Site icon NTV Telugu

కొత్త సంవత్సరం వేళ ఆంక్షల గోల..!!

ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్‌ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. మంగళవారం నాటికి భారత్‌లో కొత్తగా 6,358 మంది కరోనా బారిన పడ్డారు. వారిలో 653 మందికి ఒమిక్రాన్‌ నిర్ధారణ అయింది. అంటే మొత్తం కేసులలో ఇది దాదాపు పది శాతం. ఒమిక్రాన్‌ సంక్రమించిన వారిలో 186 మంది కోలుకున్నారు.

కరోనా కేసుల్లో మహారాష్ట్ర మొదటి నుంచీ ముందున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఒమిక్రాన్‌ విషయంలో ఆ రాష్ట్రమే అదే టాప్‌. మంగళవారం నాటికి కొత్త వేరియంట్‌ కేసుల సంఖ్య 167కు చేరింది. ఇక దాని తరువాత ఢిల్లీ 165 కేసులతో రెండో స్థానంలో ఉంది. ఈ రెండు రాష్ట్రాలపై సెకండ్‌ వేవ్‌ తీవ్ర ప్రభావం చూపిన విషయం తెలిసిందే.

మరోవైపు కేరళలో ఇప్పటికీ అధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు 57 ఒమిక్రాన్‌ కేసులు వెలుగు చూశాయి. ఇక, తెలంగాణలో వాటి సంఖ్య 55కు చేరింది. కాగా గుజరాత్‌లో 49, రాజస్థాన్‌ 46, తమిళనాడు 34, కర్నాటకలో 31 చొప్పున ఒమిక్రాన్ కేసులు రికార్డయ్యాయి. పెళ్లిళ్లు, పండుగ సీజన్ నేపథ్యంలో ఓమిక్రాన్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. దాంతో, గతంలో సడలించిన నిబంధనలను తిరిగి అమలు చేయాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు యోచిస్తున్నాయి.

ఇప్పటి వరకు వెలుగు చూసిన అన్ని వేరియంట్ల కన్నా ఒమిక్రాన్‌ వేగంగా వ్యాపిస్తోంది. సౌతాఫ్రికా, బ్రిటన్‌, డెన్మార్క్‌, అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్‌ సహా యూరప్‌ దేశాలన్నీ దీని బారిన పడ్డాయి. డెల్టా వేరియంట్‌ ప్రభావం పూర్తిగా తొలగిపోక ముందే ఒమిక్రాన్‌ విజృంభణ వాటిని నిద్రకు దూరం చేస్తోంది. అయితే.. ప్రస్తుతం ఒమిక్రాన్‌ వ్యాప్తి తక్కువగా ఉన్న భారత్‌ వంటి దేశాలకు అవి గైడ్‌గా పనిచేస్తాయనటంలో సందేహం లేదు. మున్ముందు కేసులు భారీగా పెరిగినా పరిస్థితి అదుపు తప్పకుండా చూడవచ్చు. మన దేశంలో సెకండ్‌ వేవ్‌ ప్రారంభానికి ముందు ఈ దేశాలలో పరిస్థితి ఇప్పుడు ఉన్నట్టే ఉంది. కానీ భారత ప్రభుత్వం సెకండ్ వేవ్‌ హెచ్చరికలను పట్టించుకోలేదు. ఇప్పుడు మనం మళ్లీ సరిగ్గా ఆ పాయింట్‌ దగ్గరే ఉన్నాం. అందుకే ఈ జాగ్రత్తలు.

థర్డ్‌ వేవ్‌ని అడ్డుకోవాలంటే మొదట కేసులు పెరగకుండా చూడాలి. అలా జరగాలంటే ఆంక్షలు తప్పదు. అందుకే దేశ వ్యాప్తంగా మరోసారి ఆంక్షలు కఠినతరం అవుతున్నాయి. పలు రాష్ట్రాల్లో ఇప్పటికే రాత్రిపూట కర్ఫ్యూ విధించారు. పరిస్థితులకు అనుగుణంగా భవిష్యత్‌లో మరిన్ని ఆంక్షలు విధించే అవకాశం ఉంది.

