NTV Telugu Site icon

వారం క్రితం వివాహం.. పెళ్ళికొడుకుని మింగేసిన ఆర్టీసీ బస్

వారం రోజుల క్రితమే పెళ్ళయింది. పెళ్ళి కూతురు కాళ్ళ పారాణి కూడా ఆరలేదు. కానీ విధి రూపంలో వచ్చిన ఆర్టీసీ బస్ కొత్త పెళ్ళికొడుకు ప్రాణాలను బలిగొంది. నల్గొండ జిల్లా చింతపల్లి మండలం మాల్ వద్ద దేవరకొండ డిపో ఆర్టీసి బస్సు, ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో వికారాబాద్ వన్ టౌన్ ఎస్ఐ శ్రీను నాయక్(32) ఆయన తండ్రి మాన్య నాయక్(50) అక్కడిక్కడే మృతి చెందారు.

మృతులు రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం మాన్య తండా వాసులుగా గుర్తింపు. శ్రీను నాయక్ వారం క్రితమే వికారాబాద్ వన్ టౌన్ ఎస్ఐ గా బాధ్యతలు చేపట్టారు. డిసెంబర్ 26న శ్రీనుకు వివాహం అయింది. వడిబియ్యం కార్యక్రమం ముగించుకుని స్వగ్రామానికి వెళ్తుండగా ఘటన జరిగింది. తండ్రి మాన్య ఆటో డ్రైవర్, ఇటీవల తండ్రి చేతికి గాయం కావడంతో స్వయంగా ఆటో నడిపాడు ఎస్ఐ శ్రీను నాయక్. ఆటోలో ప్రయాణించిన తండ్రీకొడుకులు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో ఇరు కుటుంబాల్లో విషాదఛాయలు అలముకున్నాయి.