NTV Telugu Site icon

Supreme court: ఎలక్టోరల్‌ బాండ్లపై ఎస్‌బీఐ అభ్యర్థన ఇదే!

Sbi

Sbi

ఎలక్టోరల్‌ బాండ్ల వ్యవహారంపై (Electoral Bonds) స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) సుప్రీంకోర్టును (Supreme court) ఆశ్రయించింది. బాండ్ల వివరాలు వెల్లడించేందుకు జూన్‌ 30 వరకు గడువు ఇవ్వాలని అభ్యర్థించింది.

గత నెలలో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పులో ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని కొట్టివేసింది. మార్చి 6 లోపు ఎన్నికల కమిషన్ (EC)కి సమాచారం ఇవ్వాలని SBIకి సూచించింది. దీంతో ఈ గడువు రెండ్రోజుల్లో ముగుస్తోంది. ఈ నేపథ్యంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించి మరింత గడువు ఇవ్వాలని ఎస్‌బీఐ కోరింది.

సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు మార్చి 6తో ముగియనున్న నేపథ్యంలో తాజా విజ్ఞప్తి చేసింది. 2019 ఏప్రిల్‌ 12 నుంచి 2024 వరకు మొత్తంగా 22,217 ఎలక్టోరల్‌ బాండ్లు జారీ చేసినట్లు ఎస్‌బీఐ పేర్కొంది. బాండ్లు కొన్నవారు, ఆపై వాటిని రిడీమ్‌ చేసుకున్న వారి వివరాలు మ్యాచ్‌ చేయడానికి కొంత సమయం పడుతుందని తెలిపింది. ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి కోర్టు నిర్దేశించిన గడువు అందుకు ఏ మాత్రం సరిపోదు కాబట్టి గడువు పొడిగించాలని కోరింది.

రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇటీవలే సంచలన తీర్పు వెలువరించింది. పార్టీలకు రహస్యంగా విరాళాలు ఇవ్వడానికి వీలు కల్పించే ఈ పథకం- సమాచార హక్కును ఉల్లంఘించడమే కాకుండా, రాజ్యాంగంలోని 19(1)(ఎ) అధికరణం కింద పేర్కొన్న భావప్రకటన స్వేచ్ఛకు విరుద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. దీనిని వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది.

ఎన్నికల బాండ్లు జారీ చేసిన ఎస్‌బీఐ ఆ తేదీ తర్వాత రాజకీయ పార్టీలకు అందిన విరాళాల వివరాలన్నింటినీ కేంద్ర ఎన్నికల సంఘానికి మార్చి 6వ తేదీ లోపు సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. వీటిని ఎన్నికల సంఘం మార్చి 13లోపు తన వెబ్‌సైట్‌లో ఉంచాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో గడువు కావాలని ఎస్‌బీఐ కోర్టును కోరింది.