జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు అనంతపురం జిల్లాలోని నల్ల చెరువులో శ్రమదానం కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. పదవులు ఆశించి రాజకీయాల్లోకి రాలేదని, కష్టాల్లో ఉన్న వాళ్ళను ఆదుకోవడానికి వచ్చానని అన్నారు. తనకు ఎన్ని కష్టాలు వచ్చినా రాజకీయాల్లోనే ఉంటానని అన్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని అన్నారు. వైసీపీ నాయకులు తనకు శతృవులు కాదని, అద్భతమైన పాలన ఇచ్చి ఉంటే ఇలా రోడ్డు మీదకు వచ్చేవాడిని కాదని అన్నారు. పాలన బాగాలేదని, రోడ్లు అధ్వాన్నంగా తయారైయ్యాయని అన్నారు. పోలీసులకు కూడా డైలీ అలవెన్స్ ఇవ్వడం లేదని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏ కులానికి తాను వ్యతిరేకిని కాదని, ప్రత్యేక కారణాల వల్ల మాట్లాడాల్సి వస్తోందని అన్నారు. రాయలసీమలో యువత ఉద్యోగం, చదువుల కోసం బయట ప్రాంతాలకు వెళ్లకుండా చేస్తానని అన్నారు. పుట్టపర్తి సాయిబాబా మంచినీటి పథకం పెట్టి గ్రామాలకు నీటి సరఫరా చేశారని, ప్రభుత్వాలు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. జిల్లాలో ఉన్న ఒక్క కియా పరిశ్రమను కూడా భయపెడుతున్నారని, రాయలసీమకు పరిశ్రమలు తెప్పిస్తానని, అభివృద్ధి చేసి చూపిస్తానని పవన్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని అందరూ ఆనందంగా ఉండాలని, నాయకుడు నిజాయితీగా ఉంటే రాష్ట్రం అభివృద్ధి చేయవచ్చని అన్నారు.
Read: లైవ్: అనంతపురం జిల్లాలో పవన్ సభ