Site icon NTV Telugu

డబ్బింగ్ రచనలో రారాజు రాజశ్రీ!

Remembering Legendary Dubbing Writer Rajashri on his Birth Anniversary

(ఆగస్టు 31న ప్రముఖ రచయిత రాజశ్రీ జయంతి)
ఇందుకూరి రామకృష్ణంరాజు అంటే జనానికి అంతగా తెలియదు కానీ, రచయిత రాజశ్రీ అనగానే ‘ఓస్…మనోడే…’ అంటారు తెలుగు సినిమా అభిమానులు. బహుముఖ ప్రజ్ఞకు మరోరూపం రాజశ్రీ అని చెప్పక తప్పదు. పాటలు పలికించారు. మాటలతో అలరించారు. అనువాద చిత్రాలకు మరింతగా రచన చేసి మురిపించారు. సంగీతం సమకూర్చారు. దర్శకత్వమూ నెరిపారు. ఏది చేసినా అందులో తనదైన బాణీ పలికించారు. అందుకే రాజశ్రీ అనగానే ఆయన బహుముఖ ప్రజ్ఞను ఈ నాటికీ గుర్తు చేసుకొని సాహితీప్రియులు మురిసిపోతుంటారు.

రాజశ్రీ 1934 ఆగస్టు 31న విజయనగరంలో జన్మించారు. మహారాజా కళాశాల నుండి బి.ఎస్సీ, పట్టా పుచ్చుకున్నారు. చదువుకొనే రోజుల నుంచీ శ్రీశ్రీ అంటే ఆయనకు ఎంతో అభిమానం. దాంతో కవితలు, పద్యాలు రాసేసి చుట్టూ ఉన్న వారిని అలరించేవారు. నాటికలు, నాటకాలు రాసి వాటికి దర్శకత్వం వహించి ఆకట్టుకొనేవారు. విజయనగరం తాసిల్దార్ కార్యాలయంలో కొంతకాలం టైపిస్ట్ గా పనిచేశారు. తమిళ సూపర్ స్టార్ ఎమ్‌జీఆర్ కోసం ఓ కథ రాసుకొని, మదరాసు వెళ్ళి దానిని వినిపించారు. ఆ కథ ఎమ్జీఆర్ కు బాగా నచ్చింది. అదే కథతో ఎమ్జీఆర్ ‘తేడీవంద మాప్పిళ్ళై’ సినిమా రూపొందింది. ఆ తరువాత ప్రముఖ తెలుగు రచయితలు పినిశెట్టి శ్రీరామమూర్తి, మానాపురం అప్పారావు దర్శకత్వం వహించిన చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. తెలుగువారి తొలి అనువాద చిత్రం ‘ఆహుతి’కి శ్రీశ్రీ రచన అలరించింది. అప్పటి నుంచీ శ్రీశ్రీ ఓవైపు తన బాణీ పలికిస్తూనే, మరోవైపు డబ్బింగ్ రైటర్ గానూ మురిపించారు. శ్రీశ్రీ అభిమాని అయిన రామకృష్ణంరాజు చిత్రసీమలో తన పేరును రాజశ్రీగా మార్చుకున్నారు. కన్నాంబ, కడారు నాగభూషణం దంపతులు నిర్మించిన “ఆడపెత్తనం” చిత్రానికి శ్రీరామ్మూర్తి వద్ద పనిచేసిన రాజశ్రీ, తరువాత “అన్న-తమ్ముడు, పరువు-ప్రతిష్ఠ, శాంత, నిత్యకళ్యాణం పచ్చతోరణం, శ్రీకృష్ణమాయ” వంటి సినిమాలకు రచనలో పాలు పంచుకున్నారు. అదే సమయంలో పది తమిళ చిత్రాలకు కథ స్క్రీన్ ప్లే రాశారు. తెలుగులో చలం, దాసరి నారాయణరావు వంటివారు రాజశ్రీని పాటల రచయితగా బాగా ప్రోత్సహించారు. చలం నిర్మించిన “సంబరాల రాంబాబు, బుల్లెమ్మా-బుల్లోడు, దేవుడమ్మ, తులాభారం, రాముడే దేవుడు, ఊరికి ఉపకారి” వంటి చిత్రాలకు పాటలతో అలరించారు.

చలం పరభాషల్లో విజయవంతమైన చిత్రాలను తెలుగులో రీమేక్ చేసే సమయంలో రాజశ్రీతోనే రచన చేయించేవారు. అలా పలు భాషల చిత్రాలు చూస్తూ పట్టు సంపాదించారు. కొన్ని చిత్రాలను మన తెలుగు నిర్మాతలు డబ్బింగ్ చేసేవారు. దాంతో తెలుగు మాటలు, పాటలు రాజశ్రీ పలికించేవారు. అలా అనువాద చిత్రాలకు మాటలు, పాటలు అందించడంలో రాజశ్రీ బిజీ అయిపోయారు. దాదాపు వెయ్యిపైగా చిత్రాలకు రాజశ్రీ అనువాద రచన చేశారు. వాటితో పాటు అనేక తెలుగు చిత్రాలకు కథలు అందించారు, పాటలు రాశారు. మణిరత్నం, శంకర్ వంటి టాప్ డైరెక్టర్స్ తమ తెలుగు అనువాద చిత్రాలకు రాజశ్రీతోనే పాటలు మాటలు రాయించుకొనేవారు. మణిరత్నం తెరకెక్కించిన ఏకైక తెలుగు చిత్రం ‘గీతాంజలి’ చిత్రానికి ఆయనే రచన చేశారు. శంకర్ రూపొందించిన ‘ప్రేమికుడు’ చిత్రానికి రచన చేశాక, నిద్రలోనే రాజశ్రీ కన్నుమూశారు.

రాజశ్రీ నేడు మనమధ్య లేకపోయినా, ఆయన రాసిన అనేక పాటలు ఈ నాటికీ అలరిస్తూనే ఉన్నాయి. ‘మా దైవం’లోని “ఒకే కులం ఒకే మతం అందరు ఒకటే…” అనే పాట ఇప్పటికీ కులమతభేదాలకు అతీతంగా చర్చలు సాగే సమయంలో వినియోగిస్తూనే ఉన్నారు. “కురిసింది వానా… నా గుండెలోన…”, “యమునా తీరానా రాధ ఒడిలోన…”, “సింహాచలము మహాపుణ్యక్షేత్రము…”, “మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాట…”, “నన్ను ఎవరో తాకిరి… “, “రాధకు నీవేరా ప్రాణం…”, “ఇదే నా మొదటి ప్రేమలేఖ…”, “ఇది పాట కానే కాదు…” వంటి పాటలు రాజశ్రీలోని కవిహృదయాన్ని మనముందు నిలుపుతూనే ఉంటాయి. పాటలు, మాటలు పలికించడంలోనే కాదు సంగీతం సమకూర్చడంలోనూ రాజశ్రీకి పట్టుంది. అది తెలిసిన కొందరు ఆయనతో స్వరకల్పన కూడా చేయించారు. “వెంకన్నబాబు, మామాకోడలు, పెళ్ళిచేసిచూపిస్తాం” వంటి చిత్రాలకు రాజశ్రీ సంగీతం అందించారు. ఇక “చదువు-సంస్కారం, నిజం నిద్రపోదు, ఓ ప్రేమ కథ” వంటి చిత్రాలకూ దర్శకత్వం వహించారు. రాజశ్రీ పేరు గుర్తుకు రాగానే ఈ నాటికీ ఆయన బహుముఖ ప్రజ్ఞను గుర్తు చేసుకొనేవారెందరో ఉన్నారు.

Exit mobile version