Site icon NTV Telugu

గుడ్‌న్యూస్‌: ఒమిక్రాన్‌కు చెక్..! వ్యాక్సిన్‌ ప్రక్రియ షురూ..

కరోనా మహమ్మారిపై విజయం సాధించడానికి పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి.. ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా వ్యాక్సినేషన్‌ జరుగుతోంది.. ఇక, ఇప్పుడు సౌతాఫ్రికాలో వెలుగు చూసిన కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ప్రపంచదేశాలను కలవర పెడుతోంది.. జట్‌ స్పీడ్‌తో వ్యాపిస్తున్న ఈ వైరస్‌.. అత్యంత ప్రమాదకారి అని ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించగా.. మరోవైపు.. ఒమిక్రాన్‌కు చెక్‌ పెట్టేందుకు వ్యాక్సిన్‌ అభివృద్ధి చేయడంపై కూడా దృష్టిసారించారు శాస్త్రవేత్తలు.. ఒమిక్రాన్‌కు వ్యతిరేకంగా రష్యా కొత్త కొవిడ్-19 వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడం షురూ చేసింది.. కోవిడ్‌ ఒమిక్రాన్‌ వేరియంట్‌ను లక్ష్యంగా చేసుకొని స్పుత్నిక్ వ్యాక్సిన్ యొక్క కొత్త వెర్షన్‌ను అభివృద్ధి చేయడం ప్రారంభించినట్లు.. గమలేయ నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ ఎపిడెమియాలజీ అండ్ మైక్రోబయాలజీ ప్రకటించింది..

Read Also: ఆరేళ్లలో 5 లక్షలకు పైగా సంస్థలు మూత.. కేంద్రం ప్రకటన

ఇక, ఇప్పటికే అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వి, స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్‌లు ఒమిక్రాన్‌ వేరియంట్‌ను ఎదుర్కుంటాయా? లేదా? అనే అధ్యయనం మొదలైనట్టు గమలేయ వెల్లడించింది.. మరోవైపు, కొత్త స్పుత్నిక్ ఒమిక్రాన్‌ వెర్షన్ వ్యాక్సిన్‌ను 45 రోజుల్లోనే భారీ ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నామని రష్యా పేర్కొంది. వచ్చే ఏడాది ఆరంభంలో స్పుత్నిక్ ఒమిక్రాన్‌ బూస్టర్ షాట్‌లు పెద్ద సంఖ్యలో అంతర్జాతీయ మార్కెట్‌లోకి వదలాలని రష్యా ప్లాన్‌గా ఉంది. కాగా, ఒమిక్రాన్‌ విజృంభణతో అప్రమత్తం అయిన ప్రపంచ దేశాలు.. ఆ వేరియంట్‌ కేసులు వెలుగు చూసిన దేశాల నుంచి ప్రయాణికుల రాకపోకలపై ఆంక్షలు విధిస్తున్నాయి.. భారత్‌ కూడా ఈ తరహా చర్యలను పూనుకుంది.. ఆయా దేశాల నుంచి వచ్చే ప్రయాణకులకు తప్పనిసరిగా టెస్ట్‌లు చేయాలని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

Exit mobile version