NTV Telugu Site icon

రివ్యూ: పెళ్ళి సందD

1996లో వచ్చిన సక్సెస్ ఫుల్ మూవీ ‘పెళ్ళిసందడి’. శ్రీకాంత్, రవళి, దీప్తి భట్నాగర్ హీరోహీరోయిన్లుగా దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఆ సినిమా అప్పట్లో పెద్ద మ్యూజికల్ హిట్. పాతికేళ్ళ తర్వాత అదే పేరుతో రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపుదిద్దుకుంది ‘పెళ్ళి సందD’. ఇందులో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరో కాగా కన్నడ భామ శ్రీలీల హీరోయిన్ గా నటించింది. గౌరీ రోణంకి దర్శకత్వం వహించిన ‘పెళ్ళి సందD’ శుక్రవారం దసరా కానుకగా విడుదలైంది.

వశిష్ట (రోషన్ / రాఘవేంద్రరావు) అనే బాస్కెట్ బాల్ ప్లేయర్ కథ ఇది. తన ఫ్రెండ్ పెళ్ళిలో సహస్ర (శ్రీలీల / దీప్తీ భట్నాగర్) ను చూసి ప్రేమలో పడతాడు. ఆమె కూడా అతన్ని తొలి చూపులోనే ప్రేమిస్తుంది. అయితే ఈ సినిమా టైటిల్ లో ఉన్న చివరి అక్షరం ‘D’ అంటే డెస్టినీ! అది వీరి జీవితంతో ఆటాడుకుంటుంది. రెండు సార్లు తనకు చేరువైనట్టే అయ్యి చేజారి పోయిన సహస్రను మూడోసారి వశిష్ట ఎక్కడ, ఎలా కలుసుకున్నాడు? ఆ తర్వాత ఆమెను ఎలా తన దానిని చేసుకున్నాడు? అసలు సహస్ర ఉన్నట్టుండి అదృశ్యమవడానికి కారణం ఏమిటనేదే మిగతా కథ.

ఈ సినిమా కథంతా ఫ్లాష్ బ్యాక్ లో సాగుతుంది. బాస్కెట్ బాల్ ప్లేయర్ వశిష్ట బయోపిక్ తీయడానికి సిద్ధపడిన ఓ అమ్మాయి… వశిష్టతో మాట్లాడి, అందుకు ఒప్పించమని తన తండ్రిని కోరుతుంది. దాంతో వశిష్టను కలిసి అతని గతం గురించి, యుక్తవయసులోని ప్రేమను గురించి అడిగి తెలుసుకుంటాడు. ఈ సినిమా కథకు గతంలో వచ్చిన ‘పెళ్ళిసందడి’కీ ఏం సంబంధం లేదు. ఈ రెండు సినిమాలలో కామన్ పాయింట్ ఏదైనా ఉందంటే అది ప్రేమ, పెళ్ళి మాత్రమే. ఎదిగిన అమ్మాయి మనసెరిగి పెళ్ళి చేయాలనే ఓ సందేశంతో పాటు, కనిపెంచిన కొడుకు భావాలకూ విలువ ఇవ్వాలనే మాటనూ దర్శకురాలు గౌరీ రోణంకి చెప్పే ప్రయత్నం చేశారు. కానీ సినిమా ప్రారంభం నుండి చివరి వరకూ సాగే కాకిగోలలో అసలైన ఆ సందేశం ఎవరి చెవినా పడే ఆస్కారం లేకపోయింది. ఇందులో పెళ్ళిళ్ళలో చూపించే అతి గౌరవం (రఘుబాబు), లేని డాంబికాలను ప్రదర్శించడం (పోసాని) వంటి అంశాలు కొంతలో కొంత నవ్వు తెప్పిస్తాయి. కానీ అవి సినిమాను నిలబెట్టలేవు. బలమైన కథ ఏదీ లేకుండా, సన్నివేశాలతో సినిమాను నడిపేయాలనుకోవడం ఇవాళ సాధ్యం కాదు. పోనీ ఆ సన్నివేశాలైనా కొత్తదనంతో ఉన్నాయా అంటే అదీ లేదు. ఎప్పుడో ఎనభైలలో వచ్చిన సినిమాల్లోని సీన్స్ నే రిపీట్ చేసినట్టుగా ఉంది.

నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమా ద్వారా కొత్తగా రోషన్ కు ఒరిగిందేమీ లేదు. టెండర్ ఏజ్ లో ‘నిర్మలా కన్వెంట్’లో ఎలా ఉన్నాడో, ఇప్పుడూ అలానే ఉన్నాడు. కాకపోతే నటనలో, డాన్స్ లో, ఫైట్స్ లో కాస్తంత ఈజ్ కనిపించింది. నిజానికి అతనికంటే కూడా ఈ సినిమాలో హైలైట్ అయిన పాత్ర హీరోయిన్ శ్రీ లీలదే. ఇప్పటికే రెండు మూడు కన్నడ సినిమాల్లో నటించిన శ్రీలీల కు ఇది తొలి తెలుగు సినిమా. డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రను చేసింది. కానీ రోషన్, శ్రీలీలా ఈడూ జోడుగా అనిపించలేదు. ఇక దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఇందులో నటించడం మరో విశేషం. ఇప్పటికే టీవీ ప్రోగ్రామ్స్ ద్వారా జనాలకు దగ్గరైన రాఘవేంద్రరావు తన వయసుకు తగ్గ పాత్రనే ఇందులో చేశారు. కానీ చివరలో ఆయన, ఆయన కొడుకుగా రోషన్ నడిచి వస్తుంటే తాతామనవళ్ళు లాగా అనిపించారు. ఇక దీప్తి భట్నాగర్ పెద్ద సహస్రగా నటించింది. జీవిత, రాజశేఖర్ కుమార్తె శివానీ గెస్ట్ అప్పీయరెన్స్ ఇచ్చింది. ఇతర ప్రధాన పాత్రలను రాజేంద్ర ప్రసాద్, ప్రకాశ్ రాజ్, రావు రమేశ్, ఝాన్సీ, భరణి, ప్రగతి, అన్నపూర్ణ, వితికా సేరు, వెన్నెల కిశోర్, సత్యం రాజేశ్, షకలక శంకర్, కిరీటీ దామరాజు, శ్రీనివాసరెడ్డి… ఇలా చాలా మందే పోషించారు. కానీ ఏ ఒక్క పాత్రకూడా ఆకట్టుకునేలా లేదు. రెండున్నర గంటల పాటు తెర మీద గందరగోళాన్ని సృష్టించడానికే వీళ్ళంతా పనికొచ్చారు.

సాంకేతిక నిపుణులలో చెప్పుకోవాల్సిన వ్యక్తి ఎం. ఎం. కీరవాణి. రెండు, మూడు పాటలు వినడానికి, చూడటానికి బాగున్నాయి. బలహీనమైన సన్నివేశాలను కూడా తన నేపథ్య సంగీతంతో కాస్తంత లేపే ప్రయత్నం చేశారు. అలానే సునీల్ కుమార్ సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. దర్శకురాలు గౌరీ రోణంకి టేకింగ్ లోనూ కొంత రాఘవేంద్రరావు మార్క్ కనిపించింది. ఆయన దర్శకత్వ పర్యవేక్షకుడు కావడం కూడా దానికో కారణం కావచ్చు. ఆర్కే ఫిలిమ్ అసోసియేట్స్, ఆర్కా మీడియా సంస్థలు నిర్మాణం విషయంలో రాజీ పడలేదు. కానీ కథ, కథనాల మీద శ్రద్ధపెట్టి ఉంటే బాగుండేది. సక్సెస్ ఫుల్ మూవీ ‘పెళ్ళిసందడి’ పేరును దీనికీ పెట్టి, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోబోయారనే అపవాద రాకుండా ఉండేది!

ప్లస్ పాయింట్
కీరవాణి నేపథ్య సంగీతం
సునీల్ సినిమాటోగ్రఫీ
పోరాట సన్నివేశాల

మైనెస్ పాయింట్స్
కొత్తదనం లేని కథ
ఫ్లాట్ గా సాగే కథనం
ఆకట్టుకోని సన్నివేశాలు
కె. రాఘవేంద్రరావు నటించడం

రేటింగ్: 2 / 5

ట్యాగ్ లైన్: సందడి మిస్సింగ్!

Show comments