మారే కాలంలో మారని కథలెన్నో! కొన్ని కథలు కాలంతో పోటీ పడుతూ సాగుతుంటాయి. కథలు పాతవైనా, సమకాలీన పరిస్థితులను గుర్తు చేస్తుంటాయి. అలా కాలానికి నిలచిన సినిమా ‘న్యాయం కావాలి’. సాంకేతికంగా మనిషి ఎంతో ఎత్తుకు ఎదిగినా, కొందరు మనుషులు వారి మనసులు ఎన్నటికీ మారవని చాటే కథ ‘న్యాయం కావాలి’లో ఉంది. నమ్మించి అమ్మాయిలను బుట్టలో వేసుకోవడం, వారిని మెప్పించి, ఒప్పించి ఒకటవ్వడం, కోరిక తీరగానే వేరే దారి చూసుకోమని చెప్పడం – ఆ నాడే కాదు ఈ నాటికీ జరుగుతూనే ఉన్నాయి. అలా అన్యాయమై పోయిన ఓ అబల న్యాయస్థానం నమ్ముకొని పోరాటం చేసి, తనను మోసం చేసిన వానిపై విజయం సాధించిన కథతో తెరకెక్కిన చిత్రం ‘న్యాయం కావాలి’.
మొదటి నుంచీ స్త్రీ పక్షపాతి అని పేరున్న నిర్మాత క్రాంతి కుమార్ తమ ‘క్రాంతి చిత్ర’ పతాకంపై నిర్మించిన చిత్రం ‘న్యాయం కావాలి’. డి.కామేశ్వరి రాసిన ‘కొత్త మలుపు’ కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. 1981 మే 15న విడుదలైన ఈ చిత్రం విజయకేతనం ఎగురవేయడమే కాదు, ఈ సినిమాతో ఎంతోమందికి చిత్రసీమలో స్థిరత్వాన్ని ఏర్పరచింది.
క్రాంతితో చిరు బంధం…
చిరంజీవి అప్పట్లో వర్ధమాన కథానాయకుడు. అప్పటికే పలు చిత్రాలలో బిట్ రోల్స్, నెగటివ్ రోల్స్, కీలక పాత్రలు, హీరో వేషాలు వేసిన చిరంజీవికి ఇది 30వ చిత్రం. ఈ చిత్ర దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డికి రెండవ సినిమా. అంతకు ముందు ‘సంధ్య’ చిత్రంతో కోదండరామిరెడ్డి దర్శకునిగా పరిచయమయ్యారు. ఇక ఈ సినిమాతోనే రాధిక తెలుగు తెరకు పరిచయం కావడం విశేషం. ఈ ముగ్గురూ తరువాతి రోజుల్లో మాస్ మసాలా చిత్రాలతో సక్సెస్ సాధించడమూ విశేషమే! ఇక క్రాంతికుమార్ కు చిరంజీవికి విడదీయరాని బంధం ఉంది. క్రాంతి కుమార్ నిర్మించిన ‘ప్రాణం ఖరీదు’తోనే చిరంజీవి తొలిసారి తెరపై కనిపించారు. ఆ సినిమాలో చిరంజీవి కీలకమైన పాత్ర పోషించారు. ఇందులో చిరంజీవి ఒక్క పాటలోనే తన ప్రతిభను చాటుకోవడం విశేషం. చిరంజీవికి డాన్సర్ గా మంచిపేరు సంపాదించి పెట్టింది కూడా క్రాంతి కుమార్ నిర్మించిన ‘మోసగాడు’ చిత్రమే. ఇందులో చిరంజీవి విలన్ గా నటించినా, శ్రీదేవితో కలసి చిందేసి కనువిందు చేశారు. దాంతోనే డాన్సర్ గా మార్కులు కొట్టేశారు. అలా క్రాంతి కుమార్ తో చిరంజీవి మూడో చిత్రం ‘న్యాయం కావాలి’తో ఆయనకు మరపురాని విజయం దక్కింది.
