(జూన్ 12తో ‘పాలు – నీళ్ళు’కు 40 ఏళ్ళు)
తెలుగు చిత్రసీమలో ‘గురువుగారు’ అనగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చే పేరు ‘దర్శకరత్న’ దాసరి నారాయణరావుదే! చిత్రసీమకు దాసరి చిత్రాల ద్వారా పరిచయమైన వారూ, వారి ద్వారా సినిమా రంగంలో రాణించిన వారు – ఇలా దాసరికి ఎంతోమంది శిష్యప్రశిష్యులు ఉన్నారు. వారిలో విలక్షణ నటుడు మోహన్ బాబు స్థానం ప్రత్యేకమైనది. దాసరి తెరకెక్కించిన అనేక చిత్రాలలో వైవిధ్యమైన పాత్రలు పోషించిన మోహన్ బాబును హీరోగా నిలపాలని దాసరి తపించారు. ‘కేటుగాడు’ చిత్రంతో మోహన్ బాబును సోలో హీరోని చేశారు. ఆ తరువాత మోహన్ బాబును మహిళాప్రేక్షకులకు సైతం దగ్గర చేయడానికి అన్నట్టు దాసరి తెరకెక్కించిన చిత్రం ‘పాలు – నీళ్ళు’. ఆ రోజుల్లో టాప్ హీరోయిన్ గా సాగుతోన్న జయప్రద ఇందులో నాయిక. మోహన్ బాబు, జయప్రద జంటగా రూపొందిన ‘పాలు-నీళ్ళు’ చిత్రం 1981 జూన్ 12న విడుదలయింది. మంచి విజయం సాధించింది. దాసరి కోరుకున్నట్టుగానే మోహన్ బాబు కేవలం మాస్ మసాలా రోల్స్ లోనే కాదు, కుటుంబకథా చిత్రాలలోనూ రాణించగలరని నిరూపించారు.
భార్యాభర్తల బంధం…
‘పాలు-నీళ్ళు’ కథ విషయానికి వస్తే- లలితారాణి ధనవంతుల అమ్మాయి. అయితే కన్నవారు లేకపోవడంతో, అయినవాళ్ళు ఆస్తి కోసం ఆమెను హతమార్చాలనుకుంటారు. ఆమెను గంగరాజు కాపాడతాడు. అతని మంచితనం చూసి, గంగరాజును పెళ్ళాడుతుంది. వారికి ఓ బాబు పుడతాడు. ఆనందంగా సాగుతున్న వారి కాపురంలో తన భార్య లలితకు నాట్యంలో మంచి ప్రవేశముందని తెలిసి, ఆమెను ప్రోత్సహిస్తాడు గంగరాజు. అయితే లలితారాణికి పేరుప్రఖ్యాతులు వచ్చి, ఆమె సినిమా స్టార్ కాగానే పొరపొచ్చాలు తలెత్తుతాయి. భార్యను విడిచి, తన కొడుకును తీసుకొని గంగరాజు వెళతాడు. అతణ్ణి వెదుక్కుంటూ వెళ్ళిన లలితకు, వేరే ఆవిడ అతనింటిలో కనిపించి, వెళ్ళిపొమ్మంటుంది. కొడుకును అల్లారు ముద్దుగా పెంచుకుంటాడు గంగరాజు. ఓ సారి లలితారాణి నటించే ఓ సినిమాలో బాబు వేషానికి ఓ అబ్బాయి కావలసి వస్తాడు. అప్పుడు గంగరాజు కొడుకును తీసుకువెళతారు. అనుకోకుండా ఆ బాబు తన బిడ్డ అని లలితకు తెలుస్తుంది. బాబు లేకుండా ఉండలేనని అంటుంది. బాబు కూడా అమ్మకు దగ్గరవుతాడు. దాంతో తన బిడ్డను తనకు ఇప్పించమని కోర్టుకు వెళతాడు గంగరాజు. కానీ, అక్కడ రావ్ అనే న్యాయవాది లలితారాణి పక్షం వాదిస్తారు. ఇక న్యాయమూర్తి బాబును ఎవరి దగ్గర ఉంటావని అడుగుతారు. ఆ బాబు, తల్లిదండ్రుల వద్ద కాకుండా, తన నాన్న పనిచేసే దంపతుల దగ్గరకు వెళతాడు. అమ్మ దగ్గర నాన్న ఉండడు, నాన్న దగ్గర అమ్మ ఉండదు కాబట్టి, తాను విడిపోకుండా ఉండే వీరిదగ్గరే ఉంటానంటాడు. రావ్ ‘భార్యాభర్తల బంధం పాలునీళ్ళ కలయిక లాంటిదని’ చెబుతారు. రావ్ వాదనతో న్యాయమూర్తి కూడా ఏకీభవిస్తారు. వారి వాదనకు లలిత, గంగరాజు విలువనిచ్చి బాబు కోసం మళ్ళీ కలసి ఉండటానికి అంగీకరించడంతో కథ ముగుస్తుంది.
సక్సెస్ రూటులో సాగిన చిత్రం
కోర్టు సీన్ లో లాయర్ రావ్ గా దాసరి నారాయణరావు, లాయర్ రెడ్డిగా ప్రభాకర్ రెడ్డి నటించారు. దాదాపు 25 నిమిషాలు ఏకధాటిగా సాగే కోర్టు సీన్ రక్తి కట్టింది. దాంతో సినిమాను మహిళా ప్రేక్షకులు విశేషంగా ఆదరించారు. మోహన్ బాబు హీరోగా రూపొందిన చిత్రాలలో ‘పాలు-నీళ్ళు’ ఓ హిట్ గా నిలచింది.
ఆశా భోస్లే తొలి తెలుగు పాట!
ఈ చిత్రానికి వేటూరి, దాసరి పాటలు రాయగా, సత్యం సంగీతం సమకూర్చారు. ప్రఖ్యాత హిందీగాయని ఆశా భోస్లే ఈ సినిమాతోనే తెలుగు చిత్రసీమకు పరిచయం కావడం విశేషం. ఆశా భోస్లే నోట పలికిన తొలి తెలుగు పాట “ఇది మౌనగీతం… ఒక మూగరాగం…” అంటూ సాగుతుంది. ‘తెలుగు చిత్ర ఇంటర్నేషనల్’ పతాకంపై తెరకెక్కిన ‘పాలు-నీళ్ళు’ చిత్రంలో చలం, రమాప్రభ, సూర్యకాంతం, నిర్మలమ్మ, సరోజ, బేబీ సరస్వతి, రావి కొండలరావు ముఖ్యపాత్రధారులు. రామినేని సాంబశివరావు ఈ చిత్రానికి నిర్మాత. కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం దాసరి నారాయణరావు.