Site icon NTV Telugu

నటనలో ఓ గిరి … ఓం పురి!

అనేక విలక్షణమైన పాత్రల్లో తనదైన బాణీ పలికించారు నటుడు ఓం పురి. ప్రతిభావంతులను తీర్చిదిద్దే ‘నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా’ నుండి వచ్చిన ఓం పురి తొలి నుంచీ తనదైన అభినయంతో ఆకట్టుకుంటూనే సాగారు. హిందీ, తెలుగు, తమిళ భాషా చిత్రాలతో పాటు మరికొన్ని భారతీయ భాషల్లోనూ నటించారు. ఇంగ్లిష్ లోనూ అభినయించారు. పాకిస్థాన్ సినిమాల్లోనూ ఓం పురి నటన ఆకట్టుకుంది. అంతర్జాతీయ నటునిగా పేరొందిన ఓం పురి అభినయం ఎంతోమంది అభిమానులను ఆకట్టుకుంది.

ఓం ప్రకాశ్ పురి 1950 అక్టోబర్ 18న పంజాబ్ లోని అంబాలాలో జన్మించారు. చిన్న తనం నుంచీ ఇతరులను ఇట్టే ఆకట్టుకొనే గుణం ఓం పురిలో ఉండేది. తరువాతి రోజుల్లో నాటకాలు వేస్తూ సాగారు. ముఖంపై వచ్చిన మచ్చల వల్ల బిడియపడ్డా, తరువాత దానిని అధిగమిస్తూ నటనలో వైవిధ్యం చూపించారు ఓం పురి. ‘ఫిలిమ్ అండ్ టెలివిజన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా’లో చేరి నటనలో మెలకువలు నేర్చుకున్నారు. తరువాత ‘నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా’లో చేరిన తరువాత మరింతగా రాటు దేలారు పురి. అక్కడ నుండి వచ్చాక ముంబై చేరి సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలెట్టారు. తనకు లభించిన చిన్న, చితక పాత్రల్లోనూ నటించేశారు. ‘శోధ్’ హారర్ సినిమా ఓం పురికి నటునిగా మంచి పేరు సంపాదించి పెట్టింది. అంతకు ముందు శ్యామ్ బెనెగల్ రూపొందించిన ‘భూమిక’ చిత్రంలో ‘ఈవిల్ కింగ్’ అనే రంగస్థల నటునిగా నటించారు. శ్యామ్ బెనెగల్ తెరకెక్కించిన “కల్ యుగ్, ఆరోహణ్, మండీ” చిత్రాలలో కనిపించారు ఓం పురి. గోవింద్ నిహలానీ తెరకెక్కించిన తొలి చిత్రం ‘ఆక్రోష్’లోనూ, తరువాత రూపొందించిన ‘అర్ధ్ సత్య’లోనూ ఓం పురి అభినయం అందరినీ ఆకట్టుకుంది. “అగాథ్, ద్రోహ్ కాల్, న్యూ ఢిల్లీ టైమ్స్, ఘాయల్, దేవ్” వంటి చిత్రాలలోనూ ఓం పురి నటన అలరించింది.

తెలుగులో రామ్ గోపాల్ వర్మ రూపొందించిన ‘రాత్రి’లో షార్జీ పాత్రలో భూతాలను వదిలించేవాడిగా నటించారు. ఇక ఉమామహేశ్వరరావు తెరకెక్కించిన ‘అంకురం’లోనూ సత్యం అనే ప్రధాన భూమిక ధరించారు. శ్యామ్ బెనెగల్ ‘ఆరోహణ్’తో తొలిసారి జాతీయ స్థాయిలో ఉత్తమ నటునిగా నిలిచారు ఓం పురి. గోవింద్ నిహలానీ ‘అర్ధ్‌ సత్య’తో రెండోసారి నేషనల్ అవార్డ్ అందుకున్నారాయన. శ్యామ్ బెనెగల్ రూపొందించిన ‘భారత్ ఏక్ ఖోజ్’ డాక్యుమెంటరీకి ఓం పురి వ్యాఖ్యానం ప్రత్యేక ఆకర్షణగా నిలచింది. “గాంధీ, సిటీ ఆఫ్ జాయ్, వూల్ఫ్, ఈస్ట్ ఈజ్ ఈస్ట్” వంటి ఆంగ్ల చిత్రాలలోనూ ఓం పురి నటించి ఆకట్టుకున్నారు.

తెరపై విలక్షణ పాత్రలు పోషించి అలరించిన ఓం పురి, నిజజీవితంలో మంచి భర్త అనిపించుకోలేక పోయారు. 1991లో సీమా కపూర్ ను వివాహమాడారు. కొద్ది రోజులకే విడిపోయారు. ఆ తరువాత 1993లో నందితను పెళ్ళాడారు. వారికి ఇషాన్ పురి అనే అబ్బాయి ఉన్నాడు. 2013లో ఆమెతోనూ విడాకులు తీసుకున్నారు. ముంబైలోని అంధేరిలో ఉన్న తన నివాసంలో నిద్రలోనే 2017 జనవరి 6న కన్నుమూశారు ఓం పురి. ఈ నాటికీ రంగస్థలంపైనా, చిత్రసీమలోనూ ఓం పురి విలక్షణ పాత్రల గురించి చర్చ సాగుతూనే ఉంది. ఔత్సాహిక నటులు ఓం పురి చిత్రాలను అధ్యయనం చేయడమూ జరుగుతోంది. ఏది ఏమైనా భారతదేశం గర్వించదగ్గ నటుల్లో ఒకరిగా ఓం పురి నిలచిపోయారు.

Exit mobile version