Site icon NTV Telugu

ఖరీదైన విడాకులు.. భరణంగా రూ.5,555 కోట్లు..

విడాకుల తర్వాత భార్యకు భరణం చెల్లించే విషయంలోనూ కొత్త రికార్డు సృష్టించాడు దుబాయ్‌కి చెందిన ఓ రాజు.. బ్రిటన్‌ హైకోర్టు వెలువరించిన సంచలన తీర్పుతో.. ఆయన తన మాజీ భార్యకు ఏకంగా రూ.5,555 కోట్లను భరణంగా చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. దుబాయ్‌ రాజు షేక్‌ మహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తూం వయస్సు 72 ఏళ్లు.. ఆయన భార్య జోర్డాన్‌ రాకుమారి హయా బింత్‌ అల్‌ హుసేన్‌ వయస్సు 47 ఏళ్లు.. ఈ ఇద్దరి విడాకుల కేసు విచారణ జరిపిన బ్రిటన్ హైకోర్టు.. తాజాగా సంచలన తీర్పు వెలువరించింది. షేక్‌ మహమ్మద్‌-హయాకు పుట్టిన పిల్లలకు 554 మిలియన్‌ పౌండ్లు భరణంగా చెల్లించాల్సిందేనని కోర్టు తీర్పు చెప్పింది.. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం.. ఆ మొత్తం రూ.5,555 కోట్లు అన్నమాట.

Read Also: చలిపంజా.. వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు.. 4.6గా కనిష్ఠ ఉష్ణోగ్రత..

బ్రిటిష్‌ చరిత్రలోనే అత్యధిక ఖరీదైన విడాకులు ఇవేనని చెబుతున్నారు.. ఇక, ఈ మొత్తంలో మొదట రూ.2,521 కోట్లు మాజీ భార్యకు 3 నెలల్లోపు చెల్లించాలని.. మిగతా రూ.2,907 కోట్లు వారి ఇద్దరి సంతానమైన 14 ఏళ్ల అల్‌ జలీలా, 9 ఏళ్ల జయేద్‌కు బ్యాంకు గ్యారంటీతో చెల్లించాలని తన తీర్పులో స్పష్టం చేసింది బ్రిటన్‌ కోర్టు.. అంతేకాదు.. పిల్లలకు ఇవ్వాల్సిన మొత్తం తండ్రితో వారికున్న సంబంధాలపై ఆధారపడి ఉంటుందని కూడా పేర్కొంది.. మాజీ భార్య, పిల్లల రక్షణ ఖర్చుల కింద ప్రతీ ఏడాది రూ.110 కోట్లు, పిల్లల చదువుల కోసం మరికొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.. ఈ కేసు విచారణ తర్వాత తీర్పు వెలువరించిన కోర్టు.. రాకుమారి హయా, ఆమె పిల్లలకు బయటి వ్యక్తుల నుంచి కంటే భర్త షేక్‌ మహమ్మద్‌ నుంచే ఎక్కువ ముప్పు ఉందని అర్థమవుతోందని.. వారికి తగినంత రక్షణ అవసరమని పేర్కొంది. కాగా, రాకుమారి హయా 2019లో దుబాయ్‌ నుంచి తిరిగి లండన్‌కు వెళ్లిపోయారు.. ఆ తర్వాత విడాకుల కోసం కోర్టుకెక్కారు.. తన ఇద్దరు పిల్లలను అప్పగించాలని బ్రిటిష్‌ కోర్టును ఆశ్రయించారామె.. అప్పటి నుంచి విచారణ జరుగుతూ రాగా.. తాజాగా సంచలన తీర్పు వెలువరించింది హైకోర్టు.

Exit mobile version