NTV Telugu Site icon

బెజవాడలో పొలిటికల్‌ హీట్.. కేశినేని భవన్‌కు భారీగా పార్టీ శ్రేణులు..

బెజవాడలో మరోసారి పొలిటికల్‌ హీట్‌ పెరిగింది.. ఇక, వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోను.. నా కూతురు కూడా ఎన్నికల్లో పోటీ చేయదంటూ.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు.. టీడీపీ సీనియర్‌ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని తెగేసే చెప్పినట్టు ప్రచారం సాగుతోంది.. దీంతో.. బెజవాడలో టీడీపీ పరిస్థితి ఏంటి అనే చర్చ మొదలైంది.. కార్పొనేషన్‌ ఎన్నికల సమయంలో.. టీడీపీలో నెలకొన్న అంతర్గత విభేదాలకు చెక్‌పెట్టేందుకు అప్పట్లో చంద్రబాబు రంగంలోకి దిగారు.. తర్వాత అంతా కేశినేని కూతురుకు మద్దతుగా ప్రచారం చేశారు.. కానీ, అంతర్గత కుమ్ములాటలో అలాగే కొనసాగుతూనే ఉన్నట్టు తెలుస్తోంది.. ఈ నేపథ్యంలోనే విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చిందనే ప్రచారం కూడా ఉంది.. ఈ విషయాలపై కలత చెందిన కేశినేని.. యాక్టివ్‌ పాలిటిక్స్‌కు దూరం కావాలనే నిర్ణయానికి వచ్చారనా తెలుస్తోంది.. పార్టీలో పరిస్థితులపై ఆయన అసంతృప్తిగా ఉండడమే దీనికి కారణం అంటున్నారు.

ఇక, కేశినేని ప్రకటనతో బెజవాడలో మళ్లీ పొలిటికల్‌ హీట్‌ పెరిగింది.. వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలన్న కేశినేని నిర్ణయంతో రాజకీయం రాజుకోగా.. బెజవాడలోని కేశినేని భవన్‌కు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు.. బెజవాడలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు ఇతర నియోజకవర్గాల చెంది కార్యకర్తలు.. భారీగా కేశినేని భవన్‌కు వచ్చారు.. ఎంపీ కేశినేని నానితో సమావేశమైన పార్టీ నేతలు, కార్యకర్తలు… 2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ ఎంపీగా పోటీ చేయాలని కేశినేని నానిపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు.. అయితే, ఎన్నికల్లో పోటీపై కేశినేని క్లారిటీ ఇవ్వకపోయినా.. బెజవాడలో దుర్గమ్మ ఉన్నంత వరకు.. కేశినేని భవన్ ఉంటుందని వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తోంది. దీంతో.. మరోసారి బెజవాడ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.