Site icon NTV Telugu

హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్ ఓటమికి కారణాలు..!

ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ ఘన విజయం సాధించారు. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచానాల మేరకు ఈటల విజయం సాధించారు. ఐతే, ఈటలకు ఈ స్థాయిలో మెజార్టీ లభిస్తుందని ఎవరూ ఊహించలేదు. దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికగా విశ్లేషకులు దీనిని అభివర్ణించారు. సీఎం కేసీఆర్‌ హుజురాబాద్‌ ఉప ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసున్నారు. నాలుగు నెలల సుదీర్ఘ ప్రచారంతో హైవోల్టేజీ ఎలక్షన్‌గా మారింది.

హుజూరాబాద్‌లో టఫ్‌ ఫైట్‌ తప్పదని మొదటి నుంచి అనుకున్నదే. ఎవరు గెలిచినా చాలా తక్కువతో బయటపడతారని అనుకున్నారు. మెజార్టీ ఐదు నుంచి పది వేల లోపే అని పోల్‌ సర్వేలు కూడా స్పష్టం చేశాయి. కానీ ఈటల సాధించిన మెజార్టీ అంచనాలను తలకిందులు చేసింది. గులాబీ దళానికి ఇది పెద్ద షాక్‌. తక్కువ మార్జిన్‌తో అయినా గెలుస్తామనే నమ్మకంతో ఉన్నారు. కానీ ఈటలను ఈ స్థాయి విజయం వరించటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఏదేమైనా నేటితో ఐదు నెలల హుజురాబాద్‌ ఎన్నికలల ప్రహసనానికి ఎండ్ కార్డు పడ్డట్టయింది.

కేసీఆర్‌ అధికారానికి …ఈటల ఆత్మగౌరవానికి మధ్య పోరాటంగా విశ్లేషకులు ఈ ఉప ఎన్నికను అభివర్ణించారు. అధికార టీఆర్‌ఎస్‌ ఈ ఎన్నికలకు చేసినంత ఎక్సర్‌సైజ్‌ మరే ఉప ఎన్నికలకు చేయలేదని చెప్పొచ్చు. ఆర్థిక మంత్రి హరీష్‌ రావు సారధ్యంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్‌ నేతలు, ఇతర ప్రజా ప్రతినిధులు నియెజకవర్గం అణువణువూ కాలికి బలపం కట్టుకుని ప్రచారం చేశారు.

హుజురాబాద్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ అయినా మంత్రి హరీష్ రావు అంతా తానై ప్రచారం చేశారు. వ్యూహాలు దగ్గరుండి అమలు చేశాడు. హామీల వర్షం కురింపించాడు. వాటి అమలుకు తాను గ్యారంటీ అన్నాడు. మొత్తం మీద ఓటర్లను ఆకట్టుకునేందుకు చేయని ప్రయత్నం లేదు. ఇక అభివృద్ధి పథకాలకు వందలాది కోట్లు విడుదల చేశారు. రైతు బంధు ఇచ్చారు. గొర్రెల పంపిణీ జరిగింది. దళిత బంధుకు కులాల వారిగా వరాలిచ్చారు. ఇవి గాక భారీగా నగదు పంపిణీ జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు ఈటల ఒక్కడే అన్నీ తానై ఆత్మగౌరవాన్ని నమ్ముకి ప్రచారం చేశారు. ప్రచారం చివరలో బీజేపీ నాయక గణం నియోజకర్గం చుట్టి ఈటల గెలుపుకు ప్రచారం చేశారు.

హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపునకు.. టీఆర్‌ఎస్‌ ఓటమికి ప్రధానంగా ఐదు కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది సానుభూతి ఓటు. ఈటల రాజేందర్‌ జూన్‌లో రాజీనామా చేశారు. ఆయనను పదవి నుంచి తీసేసిన తీరు అన్యాయమనే భావన హుజూరాబాద్‌ ప్రజలకు కలగటం సహజం.
అది సానుభూతి ఓటుగా మారుతుంది. ఎన్నికలు వెంటనే జరిగితే ఆ సెంటిమెంట్‌ ఎక్కువగా ఉంటుంది. ఎలక్షన్‌ ఆలస్యం అయ్యే కొద్దీ దాని ప్రభావం తగ్గుతుంది. అందుకే కావచ్చు ఎన్నికలు సాధ్యమైనంత ఆలస్యం కావాలని టీఆర్‌ఎస్‌ కోరుకుంది. అది కోరుకున్నట్టే ఈటల రాజీనామా చేసిన ఐదు నెలల తరువాత ఈ ఎన్నికలు జరిగాయి. ఈటలకు సానుభూతి తగ్గుతుందని అధికార పక్షమే కాదు..ఎన్నికల విశ్లేషకులూ బావించారు. కానీ సానుభూతి ఏమాత్రం తగ్గలేదని ఎన్నికల ఫలితం నిరూపించింది. ఉద్యమ నేతగా ఈటల పట్ల హుజురాబాద్‌ ప్రజలు కృతజ్ఞత ప్రదర్శించారని చెప్పొచ్చు.

