Site icon NTV Telugu

ప్రధాని మోదీ ఖాతాలో మరో అరుదైన ఘనత

భారత ప్రధాని మోదీని భూటాన్ అత్యున్నత పురస్కారం వరించింది. ఈ విషయాన్ని భూటాన్ దేశ ప్రధాన మంత్రి కార్యాలయం ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. కరోనా సమయంలో తమకు అందించిన మద్దతుకు గుర్తింపుగా తమ దేశ అత్యున్నత అవార్డు ‘నగ్‌డగ్ పెల్ గి ఖోర్లో’ను మోదీకి బహూకరించాలని భూటాన్​రాజు జిగ్మే ఖేసర్​నగ్మే వాంగ్​చుక్​సూచించినట్లు తెలిపింది. ఈ అవార్డును 2008లో భూటాన్ ప్రవేశపెట్టగా అప్పటినుంచి ఇప్పటివరకు ఈ అవార్డు అందుకున్న తొలి విదేశీయుడు మన ప్రధాని మోదీ మాత్రమే.

Read Also: ఇకపై పుట్టిన వెంటనే ఆధార్ నంబర్

డిసెంబర్ 17న భూటాన్ దేశ జాతీయ దినోత్సవం సందర్భంగా తమ దేశ అత్యున్నత అవార్డును మోదీకి ప్రకటించడం ఆనందంగా ఉందని భూటాన్ ప్రధాని లోటే షెరింగ్ అన్నారు. ఈ అవార్డు అందుకునేందుకు మోదీ రాక కోసం ఎదురుచూస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. గత నెలలో భూటాన్‌లో ఈ-రూపే కార్డు రెండో దశను మోదీ ప్రారంభించిన విషయాన్ని కూడా ఆయన గుర్తుచేసుకున్నారు. కాగా గతంలో సౌదీ అరేబియా, అప్ఘనిస్తాన్ దేశాలు కూడా ప్రధాని మోదీని తమ దేశ పౌర పురస్కారాలతో సత్కరించాయి. అమెరికా సైన్యం అందించే ‘లెజియన్ ఆఫ్ మెరిట్’ అవార్డును కూడా మోదీ అందుకున్న సంగతి తెలిసిందే.

Exit mobile version