తగ్గేదేలే అనే విధంగా కరోనా రక్కసి మరోసారి రెక్కలు చాస్తోంది. దేశవ్యాప్తంగా తాజాగా 1,79,729 కొత్త కరోనా కేసులు రాగా, 146 మంది మరణించారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 7,23,619 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో పాజిటివిటీ రేటు 13.29 శాతంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 4,033 చేరింది. అయితే మహారాష్ట్ర, రాజస్థాన్, ఢిల్లీలపై ఒమిక్రాన్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది.
కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొనే చర్యల్లో భాగంగా రాష్ట్ర ఏపీ ప్రభుత్వం మరో గొప్ప అడుగు ముందుకేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్లను సీఎం జగన్ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సుమారు రూ. 426కోట్ల వ్యయంతో 133 ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు.
తెలంగాణ ప్రభుత్వం 60 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోస్‌లు వేసేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో బూస్టర్ డోస్‌ను ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. చార్నినార్‌లోని యునాని ఆసుపత్రిలో బూస్టర్ డోస్ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ పాల్గొన్నారు.
కరోనా కొత్త కొత్తగా రూపాంతరాలు చెంది ప్రజలపై విరుచుకుపడుతోంది. ఇటీవలే వెలుగులోకి వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్‌తోనే తలమునకలవుతున్న వేళ.. ఇప్పుడు మరో కొత్త వేరియంట్ వెలుగులోకి వచ్చింది. ఈ కొత్త వేరియంట్ పేరు డెల్టాక్రాన్‌గా నామకరణం చేశారు శాస్త్రవేత్తలు.
ఈ మధ్య పొలిటికల్ టూరిస్ట్‌లు వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్ అంటే తెలంగాణ రైతు సర్కార్ అని ఆయన అభివర్ణించారు. అంతేకాకుండా 64 లక్షల మంది రైతుల ఖాతాలోకి 50 వేల కోట్లు జమ అయ్యిందని, తెలంగాణ రాకంటే ముందు ఈ ప్రాంత పరిస్థితి బోర్ల కింద పంటలు.. బోర్ల పడ్డ బతుకులుగా ఉండేవన్నారు.
నిజామాబాద్ జిల్లాకు చెందిన కుటుంబం ఇటీవల విజయవాడలో ఆత్మహత్యకు పాల్పడింది. ఈ కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. జ్ఞానేశ్వర్ అనే వ్యక్తి వేధింపుల వల్లే చనిపోతున్నానంటూ సురేష్ సెల్ఫీవీడియో లభ్యమైంది. అయితే ఈ సెల్ఫీ వీడియోని కుటుంబసభ్యులు పోలీసులకు అందజేశారు. జ్ఞానేశ్వర్‌కు రూ.40 లక్షలు వడ్డీరూపంలో చెల్లించానని, వడ్డీ వ్యాపారి గణేష్‌కి రూ.80 లక్షలు చెల్లించానని వడ్డీ వ్యాపారుల వేధింపుల వల్లే చనిపోతున్నానంటూ సెల్ఫీవీడియోలో సురేష్ పేర్కొన్నారు. దీంతో జ్ఞానేశ్వర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
2022 వింటర్ ఒలింపిక్స్‌ను నిర్వహించేందుకు బీజింగ్ సిద్ధమయింది. ఇప్పటికే అన్నిరకాల ఏర్పాట్లు చేసింది. బీజింగ్‌ను జీరో కరోనా జోన్‌గా తీసుకొచ్చేందుకు అక్కడి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, బీజింగ్ వింటర్ ఒలింపిక్స్‌కు ఒమిక్రాన్ టెన్షన్ పట్టుకుంది. ఒమిక్రాన్ కేసులు ఆ దేశంలో క్రమంగా పెరుగుతున్నాయి. కట్టడి చేసేందుకు ఇప్పటికే బీజింగ్ చుట్టుపక్కల ఉన్న నగరాలలో కఠిన ఆంక్షలు విధిస్తున్నారు.
దేశవ్యాప్తంగా ఈరోజు నుంచి బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. ప్రికాషనరీ డోస్ కింద వ్యాక్సిన్‌ను అందిస్తున్నారు. మొదటి రెండు డోసులు ఏ వ్యాక్సిన్ తీసుకున్నారో, మూడో డోస్ కింద అదే వ్యాక్సిన్‌ను ఇవ్వనున్నారు. మొదటగా 60 ఏళ్లు దాటిన వారికి, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు, హెల్త్ వర్కర్లకు ఈ వ్యాక్సిన్‌ను అందిస్తున్నారు.
ఐఐటి కాన్పూర్ మరో అద్భుతానికి శ్రీకారం చుట్టింది. కరోనా మహమ్మారి సమయంలో వెంటిలేటర్లు, ఆక్సీజన్ కాన్సన్‌ట్రేటర్లను తక్కువ ఖర్చుతో తయారు చేసి ఔరా అనిపించింది. కరోనా సమయంలో ఈ వెంటిలేటర్లు, ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు ఎంతగా ఉపయోగపడ్డాయో చెప్పాల్సిన అవసరం లేదు. కాగా, ఇప్పుడు కృత్రిమ గుండెను తయారు చేసేందుకు సిద్దమవుతున్నది కాన్పూర్ ఐఐటి. రీచార్జ్ చేసుకునే విధంగా బ్యాటరీతో పనిచేసే కృత్రిమ గుండెను తయారు చేస్తున్నది. రెండేళ్లలతో ఈ కృత్రిమ గుండెను రెడీ చేస్తామని, అనంతరం జంతువులపై ట్రయల్స్ నిర్వహిస్తామని ఐఐటి కాన్పూర్ ప్రొఫెసర్ బంధోపాధ్యాయ్ తెలిపారు.
ఏపీలో ఉన్న వైసీపీది మతతత్వ ప్రభుత్వమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఆత్మకూరులో అనుమతి లేకుండా రెండు రోజుల్లో ఇళ్ల మధ్య మసీదులు కట్టారని, ఇళ్ల మధ్య మసీదు వద్దని చెబితే చంపే ప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా ఎంతోమందిని భయబ్రాంతులకు గురి చేశారని, చట్టాన్ని రక్షించాల్సిన ఉప ముఖ్యమంత్రి కాకమ్మ కబుర్లు చెబుతున్నారని విమర్శించారు.