NTV Telugu Site icon

పక్కింటి అమ్మాయికి అందాల కిరీటం

రెండు దశాబ్దాల నిరీక్షణ ఫలించింది. మరోసారి విశ్వ వేదికపై భారతీయ అందం మెరిసింది. పంజాబ్‌ అమ్మాయి హర్నాజ్ కౌర్ మిస్‌ యూనివర్స్‌ కిరీటాన్ని సొంతం చేసుకుంది. ఇజ్రాయెల్‌లోని ఇలాట్‌లో అట్టహాసంగా సాగిన మిస్‌ యూనివర్స్‌ పోటీలలో 80 దేశాల అందగత్తెలను వెనక్కి నెట్టి టైటిల్‌ విజేతగా నిలిచింది.

భారతీయ యువతి చివరిసారిగా 2000లో మిస్‌ యూనివర్శ్ గెలుచుకుంది. 1994లో తొలిసారి సుస్మితాసేన్ విశ్వసుందరిగా ఎంపిక కాగా, 2000లో లారా దత్తా మిస్‌ యూనివర్స్‌ కిరీటం దక్కించుకుంది. 21 ఏళ్ల తరువాత ఇప్పుడు హర్నాజ్‌ కౌర్‌ దానిని సొంతం చేసుకుంది.

ఆదివారం సాయంత్రం వరకు హర్నాజ్ పెద్దగా ఎవరికీ తెలియదు. రాత్రికి రాత్రి అమె ఇంటర్నేషనల్‌ సెలబ్రిటీ అయ్యారు. అయితే ఈ విజయం ఆమెకు రాత్రికి రాత్రి దక్కింది కాదు. దీని వెనక సంవత్సరాల సాధన ఉంది. అందాల ప్రపంచంలో అగ్ర స్థానానికి ఎదగటం అంటే మాటలు కాదు ..సంవత్సరాల కృషి కావాలి. అందుకే, ఎంతో మందికి మిస్ యూనివర్స్ టైటిల్‌ ఒక కల. ఎందరు పోటీ పడినా ఏటా ఒక్కరు మాత్రమే ఆ కలను నిజం చేసుకోగలుగుతారు. ఇప్పుడు ఈ మిలీనియం గాళ్‌ స్వప్నం సాకారమైంది.

ఈ వెలుగు జిలుగుల్లో కనిపిస్తున్న హర్నాజ్ ఓ పక్కింటి అమ్మాయే! అందరిలా ఈమెకూ స్నేహితులంటే ఇష్టం. సమయం దొరికితే చాలు వారితో కాలక్షేపం చేస్తుంది. ప్రయాణాలంటే మహా సరదా. ఆరోగ్యం కోసం ప్రతి రోజు యోగా తప్పదు. హర్నాజ్‌ మంచి డ్యాన్సర్‌ కూడా. ఈ కాలం అమ్మాయిలు వంట గదికి దూరం అనుకుంటాం..కానీ హర్నాజ్‌కు వంట బాగా వచ్చు.

హర్నాజ్‌ చెస్‌లో దిట్ట. స్విమ్మింగ్‌లో సూపర్‌. అంతేకాదు చాలా బాగా మిమిక్రీ చేస్తుంది. మనుషులతో పాటు జంతువులను కూడా అద్భుతంగా అనుకరిస్తుంది. అంతేకాదు ఆమెలో ఓ కవయిత్రి కూడా ఉంది. మాతృ భాష పంజాబీలో చక్కటి కవితలు అల్లుతుంది.

ఏ పోటీ అయినా ..చివరి అంచుకు చేరాక గెలుపు, ఓటములు వెంట్రుక వాసిలో ఉంటాయి. హర్నాజ్‌ అనుభవం కూడా అదే. ఒత్తిళ్లు ఎదుర్కోవడంలో ప్రస్తుతం ఉన్న యువతకు మీరు ఇచ్చే సలహా ఏమిటి అని జడ్జ్‌ అడిగిన ప్రశ్నకు ఆమె చెప్పిన సమాధానంతో వేదిక హర్షధ్వానాలతో మార్మోగిపోయింది. ఆత్మవిశ్వాసం లేకపోవడమే ఇప్పుడు యువతకు పెద్ద సమస్య అంటారామె. మిమ్మల్ని మీరు ఎదుటి వాళ్లతో పోల్చుకోవడం ఆపాలని విశ్వ వేదిక సాక్షిగా యువతకు సలహా ఇచ్చింది.

హర్నాజ్‌ ప్రస్తుతం పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్‌ చేస్తున్నారు. హర్నాజ్‌ తల్లి ఓ గైనకాలజిస్ట్‌. అమ్మే తనకు ప్రేరణ..తన రోల్‌ మోడల్‌ అంటారు హర్నాజ్‌. మోడలింగ్‌లోకి రావటానికి ప్రోత్సహించింది ఆమె అమ్మేనట!

మిస్ యూనివర్స్ కిరీటంతో పాటు కోట్ల రూపాయల విలువైన బహుమతులు, కాంట్రాక్టులు విజేత సొంతమవుతాయి. 2 లక్షల 50 వేల డాలర్ల ప్రైజ్‌ మనీ లభిస్తుంది. ఏడాది పాటు న్యూయార్క్ లోని మిస్ యూనివర్స్ అపార్ట్‌మెంట్‌లో ఉచిత బస ఏర్పాటు చేస్తారు. మిస్ యూనివర్స్ అపార్ట్‌మెంట్‌లో బస చేసే ఏడాది మొత్తం సరుకులు , రవాణా ఖర్చులు సహా అన్ని అవసరాలను నిర్వాహకులే చూసుకుంటారు. అంతే కాదు ఆమె అవసరాలు చూసేందుకు సహాయకుల బృందం , మేకప్ ఆర్టిస్టులు నిరంతం వెన్నంటి ఉంటారు. మేకప్, హెయిర్‌ ప్రాడక్స్ట్, పాద రక్షలు, బట్టలు, నగలు, చర్మ సంరక్షణకు కావలసిన వాటన్నిటిని వారే సమకూరుస్తారు.

ఆమె మోడలింగ్ పోర్ట్‌ఫోలియో రూపొందించడానికి ఉత్తమ ఫోటోగ్రాఫర్‌లను ఏర్పాటు చేస్తారు. వృత్తిపరమైన స్టైలింగ్, న్యూట్రిషన్, డెర్మటాలజీ, డెంటల్ సర్వీసెస్ అన్నీ సమకూరుస్తారు. స్పెషల్‌ ఈవెంట్స్‌, పార్టీలు, ప్రీమియర్‌లు, స్క్రీనింగ్‌లు, కాస్టింగ్‌లు ఇలా ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలలో పాల్గొంటారు. హోటల్ వసతి, ఆహారంతో సహా అన్ని ప్రయాణ ఖర్చులను నిర్వాహకులే భరిస్తారు. ఏడాది మొత్తం వివిధ ప్రపంచ దేశాలు పర్యటించి..వివిధ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఏడాది తరువాత ఎన్నో సినిమా అవకాశాలు..మోడలింగ్‌ కాంట్రాక్టులు హర్నాజ్‌ కోసం ఎదురు చూస్తుంటాయి.