NTV Telugu Site icon

సమయానికి సినిమా వేయలేదని.. రూ.1.10 లక్షలు జరిమానా

హైదరాబాద్: కాచిగూడ ఐనాక్స్‌కు జిల్లా వినియోగదారుల కమిషన్ షాక్ ఇచ్చింది. సమయానికి సినిమా వేయలేదని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన కమిషన్ ఐనాక్స్‌ యాజమాన్యానికి రూ.10వేలు జరిమానా విధించింది. అంతేకాకుండా లైసెన్స్ అథారిటీ కింద మరో రూ.లక్ష ఫైన్ కట్టాలని ఆదేశాలు జారీ చేసింది. వివరాల్లోకి వెళ్తే.. 2019, జూన్ 22న తార్నాకకు చెందిన విజయగోపాల్ అనే వ్యక్తి ‘గేమ్ ఓవర్’ అనే సినిమాను వీక్షించేందుకు కాచిగూడలోని ఐనాక్స్‌కు వెళ్లాడు. అయితే సినిమా టిక్కెట్‌పై ఉన్న సమయం ప్రకారం సినిమా సాయంత్రం 4:30 గంటలకు ప్రదర్శించాలి. కానీ ఐనాక్స్ యాజమాన్యం ప్రకటనలు వేసి సా.4:45 గంటలకు సినిమాను ప్రదర్శించింది.

Read Also: రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

దీంతో ఐనాక్స్ యాజమాన్యంపై ప్రేక్షకుడు విజయగోపాల్ అసహనం వ్యక్తం చేశాడు. సుమారు 15 నిమిషాలు విలువైన సమయాన్ని వృథా చేశారని థియేటర్‌ మేనేజర్‌కు ఫిర్యాదు చేశాడు. స్పందన లేకపోవడంతో చివరకు హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించాడు. అయితే తెలంగాణ సినిమాస్ రెగ్యులేషన్ చట్టం 1955 ప్రకారం తాము ప్రకటనలు వేసినట్లు ఐనాక్స్ యాజమాన్యం వివరణ ఇచ్చింది. ఈ పిటిషన్‌పై విచారించిన జిల్లా వినియోగదారుల ఫోరం బెంచ్.. నిబంధనల ప్రకారం 5 నిమిషాలు మాత్రమే ప్రకటనలు వేయాలని.. 15 నిమిషాలు వాణిజ్య ప్రకటనలు వేయడం నిబంధనలకు విరుద్ధమని తీర్పు ఇచ్చింది. దీంతో నష్టపరిహారంగా ఫిర్యాదు చేసిన వ్యక్తికి రూ.5 వేలు, కేసుల ఖర్చుల కింద మరో రూ.5వేలు చెల్లించాలని ఐనాక్స్‌ను ఆదేశించింది. మరోవైపు లైసెన్సింగ్ అథారిటీ కింద హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు పెనాల్టీ కింద మరో రూ.లక్ష చెల్లించాలని.. ఈ డబ్బును థియేటర్లలో భద్రతకు విపత్తు నిధిగా వాడాలని హితవు పలికింది.