చిరు-కోదండ బంధం…
‘న్యాయం కావాలి’తో మొదలైన చిరంజీవి, కోదండరామిరెడ్డి ప్రయాణం భలేగా సాగింది. తరువాత క్రాంతి చిత్ర బ్యానర్ లోనే వారి కాంబోలో వచ్చిన ‘కిరాయి రౌడీలు’ మాస్ ను భలేగా ఆకట్టుకుంది. చిరంజీవిని స్టార్ గా నిలిపిన ‘ఖైదీ’ కూడా వారి కాంబోలోనే వెలుగు చూసింది. ఆ తరువాత వారిద్దరి కాంబోలో వచ్చిన నవలా చిత్రాలు “అభిలాష, ఛాలెంజ్, రాక్షసుడు, దొంగమొగుడు” కూడా ఆకట్టుకున్నాయి. ఇక చిరంజీవిని మెగాస్టార్ గా నిలిపిన ‘పసివాడి ప్రాణం’ కూడా కోదండరామిరెడ్డి దర్శకత్వంలో రూపొందినదే. ఇలా చిరు, కోదండ బంధం కూడా ప్రత్యేకమైనదే. అందుకు నాందిగా నిలచింది ‘న్యాయం కావాలి’.
చిరు హిట్ పెయిర్ రాధిక…
చిరంజీవితో రాధిక తొలిసారి నటించిన చిత్రం ‘న్యాయం కావాలి’. ఇందులోనే వారిద్దరి మధ్య కెమిస్ట్రీ భలేగా పండింది. ఆ తరువాత వారిద్దరూ జంటగా నటించిన అనేక చిత్రాలు విజయపథంలో పయనించాయి. చిరంజీవి సరసన అత్యధిక చిత్రాలలో నటించిన నాయికగా రాధిక నిలచిపోయారు.
అలరించిన కోర్టు డ్రామా
ఇక ‘న్యాయం కావాలి’ చిత్రంలో టైటిల్ కు తగ్గట్టే ఈ చిత్రంలోని పాత్రలకు కోర్టుకు సంబంధం ఉంటుంది. మోసపోయిన హీరోయిన్ సినిమాలో ఓ కోర్టు గుమాస్తా కూతురు. ఆమెను మోసం చేసిన వాడు ఓ న్యాయవాది కొడుకు. హీరోయిన్ తరపున వాదించే లేడీ లాయర్ కూడా ఒకప్పుడు మోసపోయి ఉంటుంది. ఆమెను మోసం చేసిన వాడు హీరో తండ్రి. ఇలా ప్రధాన పాత్రలన్నీ కోర్టుకు సంబంధమైనవే కావడం కథలోని ప్రత్యేకత.ఈ చిత్రంలో కోర్టు రూమ్ డ్రామా చాలా సేపు జరిగినా దర్శకుడు కోదండరామిరెడ్డి ఎక్కడా బోర్ కొట్టకుండా తెరకెక్కించడంలో సఫలీకృతులయ్యారు.
మరికొన్ని విశేషాలు…
ఈ చిత్రంలో చిరంజీవి, రాధికతో పాటు శారద, జగ్గయ్య, చాట్ల శ్రీరాములు, అల్లు రామలింగయ్య, పుష్పలత, అత్తిలి లక్ష్మి, ఫటాఫట్ జయలక్ష్మి ముఖ్యపాత్రధారులు. ఈ నాడు తల్లి పాత్రల్లో అలరిస్తున్న తులసి, ఇందులో హీరోయిన్ చెల్లెలిగా నటించి అలరించింది. మరో తల్లి వేషాల నటి రోహిణి కూడా ఇందులో శారద కూతురుగా నటించింది.
అప్పటికే మహిళా సమస్యలు, వాటి పరిష్కారాలతో పలు చిత్రాలు తెరకెక్కించారు దాసరి నారాయణరావు. ఈ సినిమాకు ముందు క్రాంతికుమార్ నిర్మాతగా ‘సర్దార్ పాపారాయుడు’ చిత్రానికి దాసరి దర్శకత్వం వహించారు. ఈ కథ వినగానే ఇందులో ఓ అతిథి పాత్రలో కాసేపు దాసరి కనిపించి ఆకట్టుకున్నారు.
ఈ చిత్రానికి వేటూరి పాటలు, సత్యానంద్ మాటలు రాయగా, చక్రవర్తి సంగీతం సమకూర్చారు. ఇందులో ఐదు పాటలున్నాయి. చిత్రమేంటంటే, ఇందులో సందర్భానుసారంగా యన్టీఆర్ ‘వేటగాడు’లోని “ఆకుచాటు పిందె తడిసె…” పాటను ఉపయోగించారు. దాంతో మాస్ ఈ సినిమాను చూడటానికి పరుగులు తీశారు.
‘న్యాయం కావాలి’ చిత్రం పదికి పైగా కేంద్రాలలో శతదినోత్సవం చూసింది. రజతోత్సవం కూడా జరుపుకుంది.