ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికకు రంగం సిద్ధమైంది.. 2022 సెప్టెంబర్ నెలలో అధ్యక్ష ఎన్నిక నిర్వహించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం నిర్ణయించింది.. నవంబర్ 1వ తేదీ నుంచి సత్యభత్వ నమోదు ప్రక్రియ ప్రారంభమై 2022 ఆగస్టు నెలాఖరు వరకు కొనసాగనుంది.. అయితే, ఈ సమావేశంలో తిరిగి ఏఐసీసీ బాధ్యతలు స్వీకరించాలని రాహుల్ గాంధీని కోరారు.. మరోవైపు.. తాను కాంగ్రెస్‌కు తాత్కాలిక అధ్యక్షురాలిగా లేనని.. పూర్తిస్థాయిలో బాధ్యతలు నిర్వహిస్తున్నానని సోనియా గాంధీ స్పష్టం చేశారు. ఏదైనా మాట్లాడాలి అనుకుంటే నేరుగా తనతో మాట్లాడొచ్చన్నారు.
సోనియా గాంధీ తర్వాత ఏఐసీసీ అధ్యక్ష బాధ్యతలు కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీకే అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ దిశగా పార్టీ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్.. రాహుల్ పేరును నామినేట్ చేసినట్టుగా తెలుస్తోంది. 2022 సెప్టెంబర్ నాటికి ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాహుల్ పేరును గెహ్లాట్ నామినేట్ చేస్తే.. దీనికి కాంగ్రెస్ నేతలు మద్దతిచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే, సోనియా తర్వాత అధ్యక్ష బాధ్యతలు స్వీకరించేందుకు రాహుల్ ఆలోచిస్తానని కొద్దిసేపటి క్రితం చెప్పారని తెలుస్తుంది.. ఇక, కాంగ్రెస్ సీనియర్ నేతల స్పందనపై ఆనందాన్ని వ్యక్తం చేసిన రాహుల్ గాంధీ.. ఇదే అభిమానాన్ని తనపై కొనసాగించాలని వ్యాఖ్యానించినట్టుగా సమాచారం.
