Site icon NTV Telugu

బేగంపేట పేకాట కేసు.. అరవింద్ అరెస్టుతో కదులుతున్న డొంక

హైదరాబాద్ పోలీసులు పేకాట స్థావరాలపై దృష్టి సారిస్తున్న సంగతి తెలిసిందే. మంచిరేవులలో ఓ సినీనటుడి ఫాం హౌస్‌లో దాడుల తర్వాత పేకాట రాయుళ్ళ పని పడుతున్నారు. బేగంపేటలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. ప్రధాన నిర్వాహకుడు అరవింద్‌ అగర్వాల్‌‌తో పాటు ఐదుగురిని అరెస్ట్‌ చేశామని బేగంపేట పోలీసులు తెలిపారు. హైదరాబాద్ బేగం పేట పేకాట కేసులో కీలక విషయాలు బయటపడుతున్నాయి. అరవింద్‌తో పాటు వ్యాపారవేత్తలు జాఫర్‌ హుస్సేన్‌, సిద్దార్థ్‌ అగర్వాల్‌, బగీరియా సూర్యకాంత్‌, అబ్దుల్‌ అలీ జిలానీలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. పేకాటరాయుళ్ల నుంచి పోలీసులు రూ.12 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

పేకాటలో అరవింద్ అగర్వాల్ హైదరాబాద్‌ను శాసిస్తున్నాడు. అగర్వాల్‌కు రెండు రాష్ట్రాల్లోని ప్రముఖులతో పరిచయాలు వున్నాయి. క్యాసినో, పోకర్‌, పేకాట, తీన్‌పత్తాలను ఆడిస్తున్నాడు అరవింద్‌ అగర్వాల్‌. అతని కస్టమర్లలో ఎక్కువమంది ప్రజాప్రతినిధులే వుండడం గమనార్హం. అన్ని పార్టీల రాజకీయ నాయకులతో అరవింద్‌ అగర్వాల్‌కు సంబంధాలు వుండడంతో కేసు పరిశోధన కష్టం అవుతోంది. సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులతో కూడా అరవింద్‌కు లింకులు వున్నాయి.

పేకాటలో పోలీసులకు చిక్కినా బాధ్యత నాదే అంటూ భరోసా ఇస్తున్నాడు అరవింద్. గోవా, సింగపూర్‌, శ్రీలంకలకు వీఐపీలను తీసుకెళ్తున్నాడు అరవింద్‌. ఇతర దేశాల్లో కోట్లు పెట్టి క్యాసినో ఆడిస్తున్నాడు అరవింద్ అగర్వాల్. పండుగలు, ముఖ్యమైన రోజుల్లో కోట్లరూపాయల పేకాట దందా సాగుతోంది. బేగంపేటలో 150మందికి ఆహ్వానం పంపిన అరవింద్‌..ఆహ్వానం అందుకున్నవారిలో 85మంది హాజరయ్యారు.

స్థానికుల సమాచారంతో టాస్క్‌ఫోర్స్‌ దాడులు చేసింది. బేగంపేట అడ్డాపై టాస్క్‌ఫోర్స్‌ దాడి తర్వాతే ప్రముఖ నాయకుడి రంగప్రవేశం జరిగింది. పోలీసులు చాలామందిని పట్టుకొని తీసుకెళ్లారని స్థానికులు తెలిపారు. కోట్ల రూపాయల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారని, ఐదుగురిని మాత్రమే అరెస్ట్‌ చూపడంపై స్థానికుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version