NTV Telugu Site icon

రివ్యూ : ‘రామే ఆండాలుమ్ రావణే ఆండాలుమ్’ (తమిళం)

Raame Aandalum Raavane Aandalum Review

Raame Aandalum Raavane Aandalum Review

నటుడు, నిర్మాత సూర్య ఇటీవల అమెజాన్ ప్రైమ్ వీడియోస్ తో ఓ ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇందులో భాగంగా తన 2డీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో నాలుగు సినిమాలు నిర్మించి, అమెజాన్ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాల్సి ఉంటుంది. తొలి చిత్రంగా ‘రామే ఆండాలుమ్ రావణే ఆండాలుమ్’ ను సూర్య, జ్యోతిక సంయుక్తంగా నిర్మించారు. గత నెల చివరి వారంలో ఇది అమెజాన్ లో స్ట్రీమింగ్ అయ్యింది. అలానే జ్యోతిక 50 చిత్రం ‘ఉడన్ పిరప్పు’ ఈ నెల 14 స్ట్రీమింగ్ కాబోతోంది. ఇక సూర్య నటించిన ‘జై భీమ్’ మూవీ నవంబర్ 2న స్ట్రీమింగ్ కావాల్సి ఉంది.

మిధున్ మాణిక్యం, రమ్యా పాండియన్, వాణీ భోజన్ కీలక పాత్రలు పోషించిన ‘రామే ఆండాలుమ్ రావణే ఆండాలుమ్’ (రా.రా) చిత్రం విషయానికి వస్తే ఇదో పొలిటికల్ సెటైర్ మూవీ. తమిళనాడులోని పూచెరీ అనే కుగ్రామానికి చెందిన కున్నిముత్తు (మిథున్ మాణిక్యం) తన పిల్లలు తప్పిపోయారంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇవ్వడానికి వెళతాడు. స్థానిక ఎమ్మెల్లే కుక్క పిల్ల తప్పిపోయిన కేసును పరిష్కరించడంలో బిజీగా ఉన్న పోలీస్ అధికారులు కున్నిముత్తు ఫిర్యాదును పట్టించుకోరు. పైగా అతను పిల్లలు అని చెబుతోంది ఓ తెల్ల ఎద్దు, ఓ నల్ల ఎద్దు గురించి అని తెలిసి మరింత అవమానించి పంపుతారు. పెళ్ళి సమయంలో మావగారు ఇచ్చిన ఆ జోడెడ్లను కున్నిముత్తు, అతని భార్య వీరాయి (రమ్యా పాండియన్) సొంత బిడ్డల మాదిరే సాకుతారు. వాటి గిట్టలకు నాడాలు కొడుతుంటే కున్నిముత్తు గిలగిలలాడిపోతాడు. అలాంటి అతను అవి తప్పిపోయాయంటే తట్టుకోలేకపోతాడు. చుట్టుపక్కల గ్రామాలు తిరుగుతూ తన ఎద్దుల్ని వెతుకుతూ ఉంటాడు. అలాంటి సమయంలో అతని మీద దొంగ అనే ముద్రవేసి ఓ ఊరివాళ్లు కొడుతుంటే, అనుకోకుండా అక్కడకు వచ్చిన ఛానెల్ రిపోర్టర్ నర్మద (వాణీ భోజన్) అతన్ని కాపాడుతుంది. అయితే… గతంలోనే ఓసారి నర్మద, కున్ని ముత్తును ఓ సందర్భంలో చూసి ఉంటుంది. ఆ విషయాన్ని గుర్తు చేసుకోవడంతో నిజానికి కున్ని ముత్తు జోడెడ్లు తప్పిపోలేదని వాటిని ఎవరో కావాలనే దొంగిలించారనే విషయం తేటతెల్లమౌతుంది. దీని వెనుక అధికార పార్టీ నేతల హస్తం ఉందనేది బయటపడుతుంది. కున్ని ముత్తు ఘటనతో ఛానెల్స్, సోషల్ మీడియా అతనుండే గ్రామంపై ఫోకస్ పెడతాయి. రాజకీయ నాయకులు వికృత క్రీడలో బలిపశువు అయిన కున్ని ముత్తుకు న్యాయం జరిగిందా? అని జోడెడ్లు దొరికాయా? అతని కారణంగా ఆ గ్రామం రూపురేఖలు ఎలా మారిపోయాయి? అనేది మిగతా కథ.

