కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తూనే ఉంది.. వైరస్ రోజురోజుకు … రూపాంతరం చెందుతూనే ఉంది. ఇప్పటికే డెల్టా, అల్ఫా వంటి కొత్త వేరియంట్లతో… ఆయా దేశాల్లో విజృంభిగిస్తూనే ఉంది. ఇదే సమయంలో వైరస్ సంక్రమణ ఎక్కువగా ఉన్నట్లు భావిస్తోన్న మరో కొత్తరకం వెలుగులోకి వచ్చింది. కోవిడ్ కొత్త వేరియంట్ సీ.1.2ను… ఈ ఏడాది మే నెలలో తొలిసారి గుర్తించినట్లు దక్షిణాఫ్రికాకు చెందిన NICD, KRISPలు సంయుక్తంగా ప్రకటించాయి. ఆగస్టు 13 నాటికి చైనా, కాంగో, మారిషస్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, పోర్చుగల్, స్విట్జర్లాండ్ దేశాల్లోనూ ఈ వేరియంట్ విస్తరించినట్లు వెల్లడించింది. దక్షిణాఫ్రికాలో తొలివేవ్ విజృంభణ సమయంలో… ఎక్కువ ప్రభావం చూపిన సీ.1 వేరియంట్.. సీ.1.2గా రూపాంతరం చెందినట్లు నిపుణులు తెలిపారు.
ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు గుర్తించిన ఆందోళనకర వేరియంట్లతో పోలిస్తే… కొత్తగా వెలుగు చూసిన ఈ రకం ఎన్నో ఎక్కువ మ్యుటేషన్లకు గురైనట్లు పరిశోధకులు గుర్తించారు. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న సీ.1.2 సీక్వెన్సింగ్ సమాచారం బట్టి చూస్తే.. ఈ వైరస్ వ్యాప్తి, ప్రాబల్యాన్ని కచ్చితంగా అంచనా వేయలేకపోయారు. బీటా, డెల్టా వేరియంట్ల మాదిరిగానే… వీటి మ్యుటేషన్‌లో పెరుగుదల కనిపిస్తోందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ వైరస్ మ్యుటేషన్ రేటు ఏడాదికి 41.8గా ఉన్నట్లు పరిశోధకులు కనుగొన్నారు. ఇది ఇతర రకాల మ్యుటేషన్ రేటుతో పోలిస్తే దాదాపు రెట్టింపు వేగంతో మార్పులు చెందుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వెలుగు చూసిన N440K, Y449H వంటి మ్యుటేషన్లు వ్యాక్సిన్‌ల వల్ల పొందే యాంటీబాడీల నుంచి తప్పించుకుంటున్నట్లు తేలింది. ఇదే తరహాలో యాంటీబాడీలను తప్పించుకునే గుణం సీ.1.2 సీక్వెన్స్‌ల్లోనూ గుర్తించామని తాజా అధ్యయనంలో శాస్త్రవేత్తలు వెల్లడించారు. ప్రస్తుతానికి దీనిని వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్‌గానే పరిశోధకులు పరిగణిస్తున్నారు.