NTV Telugu Site icon

బీహార్లో భ్రమలు తొలుగుతున్నాయా?

బీహార్లో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయా? అంటే అంతా అవుననే సమాధానమే విస్తోంది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జేడీయూ కూటమి గెలిచింది. వాస్తవానికి ఈ ఎన్నికల్లో రాష్ట్రీయ జనతా దళ్ గెలువాల్సి ఉంది. కానీ చావుతప్పి కన్నులొట్టబోయినట్లు బీజేపీ, జేడీయూ కూటమి విజయం సాధించిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బీహార్లో ప్రస్తుతం బీజేపీ, జేడీయూ కూటమి అధికారంలో ఉండగా నితీష్ కుమార్ సీఎంగా ఉన్నారు. అయితే ఈ కూటమిపై ప్రజలు పెట్టుకున్న భ్రమలు ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.. దీంతో వచ్చే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు ఈ రెండు పార్టీలకు సవాలుగా మారే అవకాశం ఉందని ట్రెండ్ ను బట్టి తెలుస్తోంది.

బీహార్లో ఇప్పట్లో అసెంబ్లీ ఎన్నికలు లేవు. పార్లమెంట్ ఎన్నికలు కూడా 2023లో ఉన్నాయి. అయితే ఇప్పటి నుంచే అక్కడ రాజకీయ సమీకరణాలు మారుతుండటం ఆసక్తిని రేపుతున్నాయి. గత ఎన్నికల్లో రాష్ట్రీయ జనతా దళ(ఆర్జేడీ) ఓటమికి కొన్ని పార్టీల ఓట్ల చీలికే ప్రధాన కారణమని ఆపార్టీ నేతలు భావిస్తున్నారు. ఈక్రమంలోనే తమతో కలిసి వచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు ఆర్జేడీ ప్రణాళికలను రచిస్తోంది. వచ్చే ఎన్నికల్లో కూటమిగా బరిలో దిగేందుకు వ్యూహాలను సిద్ధం చేసుకుంటుంది. దీంతో వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ, జేడీయూ కూటమికి షాక్ తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మొన్నటి బీహార్ ఎన్నికల్లో ఆర్జేడీ గెలుపును కాంగ్రెస్, ఎంఐఎం నిలువరించారు. ఆ రెండు పార్టీలు ఓట్లను చీల్చడంతో అదికాస్తా బీజేపీ, జేడీయూ కూటమికి అడ్వాంటేజ్ గా మారింది. చివరివరకు హోరాహోరీగా సాగిన ఫైట్లో ఆర్జేడీ గెలిచినంత పని చేసింది. అయితే అదృష్టం మాత్రం బీజేపీ, జేడీయూ కూటమి వైపు ఉండటంతో వారే అధికారంలోకి వచ్చారు. ఎన్నికల తర్వాత ఫలితాలను బేరీజు వేసుకున్న ఆర్జేడీ నాయకులు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తమ సత్తా చూపించేందుకు రెడీ అవుతున్నారు. ఈక్రమంలోనే వచ్చే ఎన్నికల్లో తమతోపాటు లోక్ జనశక్తి పార్టీని కలుపుకొని పోయేందుకు ఆర్జేడీ నిర్ణయించుకుంది.

లోక్ జనశక్తి పార్టీని బీజేపీ రాంవిలాస్ పాశ్వాన్ ఉన్నంత వరకు ఆదరించింది. అయితే ఆయన మరణం తర్వాత బీజేపీ ఆపార్టీని దూరం పెట్టింది. నితీష్ కుమార్ కోసమే ఆపార్టీని పక్కన పెట్టిందని తెలుస్తోంది. ఇక పాశ్వాన్ మరణం తర్వాత ఆయన కుమారుడు చిరాగ్ పాశ్వాన్ లోక్ జనశక్తి పార్టీని నడిపిస్తున్నారు. అయితే తన పార్టీని జేడీయూ, బీజేపీ కూటమి చీల్చడమే కాకుండా ఆ పార్టీకి పార్లమెంటులో గుర్తింపు లేకుండా చేశాయని చిరాగ్ పాశ్వన్ మండిపడుతున్నారు. దీంతో ఆయన వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో జేడీయూ, బీజేపీ కూటమిని దెబ్బ కొట్టి తన సత్తా చూపించాలని చూస్తున్నారు.

శత్రువుకు శత్రువు మిత్రుడు అన్న చందంగా ఇప్పుడు ఆర్జేడీతో కలిసేందుకు చిరాగ్ పాశ్వన్ మొగ్గుచూపుతున్నారు. బీజేపీ దూరం పెట్టిన లోక్ జనశక్తి పార్టీని తేజస్వీ యాదవ్ తనవైపు తిప్పుకుంటున్నారు. ఈక్రమంలోనే వీరిద్దరి మధ్య ఇటీవల కీలక భేటీ జరగడం ఆసక్తిని రేపుతోంది. రాబోయే పార్లమెంట్ ఎన్నికలపై వీరిద్దరి చర్చించినట్లు తెలుస్తోంది. ఈక్రమంలోనే వీరిద్దరు ఏకమై వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ రెండు పార్టీలు ఉమ్మడిగా బరిలో దిగితే మాత్రం వార్ వన్ సైడ్ అనే టాక్ విన్పిస్తుంది. దీంతో రాబోయే రోజుల్లో బీహార్ ను ఈ రెండు పార్టీలు శాసించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.