Site icon NTV Telugu

నేడు ప్రధాని మోడీ కీలక భేటీ.. మళ్లీ లాక్‌డౌన్..?

సౌతాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ఇప్పుడు ప్రపంచదేశాలను టెన్షన్‌ పెడుతూనే ఉంది… ఇప్పటికే భారత్‌లోని చాలా రాష్ట్రాల్లో ఒమిక్రాన్‌ కేసులు నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తోంది.. కరోనా ఫస్ట్‌ వేవ్‌, సెకండ్‌ వేవ్‌ భారీ నష్టాన్ని మిగిల్చడంతో.. కొత్త వేరియంట్‌ను ఎలా ఎదుర్కోవాలి అనే దానిపై దృష్టిసారించారు ప్రధాని నరేంద్ర మోడీ.. ఈ నేపథ్యంలో ఇవాళ కీలక సమావేశం నిర్వహించనున్నారు… దేశంలో కోవిడ్‌ వ్యాప్తి పరిస్థితిని సమీక్షిస్తారు. రోజురోజుకీ కోవిడ్‌ కేసులు పెరుగుతుండగా.. మరోవైపు బూస్టర్‌ డోస్‌ పంపిణీపై పలు రాష్ట్రాల నుంచి ఇప్పటికే కేంద్రానికి విజ్ఞప్తులు వెళ్లాయి.. దీంతో, ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహించనున్న సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది.

ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసులో వెలుగులోకి వచ్చిన తర్వాత నవంబర్‌ నెలాఖరులో సమీక్ష జరిపారు ప్రధాని నరేంద్ర మోడీ.. అయితే, ఇప్పుడు ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య దేశంలోనే 213కి చేరాయి. 15 రాష్ట్రాల్లో ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసులు నమోదయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో 57 కేసులు, మహారాష్ట్రలో 54, తెలంగాణలో 24, కర్ణాటకలో 19, రాజస్థాన్‌లో 18, కేరళలలో 15, గుజరాత్‌లో 14.. ఇలా మొత్తంగా 15 రాష్ట్రాల్లో ఒమిక్రాన్‌ కేసులు వెలుగుచూశాయి. అయితే, ఇప్పటి వరకు 90 మంది రికవరీ అయినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇక, ఇవాళ సమీక్ష నిర్వహించనున్న ప్రధాని మోడీ.. అన్ని పరీస్థితులను సమీక్షించనున్నారు.. బూస్టర్‌ డోసులు ఎంత వరకు అవసరం..? ఎప్పుడు ఇవ్వాలనే విషయంలో శాస్త్రీయ నిర్ణయాలకు అనుగుణంగా వ్యవహరిస్తామని నీతి ఆయోగ్‌ సభ్యుడు డాక్టర్‌ వీకే పాల్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే.. ఆక్సిజన్‌ సమర్థ నిర్వహణ, వృథా నివారణపై ఆరోగ్య కార్యకర్తలకు కేంద్రం శిక్షణ ఇస్తోంది. వీటి అన్నింటిని సమీక్ష జరగనుంది.. అదే విధంగా.. పండుగలు రానుండడంతో రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తూ వస్తున్నాయి.. ఓవైపు వ్యాక్సినేషన్‌లో వేగం పెంచుతూనే మరోవైపు కట్టడి చర్చలపై ఫోకస్‌ పెట్టనున్నారు.. దీనికోసం.. క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌పై ఆంక్షలు విధించేందుకు సిద్ధం అయ్యారు. అవసరమైతే.. ప్రజలు గుంపులుగా ఒకేచోటికి చేరే అవకాశం లేకుండా.. కర్ఫ్యూ, లాక్‌డౌన్‌ లాంటి కఠిన నిర్ణయాలను కూడా తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సమీక్ష సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు.. కోవిడ్-19 టెస్ట్‌లను పెంచాలని.. నైట్ లాక్‌డౌన్‌ల వంటి దశలను పరిగణనలోకి తీసుకోవాలని కేంద్రం రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలను కోరింది. ఒక వారంలో అన్ని పరీక్షలలో 10 శాతం కంటే ఎక్కువ పాజిటివ్‌ రేటు నమోదైతే.. లేదా హాస్పిటల్ బెడ్‌ల ఆక్యుపెన్సీ సామర్థ్యంలో 40 శాతం దాటితే ప్రజలు గుమిగూడే అవకాశం ఉన్న సమావేశాలపై నిషేధం విధించాలని కేంద్రం సూచించిన విషయం తెలిసిందే.

Exit mobile version