కరోనాను కట్టడి చేయడానికి వ్యాక్సీన్లు వచ్చేశాయి… ఇక మనం భయపడాల్సిన పనిలేదు అనుకున్నారంతా. కానీ… కరోనా వైరస్ తన రూపాన్ని మార్చుకుంది. ఒమిక్రాన్‌గా విజృంభిస్తోంది. రెండు డోసుల వ్యాక్సీన్ తీసుకున్న వాళ్లను సైతం ఈ ఒమిక్రాన్ వేరియంట్ వదలడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా 59 దేశాలకు కరోనా ఒమిక్రాన్ వేరియంట్ విస్తరించింది. ఆయా దేశాల్లో 2 వేల 936 మందికి ఒమిక్రాన్ సోకినట్టు ఇప్పటి వరకూ స్పష్టమైంది. అలాగే, కరోనా సోకినట్టు నిర్ధారణైన 78 వేల మందిలో ఎంత మందికి ఒమిక్రాన్ వేరియంట్ సోకిందన్నది జినోమ్ సీక్వెన్సింగ్ పూర్తయితే తప్ప చెప్పలేని పరిస్థితి నెలకొంది.
ఒమిక్రాన్ వేరియంట్‌ను ముందుగా సౌతాఫ్రికాలో గుర్తించారు. అక్కడ నవంబర్ 23న తొలి ఒమిక్రాన్ వేరియంట్ కేసు నమోదయ్యింది. ఇప్పుడు సౌతాఫ్రికా కరోనా బాధితుల్లో 75 శాతం మంది ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వాళ్లే ఉన్నారు. బాధితుల సంఖ్య రెండున్నర రోజుల్లో రెట్టింపవుతోంది. యూరప్ దేశాల్లో కూడా ఒమిక్రాన్ భయం వెంటాడుతోంది. ఇంత వరకూ యురోపియన్ యూనియన్‌లోని 19 దేశాల్లో 274 మంది ఒమిక్రాన్ వేరియంట్ బారినపడ్డారు. బ్రిటన్‌ను ఒమిక్రాన్ వేరియంట్ వణికిస్తోంది. అక్కడ తాజాగా 249 కొత్త కేసులు వెలుగు చూశాయి. దీంతో ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 817కు చేరింది.
కరోనా వ్యాక్సీన్ రెండు డోసులు తీసుకున్న వాళ్లను సైతం ఒమిక్రాన్ వేరియంట్ వదలడం లేదు. ఒమిక్రాన్ బారినపడ్డ వల్లలో స్వల్ప లక్షణాలే కనిపిస్తున్నాయి. అలాగని దీనిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ కరోనా ఆంక్షల్ని కఠినంగా అమలు చేస్తున్నారు.