ఓ కుగ్రామం, అందులో జరిగే ఓ అసాధారణ ఘటన, తద్వారా మీడియా ఆ ఊరి మీద ఫోకస్ పెట్టడం… అది జాతీయ స్థాయిలో ఇష్యూగా మారడం… ఇలాంటి అంశాలతో గతంలో కొన్ని సినిమాలు వచ్చాయి. ముఖ్యంగా పదేళ్ల క్రితం వచ్చిన హిందీ చిత్రం ‘పీప్లీ లైవ్’ తర్వాత ప్రాంతీయ భాషల్లోనూ అదే తరహాలో కొన్ని సినిమాలు వచ్చాయి. ఇదీ అంతే. అయితే ఇందులో జోడెడ్ల దొంగతనం అనేది ప్రధానం. కానీ దర్శకుడు ఆ అంశానికే పరిమితం కాకుండా… ప్రస్తుతం తమిళనాడులో రాజకీయాలు ఎలా ఉన్నాయి? అధికార, విపక్షాలు గ్రామాలకు ఏం చేస్తున్నాయి? సందడ్లో సడేమియాగా కేంద్రంలోని అధికార పార్టీ ఎలా పాచికలు వేస్తోందనే అంశాలను స్పృశించాడు. అయితే, చెల్లని వెయ్యి రూపాయల నోటును బలవంతంగా ఓ ఉత్తరాది వ్యాపారికి ఇచ్చి, పైగా చిల్లర ఇవ్వమని కున్నిముత్తు దబాయించడం, ‘నీ ట్రిక్కులు నా దగ్గర కాదు. మీ సొంతూరిలో చూపించు’ అని ఎదురు బెదిరించడం సమంజసంగా లేదు. ఉత్తరాది వారిని, హిందీ మాట్లాడేవారిని కించపరిచే సన్నివేశాలు ఒకటి రెండింటిని ఇందులో అవసరం లేకపోయినా ఆత్మతృప్తి కోసం సూర్య అండ్ టీమ్ చొప్పించినట్టు అర్థమైపోతోంది.

ఇక పేపర్ల వరకే పరిమితమైన అభివృద్ధిని, మీడియా సాయంతో గ్రామంలో తిరిగి సాధించడం అనేది ఓ ఆశాజనకమైన ముగింపు. అదే సమయంలో డబ్బులు తీసుకుని ఓట్లు వేయడం మాననంత వరకూ రాజకీయ నేతలను ప్రశ్నించే హక్కు ఓటర్లకు ఉండదనే అంశాన్నీ దర్శకుడు గట్టిగానే చెప్పాడు. ఇక ఉన్నత చదువులు చదివి సొంతూరిని మర్చిపోయే వారికీ ఇన్ డైరెక్ట్ గా క్లాస్ పీకాడు. తమ జీవనోపాధికి ఉపయోగపడే ఆవులు, ఎద్దుల్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం తగదనే హితవు పలికాడు. పశువుల్ని బలహీన వర్గాలకు జీవనాధారంగా ఇస్తున్నామంటూ కొన్ని రాజకీయ పార్టీలు ఆడుతున్న డ్రామాలను ఎండగట్టాడు.

నటీనటుల నటన సహజంగా ఉంది. హీరో, హీరోయిన్లు గతంలో తెలుగులో నటించకపోయినా వాణీ భోజన్ ఆ మధ్య వచ్చిన ‘మీకు మాత్రమే చెబుతా’లో నాయికగా నటించింది. క్రిష్ నేపథ్య సంగీతం బాగుంది. విశేషం ఏమంటే… ఈ సినిమా నేపథ్యం అన్నాడీఎంకే అధికారంలో ఉన్నప్పటిది. ఇందులో గ్రామంలో ఉండే కున్నిముత్తును ఓదార్చే ప్రతిపక్షనాయకుడిగా స్టాలిన్ వేషధారణలో ఓ వ్యక్తి వస్తాడు. అతనికి అండగా ఉంటానని హామీ ఇస్తాడు. ఐదేళ్ళుగా అధికారంలో ఉన్నవారు ఈ రాష్ట్రంలోని గ్రామాలను ఏమాత్రం పట్టించుకోలేదనే విమర్శలు ముమ్మరంగానే ఇందులో ఉన్నాయి. సో… ప్రస్తుత పాలక పార్టీకి ఈ సినిమా తీయని జిలేబీ లాంటిది! కాస్తంత రాజకీయ స్పృహ ఉన్నవారికే ఇందులోని లోతైన భావన అర్థమౌతుంది. అయితే… గ్రామీణ వికాసానికి, మానవీయ విలువలకు ప్రాధాన్యం ఇచ్చేవారికి ఈ సినిమా నచ్చుతుంది. కమర్షియల్ ఎలిమెంట్స్ ను కోరుకునే వారు దీనికి దూరంగా ఉండటం మంచిది. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ లో చూడొచ్చు.

ప్లస్ పాయింట్స్

మైనెస్ పాయింట్స్

ట్యాగ్ లైన్: పొలిటికల్ సెటైర్!

రేటింగ్ : 3 / 5

Show comments