NTV Telugu Site icon

బహుముఖ ప్రజ్ఞాశాలి ఆదినారాయణ రావు

Penupatruni Adinarayana Rao

Penupatruni Adinarayana Rao

(ఆగస్టు 21న పి.ఆదినారాయణరావు జయంతి)

సంగీత దర్శకుడు, నిర్మాత ఆదినారాయణరావు తెలుగు చిత్రసీమలో తనదైన బాణీ పలికించారు. స్వరకల్పనలో వినసొంపైన రాగాలు కూర్చి జనం మదిని దోచారు. అభిరుచిగల నిర్మాతగా అనేక మరపురాని చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. ఆదినారాయణరావు నిర్మాత కాకపోయివుంటే మరింత మధురం తెలుగువారి సొంతం అయ్యేదని ఎందరో సంగీతప్రియులు అంటూ ఉంటారు. మాటలతోనే ఆరంభించి, పాటకు రాగం సమకూర్చడంలోనూ, పాటల్లోని పదాలను వీనులకు విందు చేసేలా విరచి, తన స్వరవిన్యాసాలతో అమృతం అద్దడంలోనూ ఆదినారాయణ రావు దిట్ట. ‘పిలువకురా…’ అంటూ గారాలు పోయి, ‘రాజశేఖరా…నీపై మోజు తీరలేదురా…’ అంటూ సరాగాలు పలికించిన అలాంటి ‘మధురమైన ప్రియభావనలు’ ఆదినారాయణరావుకే సొంతం అనిపిస్తాయి. ‘ఘనాఘనసుందరుని’ వేకువనే గుర్తు చేసుకొనేవారందరికీ ఆదినారాయణరావు స్వరవిన్యాసాలు సైతం ఆరాధనాభావం కలిగిస్తాయి. ఇక నిర్మాతగా ఆయన అభిరుచితో పలు విజయబావుటాలు తెలుగునాట రెపరెపలాడాయి. ఏది చేసినా అందులో తనదైన ముద్ర వేయడం ఆదినారాయణరావు అలవాటు.

పెనుపాత్రుని ఆదినారాయణరావు 1915 ఆగస్టు 21న కాకినాడలో జన్మించారు. బాల్యంలోనే ఆదినారాయణరావులోని కళాకారుడు పలు విన్యాసాలు చేశారు. నటించారు, హార్మోనియం వాయించారు, కథలు రాశారు, నాటకాలు వేశారు, సంగీతంలో ఆరితేరారు. ఎంతోమంది నటీనటులకు శిక్షణ ఇచ్చారు. ఇలా ఆదినారాయణరావు పేరు కాకినాడ చుట్టుపక్కల మారుమోగిపోతుండేది. అలా ఓ మిత్రుడు తన కూతురు అంజనమ్మను ఆదినారాయణరావు వద్ద చేర్పించి, నటనలో, సంగీతంలో శిక్షణ ఇమ్మన్మారు. ఆదినారాయణరావు ఎంతో శ్రద్ధతో ఆ అమ్మాయికి పాటలు పాడటం, ఏ సన్నివేశంలో ఎలా నటించాలో నేర్పిస్తూ వచ్చారు. ఆమెతో నాటకాలు వేయించారు. ఆమె నటన చూసి జనం చప్పట్లు కొట్టే స్థాయికి తీర్చిదిద్దారు. ఇంత చేసిన అయ్యవారిని మరచిపోలేక, ఆ అమ్మాయి ఆదినారాయణరావునే పెళ్ళాడుతానని పట్టుపట్టింది. చివరకు చేసేదేమీ లేక ఆ అమ్మాయి మాటకు సరేనని పెళ్ళాడారు. ఆ తరువాత ఆమెపేరును అంజలీదేవిగా మార్చి, తానే సినిమా రంగంలో అవకాశాలు కల్పించారు. ఆదినారాయణరావు, అంజలీదేవి దంపతులు పాటకు మాటై కలసిపోయినట్టుగా జీవనం సాగించారు. అంజలీదేవిని తాను కోరుకున్న తీరున మహానటిగా తీర్చిదిద్దారు ఆదినారాయణరావు.

తన భార్య నటించిన ‘గొల్లభామ’ చిత్రానికి స్వరకల్పన చేస్తూ ఇద్దరూ చిత్రసీమలో ప్రవేశించారు. సి.పుల్లయ్య తెరకెక్కించిన ‘గొల్లభామ’తో అంజలీదేవికి మంచి గుర్తింపు లభించింది. తరువాత ఆమె నటించిన ‘పల్లెటూరి పిల్ల’కు ఆదినారాయణరావు సంగీతంతో పాటు కథ కూడా సమకూర్చారు. ఈ చిత్రానికి మాటలు, పాటలు తాపీ ధర్మారావు రాయగా, “ధీర కంపన…” అంటూ సాగే పాటను ఆదినారాయణ రావు రచించారు. ఇక ఏయన్నార్, గోపాలకృష్ణతో కలసి ‘అశ్వినీ పిక్చర్స్’ సంస్థలో భాగస్వామిగానూ ఉన్నారు ఆదినారాయణరావు. ‘అశ్వినీ పిక్చర్స్’ పతాకంపై రూపొందిన ‘మాయలమారి’ జానపదం అంతగా ఆకట్టుకోలేకపోయింది. తరువాత అంజలీపిక్చర్స్ బ్యానర్ పై ఎల్.వి.ప్రసాద్ దర్శకత్వంలో ‘పరదేశి’ చిత్రం నిర్మించారు. ఆ సినిమాతోనే శివాజీగణేశన్ తొలిసారి కెమెరా ముందు నటించారు. అయితే ఆయన నటించిన తమిళ చిత్రం ‘పరాశక్తి’ ముందు విడుదలయింది. హిందీలో ఘనవిజయం సాధించిన ‘అనార్కలి’ని అదే పేరుతో రీమేక్ చేశారు. కొన్ని పాటల ట్యూన్స్ హిందీలో సి.రామచంద్ర సమకూర్చినవే అనుసరించినా, ‘రాజశేఖరా…నీపై మోజు తీరలేదురా…’ పాటను తనదైన బాణీల్లో పలికించి ఆకట్టుకున్నారు. ఆ తరువాత తానే సొంతగా కథ తయారు చేసి ‘సువర్ణ సుందరి’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా ఘనవిజయం సాధించింది. ఇదే చిత్రాన్ని హిందీలో రీమేక్ చేశారు. అందులో కూడా ఏయన్నార్, అంజలీదేవి జంటగా నటించారు. ఏయన్నార్ నటించిన ఏకైక హిందీ చిత్రంగా ‘సువర్ణసుందరి’ నిలచింది. ఈ చిత్రం ద్వారా ఆదినారాయణ రావు సంగీతానికి ఉత్తరాదిన సైతం ఎంతో గుర్తింపు లభించింది. తరువాత యన్టీఆర్, అంజలీదేవితో నిర్మించిన ‘స్వర్ణమంజరి’ అంతగా ఆకట్టుకోలేక పోయింది.

