NTV Telugu Site icon

సెప్టెంబర్‌ 2, 2009.. ఆ 25 గంటలు….?

2009 సెప్టెంబర్ 2… ఆ రోజు ఏపీ సీఎం వైఎస్‌ఆర్‌ సెక్రటేరియట్‌లో లేరు. అయినా సి బ్లాక్‌ అంతా హడావుడి. అంతా ఒకటే టెన్షన్‌ టెన్షన్‌…సీఎం ఆఫీస్‌లో లేకపోతే అక్కడ ఏ సందడీ ఉండదు..కానీ ఆ రోజు అందుకు భిన్నం.

ఆ రోజు చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి సీఎం వైఎస్ఆర్‌. అందుకే ఉదయం సరిగ్గా సరిగ్గా 8 గంటల 38 నిమిషాలకు బేగంపేట నుంచి హెలికాప్టర్‌ ఎగిరింది. 10.30 కల్లా చిత్తూరు చేరాలి. కానీ అలా జరగలేదు.. అందుకే ఆ టెన్షన్‌….అందుకే ఆ ఉత్కంఠ. కొద్ది సేపట్లోనే ఈ వార్త రాష్ట్రమంతా దావాణంలా వ్యాపించింది.

సీఎం హెలికాప్టర్‌కు ATC సంబంధాలు తెగిపోయాయి.. హెలికాప్టర్ జాడ తెలియకుండా లేకుండా పోయింది. ఏపీ ఎలక్ట్రానిక్ మీడియాలో పెద్ద పెద్ద అక్షరాలతో ఇవే బిగ్‌ బ్రేకింగ్‌…తరువాత కొద్ది సేపటికే నేషనల్‌ ఛానెల్స్‌లోనూ మొదలైంది హడావుడి. రకరకాల వార్తలు చక్కర్లు కొట్టాయి. సీఎం సేఫ్‌ అని.. రోడ్డు మార్గంలో వెళుతున్నారని ..ఇంకా రకరకాలుగా.. ఎవరికి తోచినట్టు వారు స్ర్కోలింగ్‌లు…బ్రేకింగ్‌లు స్టార్ట్‌ చేశారు. నల్లమల మావోయిస్టులు సీఎం హెలికాప్టర్‌ని పేల్చేశారని. కిడ్నాప్‌ చేశారనే వంటి పుకార్లు కూడా షికార్లు చేశాయి. ఎట్టకేలకు సీఎం హెలికాప్టర్‌ మిస్సింగ్‌ అంటూ ఆరోజు మధ్యాహ్నాంప్రభుత్వం దీనిపై స్పష్టమైన ప్రకటన చేసింది.

ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కనిపించటం లేదన్న వార్త నేషనల్‌ మీడియాలో సంచలనమైంది. దాంతో సెంట్రల్‌ గవర్నమెంట్‌ కూడా అలర్ట్‌ అయింది. ఆరు జిల్లాల్లో సెర్చ్‌ ఆపరేషన్‌ మొదలయ్యింది. పోలీసు, సీఆర్‌పీఎఫ్, యాంటీ నక్సల్ విభాగాల బలగాలు నల్లమల ఫారెస్ట్‌కి వెళ్లాయి. ఆర్మీ హెలికాప్టర్లు సైతం రంగంలోకి దిగాయి. సుఖోయ్ యుద్ధ విమానాన్ని కూడా పంపించారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు కూడా తమ వైఎస్‌ జాడకోసం గాలించారు. అయితే అప్పుడు జోరు వాన..వాతావరణం ఏ మాత్రం బాగా లేదు. గాలింపు చర్యలకు తీవ్ర అంతరాయం కలిగింది. అయినా ఆపరేషన్‌ ఆగలేదు…అలా 25 గంటల సుదీర్ఘ గాలింపు చర్యల తర్వాత నల్లమల పావురాల గుట్టలో ఏం కనిపించిందంటే..

అదో కొండ శిఖరాగ్రం. అక్కడ మృతదేహాలన్నీ చిందరవందరగా పడ్డాయి. శరీర భాగాలు చెల్లాచెదురయ్యాయి. హెలికాప్టర్‌లో మంటలు రేగటంతో శరీరాలు కూడా కాలిపోయి కనిపించాయి. అయితే, తర్వాత వర్షం కురవటం వల్లనేమో సగం కాలినట్లు కనిపిస్తున్నాయి.

హెలికాప్టర్ కొండను ఢీ కొట్టి ముక్కలయ్యింది. తోక భాగం ఒకచోట, రెక్కలు ఒకచోట, ఇంజిన్ మరొకచోట పడి కనిపించాయి. మిగతా భాగమంతా ముక్కలు చెక్కలయింది. కూలిపోయిన ఇంజిన్ సమీపంలోనే సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి డెడ్‌ బాడీ కనిపించింది. బట్టతల, పంచె కట్టు కావటంతో ఆయన్ని సులభంగానే గుర్తించారు.

