిపించి, అందాల తారగా భలేగా సాగి, నేడు బుల్లితెరపై రాణిస్తోంది రాశి. ఆమె పేరు వినగానే ముద్దు ముద్దు మాటలతో చిన్నారిగా అలరించిన రాశి ముందుగా గుర్తుకు వస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో జన్మించిన రాశి అసలు పేరు విజయ. ఆరేళ్ళ ప్రాయంలోనే ‘మమతల కోవెల’లో నటించి మురిపించింది రాశి. “బాలగోపాలుడు, రావుగారిల్లు, అంకురం, పల్నాటి పౌరుషం” చిత్రాలలో భళా అనిపించిన రాశి, తమిళనాట మంత్ర పేరుతో నటించింది. తమిళంలో రాశి నటించిన ‘లవ్ టు డే’ మంచి విజయం సాధించింది. కొంతకాలం తమిళజనానికి ‘మంత్ర’గా మంత్రం వేసిన రాశి, తెలుగులో ‘శుభాకాంక్షలు, గోకులంలోసీత, పెళ్ళిపందిరి’ చిత్రాలతో ప్రేక్షకులను మురిపించింది.

ముద్దుగా బొద్దుగా కనిపిస్తూనే ముచ్చట గొలిపింది రాశి. దాంతో ఎంతోమంది రసికులు రాశిని తమ కలల రాణిగా చేసుకున్నారు. “పండగ, వసంత, స్నేహితులు, మనసిచ్చి చూడు, స్వప్నలోకం, హరిశ్చంద్ర, కృష్ణబాబు” వంటి చిత్రాలలో నాయికగానూ, కొన్నిట కీలక పాత్రల్లోనూ నటించి అలరించింది రాశి. “ప్రేయసిరావే, దేవుళ్లు” చిత్రాలలో నటిగానూ మంచి మార్కులు సంపాదించింది. ‘సముద్రం, వీడే’ వంటి సినిమాల్లో ఐటమ్ నంబర్స్ లోనూ ఆకట్టుకుంది. తేజ రూపొందించిన ‘నిజం’లో నెగటివ్ రోల్ లోనూ మురిపించింది. “కళ్యాణ వైభోగమే, పడేశావే, ఆకతాయి, లంక” చిత్రాలలో వయసుకు తగ్గ పాత్రల్లో కనిపించిన రాశి ప్రస్తుతం బుల్లితెరపై దర్శనమిస్తోంది. ‘గిరిజా కళ్యాణం’ సీరియల్ లో పోలీస్ ఆఫీసర్ ఝాన్సీగా సందడి చేసిన రాశి, ‘జానకి కలగనలేదు’ ధారావాహికలో జ్ఞానాంబగా నటిస్తోంది. మళ్ళీ ఎప్పుడు బిగ్ స్క్రీన్ పై రాశి కనిపిస్తుందో కానీ, ఇప్పుడైతే బుల్లితెరపైన ఆకట్టుకుంటూనే ఉంది.