మహారాష్ట్ర, ఢిల్లీ, కర్నాటక, అస్సం, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్, ఉత్తరాఖండ్‌, హర్యానాలో నైట్‌ కర్ఫ్యూ అమలులోకి వచ్చింది. రాత్రి 10 లేదా 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అమలులో ఉంటుంది. న్యూయర్‌ సెల్రబేషన్స్‌పై కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పరిమితులు విధించాయి. కర్ఫ్యూ వేళల్లో వాహనాల రాకపోకలు, జన సంచారం నిషిద్ధం. ఎమర్జెన్సీసర్వీసులకు మాత్రం మినహాయింపు ఉంటుంది. అయితే ఈ గైడ్‌లైన్స్‌ ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉన్నాయి.

కేరళలో పెరుగుతున్న ఒమైక్రాన్ కేసులను కట్టడి చేసేందుకు డిసెంబరు 30వ తేదీ నుంచి జనవరి 2 వరకు రాత్రి కర్ఫ్యూ విధించింది. రాత్రి 10 నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు అమలులో ఉంటుంది. అలాగే,న్యూ ఇయర్‌ వేడుకలపై ఒడిశా ప్రభుత్వం కూడా ఆంక్షలు విధించింది. జనవరి 2 వరకు పలు ఆంక్షలు అమలులో ఉంటాయి. కొత్త సంవత్సరం నాడు హోటళ్లు, క్లబ్బులు, రెస్టారెంట్లు, పార్కులు, కన్వెన్షన్‌ హాళ్ల నిర్వహణపై ప్రభుత్వం పూర్తిగా నిషేధం విధించింది.

ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలలో నైట్ కర్ఫ్యూ విధిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒమిక్రాన్‌ కేసుల్లో తెలంగాణ నాల్గవ స్థానంలో ఉంది. మంగళవారం నాటికి 55 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. మరోవైపు ఏపీలో ఆరు ఒమిక్రాన్ కేసులు రికార్డయ్యాయి. ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతున్నందున జనం గుమికూడకుండా తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఇటీవల సూచించింది. దాంతో కొత్త సంవత్సరం వేళ ఆంక్షలు తప్పవని అంతా అనుకున్నారు. కానీ, కఠిన ఆంక్షలు ఉండవని తెలుస్తోంది. భౌతికం దూరం పాటిస్తూ మాస్కులు ధరించి ఎంట్రీ పాయింట్ల వద్ద థర్మల్‌ స్క్రీనింగ్‌ వంటి కోవిడ్‌ నిబంధనలను పాటిస్తే సరిపోతుంది.

అయితే జనవరి 2 వరకు బహిరంగ సభలు, ర్యాలీలను తెలంగాణ ప్రభుత్వం నిషేధించింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించకుంటే జరిమానా తప్పదు.కోవిడ్‌ ఆంక్షలు కఠినంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లకు ఆదేశాలు వెళ్లాయి. జనవరి 2 తర్వాత ఓమిక్రాన్ కేసులపై సమీక్ష చేసి అవసరం అనుకుంటే మరిన్ని ఆంక్షలు విధించే అవకాశం ఉంది.

కొత్త సంవత్సరం వేళ కఠిన ఆంక్షలు విధిస్తే సర్కార్‌ రాబడి తగ్గుతుంది. డిసెంబర్‌ 31న ఒక్క రోజు మద్యం అమ్మకాల ద్వారా వెయ్యి కోట్ల ఆదాయాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆశిస్తోంది. అయితే ఏపీలో జగన్‌ సర్కార్‌ ఏం చేయబోతోందన్నది తెలియదు. రాష్ట్రంలో ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతుండటంతో సోమవారం ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. న్యూ ఇయర్‌ వేడుకలపై ఆంక్షలు విధించడంతో పాటు నైట్‌ కర్ఫ్యూ విధించడంపై అధికారులతో చర్చించినట్టు సమాచారం.

మరోవైపు మొక్కబడి సమీక్షలతో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సరిపెడుతున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. జగన్‌ నిర్లక్ష్యంతో కరోనా ఫస్ట్, సెకండ్‌వేవ్‌లో భారీ ప్రాణనష్టం జరిగిందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ప్రభుత్వాస్పత్రులను మౌలిక సదుపాయాల కొరత వేధిస్తోందని, ఒక్కసారిగా కేసులు పెరిగితే ఏం చేస్తారని టీడీపీ ప్రశ్నిస్తోంది. ఏపీలో నూతన సంవత్సర వేడుకలపై కఠిన ఆంక్షలు విధిస్తారా? లేకపోతే తెలంగాణ బాటలో నడుస్తారా అనేది చూడాల్సి ఉంది.

Exit mobile version