Site icon NTV Telugu

గుడ్‌న్యూస్‌.. పెట్రోల్‌ ధర భారీ తగ్గింపు.. అక్కడ మాత్రమే..

fuel prices

fuel prices

వరుసగా పెరుగుతూ పోయిన పెట్రోల్ ధరలు సామాన్యులకు భారంగా మారాయి… దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో పెట్రోల్ ధర సెంచరీ ఎప్పుడో కొట్టేస్తే… డీజిల్‌ ధర కూడా కొన్ని రాష్ట్రాలు, ప్రాంతాల్లో వంద దాటేసింది.. అయితే, త‌మిళ‌నాడు ప్రజ‌ల‌కు గుడ్‌న్యూస్‌ చెప్పింది ఆ రాష్ట్ర ప్రభుత్వం.. పెట్రోల్‌పై రాష్ట్ర ప్రభుత్వం విధించే పన్నులను తగ్గించనున్నట్టు తమిళనాడు ఆర్థికమంత్రి పీ తియ‌గ రాజ‌న్ వెల్లడించారు.. దీంతో రాష్ట్రంలో లీట‌రు పెట్రోల్ పై మూడు రూపాయలు తగ్గుతుందని తెలిపారు. అయితే, ఈ నిర్ణయంతో రాష్ట్రానికి ప్రతి ఏడాది సుమారు రూ. 1160 కోట్ల న‌ష్టం రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుందన్నారు.

మా ప్రభుత్వం లీటర్‌ పెట్రోల్‌పై రూ.3 చొప్పున పన్నును తగ్గించాలని నిర్ణయించింది.. తద్వారా రాష్ట్రంలోని కార్మికులు, ప్రజలకు పెద్ద ఉపశమనం కలుగుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ సవరించిన బడ్జెట్ అంచనాల పత్రంలో పేర్కొంది. కాగా, మే నుండి వరుసగా పెట్రో ధరలు పెరుగుతూ వచ్చాయి.. ఎప్పుడూలేని విధంగా పెట్రో ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఒడిషా, తమిళనాడు, కేరళ, బీహార్ మరియు పంజాబ్‌తో సహా 15 రాష్ట్రాలలో చాలా చోట్ల.. ఉత్తర ప్రదేశ్ మరియు హర్యానాలోని కొన్ని జిల్లాల్లో ఎప్పుడో పెట్రోల్‌ ధరలు వంద దాటిపోయిన సంగతి తెలిసిందే. అయితే, తమిళనాడు ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో.. శనివారం నుంచి అమల్లోకి వస్తుంది.

Exit mobile version