Site icon NTV Telugu

పేర్ని నాని వర్సెస్ ప్రశాంత్ రెడ్డి.. ఏంటీ మాటల దాడి

రాజకీయాలంటే వేడిగానే వుంటాయి. అందునా తెలుగు రాష్ట్రాల్లో మంత్రులు, విపక్షాల మధ్య అయితే ఇది మరీ వేడిగా వుంటుంది. ఏపీ తెలంగాణ మధ్య తాజాగా మాటల దాడి వేడిని పుట్టిస్తోంది. తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఏపీ సీఎం జగన్, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద హాట్ కామెంట్లు చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇస్తే తెలంగాణ ప్రజలు బిచ్చమెత్తుకుని బ్రతకాల్సి వస్తుందని ఆంధ్రోళ్లు ఎద్దేవా చేశారని… కానీ నేడు ఏపీ సీఎం జగన్ కేంద్రం వద్ద బిచ్చమెత్తుకునే పరిస్థితి తలెత్తిందన్నారు ప్రశాంత్ రెడ్డి.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి నిధులు నిండుకోవడంతో కేంద్రం వద్ద చేతులెత్తి అడుక్కుంటోందని, అందుకే కేంద్రం ఏం చెప్పినా చేయడానికి జగన్ సిద్ధమయ్యారని ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ నడవాలంటే కేంద్రం ఇచ్చే నిధులు తప్పనిసరన్నారు. అందుకే ఏపీలో మోటార్లకు మీటర్లు బిగిస్తున్నారని ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. దేశమంతా విద్యుత్ మీటర్లను వ్యతిరేకిస్తుంటే జగన్ మాత్రం కేంద్రం చెప్పిందంతా వింటూ కీలుబొమ్మగా మారారని ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మంత్రి చేసిన వ్యాఖ్యలు ఏపీ మంత్రి పేర్నినానికి మంట పుట్టించాయి.

ఇదిలా వుంటే.. పేర్ని నాని కూడా తనదైన రీతిలో స్పందించారు. మంత్రి ప్రశాంత్‌ రెడ్డికి పేర్నినాని కౌంటరిచ్చారు. మాకు రావాల్సిన నిధుల కోసం బిచ్చమెత్తుకుంటున్నాం. మాటి మాటికి ఢిల్లీ వెళుతున్న కేసీఆర్‌ ఏం బిచ్చమెత్తుకోవడానికి వెళుతున్నారంటూ మండిపడ్డారు పేర్నినాని. తెలంగాణలో వరి కొనుగోళ్ళ రచ్చ జరుగుతుంటే… ఈ కొత్త గొడవేంటని రాజకీయ విశ్లేషకులు అవాక్కవుతున్నారు. విపక్షాలు మాత్రం కీలక విషయాలను పక్కదారి పట్టించేందుకే ఇలాంటి సిల్లీ విషయాలను తెరమీదకు తెస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు.

Exit mobile version