హెలికాప్టన్ వెనక భాగం పడివున్న చోట ఇద్దరు పైలట్ల మృతదేహాలు.. వారికి దూరంగా సెక్యూరిటీ ఆఫీసర్‌ వెస్లీ, వీరికి కింది భాగంలో సీఎంవో ముఖ్య కార్యదర్శి సుబ్రహ్మణ్యం మృతదేహాలు పడిఉన్నాయి. కాగా ఒక పైలట్ మృతదేహం సీటుకే ఉందని గ్రేహౌండ్స్‌ సిబ్బంది చెప్పారు. మరొక పైలట్ ముఖం దొరికిందన్నారు. గన్ ఉండటంతో వెస్లీని గుర్తించామన్నారు.

ఈ శరీర భాగాలన్నింటినీ గ్రేహౌండ్స్ సిబ్బంది పోగు చేసి నల్లటి పెద్ద క్యారీబ్యాగుల్లోకి వేర్వేరుగా సర్దేశారు. ఆ క్యారీబ్యాగులకు తెల్లటి గుడ్డలు చుట్టి, ఒక్కొక్కటిగా ఆకాశంలో ఆగి ఉన్న హెలికాప్టర్‌లోకి తాడు సహాయంతో పంపించారు.

అసలు ముఖ్యమంత్రి ప్రయాణించే హెలికాప్టర్‌ ఎలా కూలింది. భద్రతా పరంగా అన్ని తనిఖీలు చేసిన తరువాతే అనుమతిస్తారు. అలాంటి ప్రమాదం బారిన ఎలా పడింది అన్నది ఇప్పటికీ ప్రశ్నగానే మిగిలిపోయింది. సాధారనంగా సీఎం అగస్టా హెలికాప్టర్ లో ప్రయాణిస్తారు. కానీ ఆరోజు మాత్రం బెల్ 430లో వెళ్లారు. పైగా, ఆరోజు వర్షం పడుతోంది. అయినా హెలికాప్టర్ ప్రయాణానికి పర్మిషన్‌ ఎలా లభించింది అన్నది కూడా పెద్ద ప్రశ్న. ఇవి పలు అనుమానాలకు దారితీశాయి. దాంతో ఈ ప్రమాదానికి కొందరు కుట్ర కోణం జోడించారు.

వైఎస్‌ ఎలా చనిపోయారో తెలుసుకునేందుకు ప్రభుత్వం ఆర్ కె త్యాగి నేతృత్వంలో డీజీసీఏ టెక్నికల్‌ కమిటీని నియమించింది. ఈ కమిటీ 139 పేజీల రిపోర్టు ఇచ్చింది. దాని ప్రకారం.. హెలికాప్టర్‌ గేర్‌బాక్సులో లూబ్రికెంట్ ఆయిల్ సరఫరాలో లోపం తలెత్తింది. దానిని సరిదిద్దేందుకు పైలట్లు ప్రయత్నించారు. ఈ క్రమంలో హెలికాప్టర్‌పై నియంత్రణ కోల్పోయారు. దాంతో హెలికాప్టర్ చాలా స్పీడ్‌గా కింద పడిపోయింది. అలాగే, ఆరోజు ఫ్లైట్ ప్లానింగ్‌లోనూ చాలా లోపాలు ఉన్నాయని తెలిపింది. వైఎస్‌ఆర్‌ తో పాటు సీఎంఓ ముఖ్య కార్యదర్శి సుబ్రహ్మణ్యం, సీఎం ప్రధాన భద్రతాధికారి ఏఎస్‌సీ వెస్లీ, హెలికాప్టర్ నడిపిస్తున్న పైలట్ ఎస్ కే భాటియా, కోపైలట్ ఎం సత్యనారాయణ రెడ్డి కూడా ఈ ఘటనలో దుర్మరణం చెందారు.

బుధవారం ఉదయం 9 గంటల 27 నిమిషాల 57 సెకండ్లకు కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ (సీవీఆర్) పనిచేయడం ఆగిపోయిందని డీజీసీఏ నివేదిక పేర్కొంది. తర్వాతి రోజు గురువారం ఉదయం 9.20 గంటలకు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ కూలిన హెలికాప్టర్‌ను గుర్తించింది. సీఎం జాడ తెలియకుండా పోయిన 25 గంటల తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి పి చిదంబరం ఢిల్లీలో అధికారిక ప్రకటన చేశారు.

ఏదేమైనా, ఐదేళ్ల పాటు జనరంజక పాలన అందించిన ముఖ్యమంత్రిగా వైఎస్సార్‌ ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో నిలిచిపోతారు. ఆరోగ్యశ్రీ.. ఇందిరమ్మ ఇళ్లు..ఫీజ్‌ రియెంబర్స్‌ ..వృద్ధాప్య ఫించన్లు..ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా జననేతగా ఆయన బడుగుల గుండెల్లో కొలువై ఉన్నారు. వైఎస్సార్‌ మరణంతో ఆనాడు యావత్‌ రాష్ట్రం కంటతడి పెట్టింది. పేదలు తమ పెద్ద కొడుకు పోయాడన్నంతగా కన్నీరు మున్నీరయ్యారు. అందుకే ఆయన చనిపోయి 12 ఏళ్లవుతున్నా ఇంకా జన హృదయాల్లో ఆయన స్థానం చెక్కు చెదరలేదనటం అతిశయోక్తి కాదేమో!!