NTV Telugu Site icon

అలసత్వం వీడి ఒమిక్రాన్‌కు చెక్‌ పెట్టాలి!

ఒమిక్రాన్‌..ప్రపంచాన్ని ఠారెత్తిస్తున్న కోవిడ్‌ కొత్త వేరియంట్‌. ఇటీవల దక్షిణాఫ్రికాలో వెలుగు చూసింది. ఇది అనేక దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. డెల్టా కన్నా ఐదారు రెట్లు వేగంగా వ్యాపిస్తుందంటున్నారు నిపుణులు. ఇప్పటికి పదిహేను దేశాలలో వీటి ఉనికిని గుర్తించారు. ఈ నేపథ్యంలో అనేక ప్రపంచ దేశాలు తమ దేశ సరిహద్దులను మూసివేశాయి. అన్ని మార్గాలలో దక్షిణాఫ్రికా నుంచి రాకపోకలను నిషేధించాయి. మన దేశం కూడా తగిన ముందస్తు చర్యలకు ఉపక్రమించింది.

ఇప్పటి వరకు మన దేశంలో ఒమిక్రాన్ కేసు ఒక్కటి కూడా నమోదు కాలేదు. అనుమానాస్పద కేసులను పరీక్షిస్తున్నారు. పాజిటివ్ వస్తే జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపుతున్నారు. ఒమిక్రాన్‌ పరిస్థితులపై కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ రాజ్యసభలో చేసిన ప్రకటనలో ఈ విషయం వెల్లడించారు.

మరోవైపు, మహారాష్ట్ర, కర్నాటకలోకి ఒమిక్రాన్‌ ప్రవేశించిందనే వార్తలు కలకలం రేపుతున్నాయి. మూడు రోజుల క్రితం మహారాష్ట్రలో దక్షిణాఫ్రికా నుండి థానేకి తిరిగి వచ్చిన యువ ఇంజనీర్‌కి చేసిన కోవిడ్‌ పరీక్షల్లో కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఒమిక్రాన్‌ నేపథ్యంలో అతడి పాజిటివ్‌ నమూనా జీనోమ్‌ సీక్వెన్స్‌ తెలుసుకునేందుకు ల్యాబ్‌కు పంపారు. ఫలితాల కోసం మరికొన్ని రోజులు వేచి చూడాల్సి వుంది. దక్షిణాఫ్రికాతో పాటు రిస్క్‌ దేశాల నుంచి వచ్చిన మరో ఐదుగురికి పాజిటివ్‌ అని తేలింది. వారి నమానాలు కూడా పరీక్షలకు వెళ్లాయి.

మరోవైపు, దక్షిణాఫ్రికా నుంచి బెంగళూరు వచ్చిన ఇద్దరిలో ఒకరి నమూనా డెల్టా వేరియంట్‌కు భిన్నంగా ఉందని తేలింది. ఐతే, అది ఒమిక్రానా కాదా అనేది పరీక్షల్లో తేలాల్సి వుంది. గత తొమ్మిది నెలలుగా కర్నాటకలో డెల్టా వేరియంట్ మాత్రమే ఉనికిలో ఉంది. అందుకే ఈ భయాలు.

కొత్త వేరియంట్‌పై ప్రపంచ పరిణామాలు ఆధారంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేస్తోంది అంతర్జాతీయ ప్రయాణికుల కోసం కొత్త నిబంధనలను విడుదల చేసింది. ఒమిక్రాన్‌ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో ప్రజారోగ్య సంసిద్ధతను సమీక్షించడానికి జరిగిన ఉన్నత స్థాయి సమావేశం తరువాత ప్రభుత్వం వీటిని ప్రకటించింది.

రిస్క్‌ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కోవిడ్ పరీక్షలు తప్పనిసరి. ఫలితాలు వచ్చే వరకు వారు ఏర్‌పోర్ట్‌ లోనే ఉండాల్సి వుంటుంది. నెగెటివ్ అని తేలితే వారు ఏడు రోజుల హోమ్ క్వారంటైన్‌లో ఉంటారు. ఎనిమిదవ నాడు తిరిగి టెస్ట్ చేస్తారు. హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నప్పుడు రాష్ట్ర అధికారులు వారి ఇళ్లను భౌతికంగా సందర్శిస్తారు.

పాజిటివ్‌ వచ్చిన ప్రయాణికులను వేరుచేసి చికిత్స చేస్తారు . వారి నమూనాలను తక్షణం ల్యాబ్‌కు పంపుతారు. వీరు ఎవరెరవరిని కలిశారో రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి 14 రోజులు వారిని పరిశీలనలో పెడతారు. రిస్క్‌ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు తమ ఫలితాలు వెలువడే వరకు విమానాశ్రయాల వద్ద వేచి ఉండటానికి సిద్ధం కావాలని సలహా ఇస్తున్నారు. ప్రస్తుతం రిస్క్‌ దేశాల జాబితాలో బ్రిటన్ తో పాటు ఐరోపాలోని మొత్తం 44 దేశాలు, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, బంగ్లాదేశ్, బోట్స్వానా, చైనా, మారిషస్, న్యూజిలాండ్, జింబాబ్వే, సింగపూర్, హాంకాంగ్ ఇజ్రాయెల్ ఉన్నాయి.