యువ ఓటర్లు కూడా టీఆర్‌ఎస్‌ ఓటమికి కారణమయ్యారు. నిరుద్యోగ సమస్య ఈ ఎన్నికల్లో బాగా హైలైట్‌ అయింది. చదువుకున్న నిరుద్యోగులు, కరోనా సమయంలో ఉద్యోగాలు కోల్పోయిన వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారని అర్థమవుతోంది. ఈసారి దాదాపు 10 వేల కొత్త ఓట్లు జత అయ్యాయి. యువతరం ఓటు గంపగుత్తగా ఈటలకు పడ్డట్టు తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌ తమకు ఆధిక్యం లభిస్తుందని ఆశించిన మండలాలలో కూడా కాషాయ జెండా ఎగరటం ఆశ్చర్యం కలిగిస్తోంది. యువ ఓటర్లు డబ్బు తీసుకుని కూడా ఓటేయలేదన్న భావన కలుగుతోంది.

ఈటల గెలవాలని టీఆర్‌ఎస్ కింది స్థాయి శ్రేణులు కూడా భావించి ఉండవచ్చు. కేసీఆర్‌ తమ మాట వినాలంటే అప్పుడప్పుడు ఇలాంటి షాక్‌ లు తగలాలని బహుశా వారు భావించి ఉండవచ్చు. అంతేగాక ఈటల రాజేందర్‌ నిన్న మొన్నటి వరకు టీఆర్‌ఎస్‌లో ఉన్నారు. హుజురాబాద్‌ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ అంటే కేరాఫ్‌ అడ్రస్‌ ఈటల రాజేందర్‌. పైగా ఉద్యమ కాలం నుంచి ఉన్నవారు అంత త్వరగా ఈటలకు వ్యతిరేకంగా మారతారనుకోలేము. టీఆర్‌ఎస్‌ శ్రేణులతో ఈటలకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీనికి తోడు కేసీఆర్, మంత్రులు అందుబాటులో ఉండరనే ఒక అసంతృప్తి గులాబీ పార్టీ శ్రేణులలో బలంగా ఉందనే ప్రచారం కూడా జరిగింది.

ఇక మరో కారణం ఈటల రాజేందర్‌కు టీఆర్‌ఎస్‌ ఎన్నికల ట్రిక్కులన్నీ కొట్టినపిండి. నిన్నమొన్నటి వరకు ఆయన ఆ పార్టీలోనే ఉన్నారు. కాబట్టి ప్రత్యర్థి కదలికలకు తగ్గట్టు ఎత్తుకు పై ఎత్తులు వేసి టీఆర్‌ఎస్‌ పోల్‌మేనేజ్‌మెంట్‌ను సమర్థవంతంగా అడ్డుకోగలిగారు. ఉద్యమ కాలం నుంచి కేసీఆర్‌కు అత్యంత సన్నిహితులతో ఈటల ఒకరు. కాబట్టి కేసీఆర్‌ వ్యూహాలు ఎలావుంటాయో ఈటల కన్నా ఎక్కువ ఎవరికి తెలుసు. ఆ అనుభవం ఆయనకు ఇప్పుడు ఉపయోగపడింది.

టీఆర్‌ఎస్‌ ఓటమికి ప్రధాన కారణం దళిత బంధు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవటం. ఈ పథకంతో 40 వేల పై చిలుకు దళిత ఓట్లు గంపగుత్తగా తమకే పడతాయని టీఆర్‌ఎస్‌ ఆశించింది. కానీ అది వర్కవుట్‌ కాలేదని ఈటల గెలుపు స్పష్టం చేసింది. కేసీఆర్‌పై దళితులలో ఎన్నో అపనమ్మకాలు ఉన్నాయి. ముఖ్యంగా మాదిగలలో. గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చటంలో విఫలం కావటం ఆయనపై ఈ అపనమ్మకాలకు కారణం కావచ్చు. అలాగే ఇతర సామాజిక వర్గాi దళిత బంధు పట్ల వ్యతిరేకతతో ఉన్నారు. దళితబంధు పైలట్‌ ప్రాజెక్టు గ్రామం శాలపల్లిలో బీజేపీకి ఆధిక్యం రావటం ఆ వ్యతిరేకతకు అద్దంపడుతుంది. అంతేకాదు ఇది టీఆర్‌ఎస్‌కు పెద్ద షాక్‌ అని చెప్పొచ్చు. ఎన్నికల తరువాత దళిత బంధు ఉండదని బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. జీహెచ్‌ఎంసీ వరద సాయాన్ని అందుకు ఉదాహరణగా చూపించింది. మొత్తానికి దళిత బంధును వారు నమ్మినట్టు కనిపించలేదు.

ఓటర్లకు డబ్బు ఆశ చూపి గెలిచే అవకాశన్ని కూడా బీజేపీ తన ప్రత్యర్థికి ఇవ్వలేదు. కమలం పార్టీ పార్టీ కూడా పెద్ద ఎత్తున నగదు పంపిణీ చేయటం టీవీలలో చూశాము. కాసులు ఇద్దరూ పంచితే దాని ప్రభావం న్యూట్రల్‌ అవుతుంది. హుజురాబాద్‌లో అదే జరిగినట్టు కనిపిస్తోంది. ఇక ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు లభించిన ఓట్లు చాలా తక్కువ. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థికి 61 వేల ఓట్లు పోలయ్యాయి. కానీ ఇప్పుడు కాంగ్రెస్‌ అభ్యర్థికి కనీసం డిపాజిట్‌ కూడా దక్కలేదు. మరి ఆ ఓట్లు ఎటు వెళ్లినట్టు? టీఆర్‌ఎస్‌కు వెళ్లాయనిపిస్తోంది. ఒక వేళ అవి ఈటలకు వచ్చి ఉంటే ఆయన మెజార్టీ ఇంకా పెరిగేదేమో!!
-B.Ramesh Bbau Bhonagiri

Exit mobile version