ప్రస్తుతం దేశంలో కాకలుతీరిన రాజకీయ నాయకుల కంటే.. వ్యూహకర్తలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ విషయంలో ప్రశాంత్ కిశోర్ టాప్‌లో ఉంటే.. ఇప్పుడు ఆయన శిష్య బృందానికి సైతం గిరాకీ పెరిగింది. తెలంగాణలో రాజకీయంగా నిలబడాలని చూస్తోన్న YS షర్మిల.. ఆ బృందంలో నుంచి ఒకరిని వ్యూహకర్తగా ఎంచుకున్నారట. ఆ వ్యూహకర్త సూచనలతో దూకుడుగా వెళ్లాలని నిర్ణయించారట.
షర్మిల పార్టీ వ్యూహకర్తగా పీకే టీమ్‌లోని ప్రియ!
ఈ నెల 8న తెలంగాణలో కొత్త పార్టీ పేరు ప్రకటించబోతున్న YS షర్మిల.. ఒక వ్యూహకర్తను ఎంపిక చేసుకోవడం రాజకీయంగా సంచలన రేకెత్తిస్తోంది. ప్రశాంత్ కిశోర్ శిష్య బృందంలోని సభ్యురాలిని ఆమె వ్యూహకర్తగా ఏర్పాటు చేసుకోవడం ఆసక్తిగా మారింది. ఆ వ్యూహకర్త పేరు ప్రియ. ఆమె తండ్రి తమిళనాడులో DMK ఎమ్మెల్యే రాజేంద్రన్. ఇటీవలే హైదరాబాద్ వచ్చిన ప్రియ.. లోటస్‌పాండ్‌లో షర్మిలతో మాట్లాడి వెళ్లారు. పార్టీ సోషల్ మీడియా వ్యవహారాలను చూడటంతోపాటు.. షర్మిలకు రాజకీయంగా సలహాలు.. సూచనలు ఇవ్వనున్నట్టు చర్చ జరుగుతోంది.
read also : LIVE : సిరిసిల్ల లో సీఎం కేసీఆర్
పార్టీ పేరు ప్రకటించాక ప్రియాను పరిచయం చేస్తారా?
ప్రశాంత్ కిషోర్‌కు దేశంలో ఎంత డిమాండ్ ఉందో తెలిసిందే. 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏపీలో వైఎస్ జగన్‌కు కూడా పీకే వ్యూహకర్తగా పనిచేశారు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడులో డీఎంకే.. పశ్చిమబెంగాల్‌లో తృణముల్ విజయాల వెనక ఆయన వ్యూహాలే కీలకంగా పనిచేశాయి. ఇప్పుడు తెలంగాణలో షర్మిల కూడా ప్రశాంత్ కిశోర్ బృందంలోని ప్రియను ఎంపిక చేసుకోవడం చర్చగా మారింది. 8న పార్టీ పేరు ప్రకటించే సమయం లేదా.. మరోరోజు ఆమెను పార్టీ కార్యకర్తలకు షర్మిల పరిచయం చేస్తారని సమాచారం.
పీకేకు వీలుకాక.. తన టీమ్‌లోని ప్రియాను పంపారా?
పార్టీ పేరు ప్రకటన తర్వాత తెలంగాణలో పర్యటనలకు.. వచ్చే ఎన్నికల నాటికి బలం పుంజుకునేలా ప్రణాళికలు వేసుకున్నారు షర్మిల. అయితే పరిస్థితులు ఆమె ఊహించినట్టుగా లేవట. దీంతో ఓ వ్యూహకర్త ఉంటే బాగుంటుందని ఆమెకు సూచించినట్టు తెలుస్తోంది. వెంటనే ప్రశాంత్ కిశోర్ అండ్ టీమ్‌ను కాంటాక్ట్ చేశారట. అయితే పీకేకు వీలుకాకే.. తమ టీమ్‌లోని ప్రియాను పంపినట్టు ప్రచారం జరుగుతోంది.
ప్రియా టీమ్ పర్యవేక్షణలో రాజకీయ వ్యవహారాలు
ఇటీవల షర్మిల చేసిన కొన్ని కామెంట్స్ దుమారం రేపాయి. ప్రత్యర్థి పార్టీలు స్పందించాయి. అక్కడితో ఆపేయకుండా ప్రజలకు దగ్గరయ్యే కార్యక్రమాలు కూడా చేయాలని ప్రియా సూచించినట్టు తెలుస్తోంది. ఆ విధంగా పార్టీ రాజకీయ వ్యవహారాలన్నీ ఇకపై ప్రియా టీమ్ పర్యవేక్షిస్తుందని చెబుతున్నారు. మీడియా ప్రకటనలు.. సోషల్ మీడియా.. ప్రజల అటెన్షన్ తీసుకొచ్చేలా వ్యూహ రచన చేస్తున్నట్టు సమాచారం. షర్మిల కూడా తన సొంత అజెండాను పక్కన పెట్టేసి.. పూర్తిగా ప్రియా టీమ్ చెప్పినట్టే నడుచుకోవాలని నిర్ణయించారట.
సర్వే రిపోర్టులు ఆధారంగా వ్యూహరచన
తెలంగాణలోని పరిస్థితులను అంచనా వేయడంతోపాటు.. పార్టీపై ప్రజల్లో సానుకూలత ఏ విధంగా ఉందనే దానిపై ఎప్పటికప్పుడు ప్రియా టీమ్ సర్వేలు చేస్తారట. ఆ సర్వే రిపోర్ట్‌లకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుని వ్యూహ రచన చేస్తారట. అలాగే ఏ విధంగా మాట్లాడాలో కూడా షర్మిలకు అవగాహన కల్పిస్తారని చెబుతున్నారు. మరి.. ఈ వ్యూహకర్త ఏర్పాటు షర్మిల్ పార్టీకి ఏ మేరకు ఉపయోగ పడుతుందో చూడాలి.