చిన్ని బ్రదర్స్ పేరుతో మరో నిర్మాణ సంస్థ నెలకొల్పి “సతీ సక్కుబాయి, అమ్మకోసం” వంటి చిత్రాలు నిర్మించారు ఆదినారాయణరావు. ‘అమ్మకోసం’ చిత్రంలో కృష్ణ, కృష్ణంరాజు హీరోలుగా నటించారు. ఈ సినిమాలో అందాలతార రేఖ తొలిసారి కథానాయికగా నటించడం విశేషం. మరోనాయికగా విజయనిర్మల నటించారు. మళ్ళీ అంజలీ పిక్చర్స్ పతాకంపై ‘భక్త తుకారాం’ నిర్మించారు. ఈ సినిమా మ్యూజికల్ హిట్ గా నిలవడమే కాదు, మంచి విజయం సాధించింది. తనను చిత్రసీమకు పరిచయంచేసిన ఆదినారాయణరావు, అంజలీదేవి దంపతులపై గౌరవంతో శివాజీ గణేశన్ ఇందులో ఛత్రపతి శివాజీ పాత్రలో కనిపించారు. ఏయన్నార్ తో తెరకెక్కించిన ‘మహాకవి క్షేత్రయ్య’ అంతగా ఆకట్టుకోలేక పోయింది. చివరగా ‘చండీప్రియ’ చిత్రం నిర్మించారు. ఇందులో శోభన్ బాబు, చిరంజీవి అన్నదమ్ములుగా నటించారు. ఈ సినిమాలో నాయిక జయప్రదతో చిరంజీవికి ‘ఓ ప్రియా… చండీ ప్రియా…’ అనే డ్యూయెట్ ప్లాన్ చేసి, నటునిగా చిరుకు మంచి గుర్తింపు సంపాదించి పెట్టింది ఆదినారాయణరావే!

ఆరంభంలో తన భార్య నాయికగా నటించిన కొన్ని చిత్రాలకు ఆదినారాయణ రావు సంగీతం సమకూర్చారు. ఆ తరువాత తాను నిర్మించిన చిత్రాలకే సంగీతం అందిస్తూ సాగారు. అయితే ‘అమ్మకోసం’ చిత్రంలో తాను అడగ్గానే నటించినందుకు కృష్ణ, విజయనిర్మల దంపతుల కోసం వారి సొంత చిత్రాలు “మోసగాళ్ళకు మోసగాడు, అల్లూరి సీతారామరాజు”కు స్వరకల్పన చేసి అలరించారు. ‘అల్లూరి సీతారామరాజు’లో “హ్యాపీ హ్యాపీ క్రిస్మస్…” అనే ఆంగ్ల గీతాన్ని ఆదినారాయణరావే రచించి, స్వరపరిచారు. ప్రముఖ సంగీత దర్శకులు టి.వి.రాజు, సత్యం ఆయన వద్ద అసోసియేట్స్ గా పనిచేశారు. తాము సంగీత దర్శకులుగా రాణిస్తున్న రోజుల్లోనూ పిలవగానే వచ్చి గురువు వద్ద సహాయకులుగా స్వరకల్పన చేశారు. కృష్ణంరాజు సైతం తన ‘భక్త కన్నప్ప’కు సంగీతం సమకూర్చమని ఆదినారాయణరావును కోరారు. కొన్ని పాటలకు ఆయనే ట్యూన్స్ కట్టినా, తరువాత తన అసోసియేట్ సత్యంతో మిగిలిన పాటలకు స్వరకల్పన చేయించి, నేపథ్య సంగీతం కూడా ఆయనతోనే బాణీలు కట్టించారు. అందువల్ల సత్యం పేరునే ఉంచమని చెప్పారు ఆదినారాయణరావు. 1991 ఆగస్టు 19న ఆయన కన్నుమూశారు. ఆయన స్వరకల్పనలో రూపొందిన అనేక పాటలు ఈ నాటికీ సంగీత ప్రియులను అలరిస్తూనే ఉన్నాయి. ఆయన నిర్మించిన చిత్రాలు ఇప్పటికీ సినీ అభిమానులను బుల్లితెరపై ఆకట్టుకుంటూనే ఉండడం విశేషం.