కరోనా బారినపడిన తల్లి పాలు తాగవచ్చా? కరోనా మహమ్మారి నుంచి పిల్లల్ని రక్షించుకోవడం ఎలా? కరోనా, ఒమిక్రాన్ తన విశ్వరూపం చూపిస్తున్న వేళ కుటుంబ ఆరోగ్యంపై వాటి ప్రభావం బాగా కనిపిస్తోంది. గర్భిణులకు కరోనా సోకితే అది పుట్టే పిల్లలను కూడా వదిలి పెట్టదని, కొవిడ్ సోకిన తల్లి పాలు తాగిన పిల్లలకూ అది సంక్రమిస్తుందన్న సందేహాలు అందరి మదిని తొలిచేస్తోంది. అయితే అది నిజమేనా? గర్భిణులు డెలివరీ అనంతరం కరోనా బారిన పడితే దాని ప్రభావం పిల్లలపై పడుతుందా? అని అనేకమంది డాక్టర్లను సలహా అడుగుతున్నారు.
మహిళల్లో పేరుకుపోయిన ఎన్నో సందేహాలను తీర్చే ప్రయత్నం చేశారు వైద్య నిపుణుులు. గర్భిణులకు కరోనా సోకినా ఎలాంటి భయాలు అవసరం లేదంటున్నారు. గర్భంలోని శిశువుకు వైరస్ సోకే ప్రమాదం లేదని తాజాగా జరిగిన అధ్యయనంలో తేలింది. శిశువు ఆరోగ్యం, పెరుగుదల విషయంలోనూ ఎలాంటి సమస్య ఉండదని స్పష్టమైంది.
కరోనా టీకా తీసుకోవడానికి ముందు కోవిడ్ బారినపడిన గర్భిణులపై ఆరు నెలలపాటు అధ్యయనం చేశారు. వీరిలో 55 శాతం మంది ప్రసవం జరిగిన 10 రోజుల్లోపే కరోనా బారినపడ్డారు. దీంతో వారి శిశువులకు కరోనా పరీక్షలు చేయగా వారికి నెగిటివ్ అని తేలింది. దీనిని బట్టి చూస్తే కరోనా సోకిన తల్లి పాలు తాగినప్పటికీ శిశువులకు అది సోకడంలేదని నిర్ధారణ అయింది. దీంతో పిల్లలకు ఎలాంటి అనుమానాలు లేకుండా తల్లిపాలు ఇవ్వవచ్చని వైద్య నిపుణులు అంటున్నారు.