విమానాశ్రయాలు, ఓడరేవులు, సరిహద్దు క్రాసింగ్‌ల ద్వారా దేశానికి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులపై కఠినమైన నిఘా ఉంచాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. టెస్ట్, ట్రాక్, ట్రీట్, టీకా వ్యూహం మళ్లీ కఠినంగా అమలుచేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు కోవిడ్‌ని గుర్తించడానికి ఉపయోగించిన ఆర్టీ-పీసీఆర్‌, ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షల నుండి ఒమిక్రాన్‌ వేరియంట్ తప్పించుకోలేక పోతున్నందున పరీక్షలను వేగవంతం చేయాలని రాష్ట్రాలకు సూచించింది. టెస్టింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను బలోపేతం చేయడం, టెస్టింగ్ మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు చేయడం, అలాగే ఎక్కువ ఆర్టీ-పీసీఆర్‌ పరీక్షలు జరపాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది.

ఇటీవలి పాజిటివ్ కేసులు వెలుగు చూసిన ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షించాల్సి వుంటుంది. అలాగే అన్ని పాజిటివ్‌ శాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం వెంటనే ఇన్సాకాగ్‌ (INSACOG) నెట్‌వర్క్‌కు పంపాలి. గ్రామీణ ప్రాంతాలు, పీడియాట్రిక్ కేసులపై దృష్టి సారించి ఐసీయూ, ఆక్సిజన్ బెడ్‌లు, వెంటిలేటర్లు మొదలైన వాటిని అందుబాటులో ఉంచటంతో పాటు ఆరోగ్య మౌలిక సదుపాయాలను సిద్ధం చేయాలని సూచించించింది. సెకండ్‌ వేవ్‌ వచ్చినపుడు ఆరోగ్య సౌకర్యాల కొరత గురించి తెలిసింది. ఇప్పుడు అది రిపీట్‌ కాకుండా ఉండేందుకు ప్రభుత్వం ముందు అన్నీ సిద్ధం చేయాల్సి వుంది.

ప్రభుత్వాల అలసత్వం సెకండ్ వేవ్‌ బీభత్సానికి కారణమైంది. లక్షలాది మందిని పొట్టన పెట్టుకుంది. కళ్ల ముందే పీడకలను మిగిల్చిపోయింది. వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అనేక మంది కుటుంబ పెద్దదిక్కును కోల్పోయారు. ఇప్పుడు ఒమిక్రాన్‌ వేరియంట్‌తో మళ్లీ వణికిపోతున్నారు. ఎప్పుడూ ఎటు నుంచి ఏ రూపంలో వచ్చి పడుతుందోనని ఆందోళన చెందుతున్నారు.

కొద్ది రోజులుగా కేసుల సంఖ్య బాగా తగ్గింది. దాంతో వైరస్‌ పీడ తొలగిందనుకున్నారు. అందుకే ముఖానికి మాస్కులు కూడా వేసుకోవట్లేదు. కానీ మరొకసారి మాస్కులు, శానిటైజర్లు ఉపయోగించాల్సిన సమయ వచ్చింది. డెల్టాను మించిన ఒమిక్రాన్‌ను ఎదుర్కోవాలంటే టీకాలతో పాటు జాగ్రత్తలు కూడా చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే మన ఒంట్లో ఉన్న యాంటిబాడీస్‌ ఈ వైరస్‌ను సమర్థంగా ఎదుర్కొంటాయా? లేదా అనేది కూడా ఇంకా తేలలేదు. ఇందుకు ఇంకా సమయం పడుతుంది. అందువల్ల ఇప్పుడు జాగ్రత్తగా ఉండటమే శరణ్యం.

ఒమిక్రాన్‌ అనేక మ్యుటేషన్ల కలయిక. డెల్టా వేరియంట్‌ కంటే అత్యంత ప్రమాదకారి అంటున్నారు. ఐతే, ప్రమాద తీవ్రత ఎంత అనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించే వరకు అన్నిటిని ఓ హెచ్చరికలుగా తీసుకోవాలి. ఇప్పటికైతే ఒమిక్రాన్‌ వ్యాప్తి వేగం, దాని వల్ల కలిగే తీవ్ర అనారోగ్య లక్షణాలపై పరిశోధనాత్మకంగా నిర్ధారణ కాలేదు. ఐతే, గతంలో మనకు గల చేదు అనుభవాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఈసారి ముందుగా మేల్కొంటే మంచింది.

ప్రభుత్వం ఆలస్యంగా నిర్ణయాలు తీసుకుని …వాటిని ఉన్నట్టుండి ప్రజల మీద రుద్దితే పరిణామాలు ఎలా ఉంటాయో ఫస్ట్‌ వేవ్‌ లాక్‌డౌన్‌లో చూశాము. పొట్ట కూటికోసం నగరాల బాట పట్టిన వేలాది కుటుంబాలు చంటి పిల్లలతో వందల కిలోమీటర్లకు కాలి నడకన వెళ్లిన దృశ్యాలు ఇంకా మన కళ్లముందు కదలాడుతున్నాయి. సెకండ్‌ వేవ్‌ సమయంలో ఆక్సిజన్‌ కొరతతో కళ్లముందే అయినవారి ఊపిరి ఆగిపోయిన విషాదాలను ఇంకా మర్చిపోలేదు. కాబట్టి ఇప్పుడైనా మెడీ సర్కార్‌ ముందుగా మేల్కొని ..మహమ్మారిని ఎదుర్కొనేందుకు తాను యుద్ధ ప్రాతిపదికన ముందస్తు ఏర్పాట్లు చేయటంతో పాటు రాష్ట్రాలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి ఒమిక్రాన్‌కు చెక్‌ పెట్టాలి!!

-Dr. Ramesh Babu Bhonagiri