Site icon NTV Telugu

చంద్రబాబు, పవన్‌లపై తిట్ల వర్షం కురిపించిన మంత్రి కొడాలి నాని

ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్ తగ్గించాలంటూ ఈరోజు టీడీపీ నేతలు ధర్నాలు చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో చంద్రబాబు తీరుపై మంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. చంద్రబాబుకు వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదని విమర్శించారు. చంద్రబాబు హయాంలో పెట్రోల్, డీజిల్‌పై రూ.2 సర్‌ఛార్జీ విధించినట్లు కొడాలి నాని గుర్తుచేశారు. ఎక్కడైనా పెట్రోల్ ధరలను ముఖ్యమంత్రి తగ్గిస్తాడా అని ప్రశ్నించారు. టీడీపీకి ఎన్నిసార్లు ప్రజలు బుద్ధి చెప్పినా చంద్రబాబుకు సిగ్గురావడం లేదన్నారు. చంద్రబాబు లుచ్చా రాజకీయాలు చేస్తున్నాడని మండిపడ్డారు. మరోవైపు బద్వేలు ఉప ఎన్నికలో బీజేపీని ఓటర్లు పెట్రోల్ పోసి తగులపెట్టారని, ఆ పార్టీకి డిపాజిట్ కూడా దక్కలేదని కొడాలి నాని ఎద్దేవా చేశారు.

Read Also: విమాన ప్రయాణికులకు శుభవార్త

మరోవైపు స్టీల్‌ప్లాంట్‌పై ఏపీ ప్రభుత్వానికి వారం రోజులు డెడ్‌లైన్ పెట్టిన జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌పైనా మంత్రి కొడాలి నాని విరుచుకుపడ్డారు. అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకువెళ్లడానికి జగన్‌కు పవన్ డెడ్‌లైన్ పెట్టాడని.. వారం కాదు ఏడేళ్లు డెడ్‌లైన్ పెట్టినా పవన్‌ను జగన్ ఢిల్లీకి తీసుకువెళ్లరని స్పష్టం చేశారు. కావాలంటే పవన్‌కు చెందిన లుచ్చా పార్టీలోని నేతలను పంపిస్తే తానే టిక్కెట్లు బుక్ చేయించి ఢిల్లీకి పంపిస్తానని.. దాని కోసం డెడ్‌లైన్లు పెట్టాల్సిన అవసరం లేదని కౌంటర్ ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ విషయంలో పవన్ ప్రశ్నించాల్సింది రాష్ట్ర ప్రభుత్వాన్ని కాదని… తనతో పొత్తు పెట్టుకున్న మోదీని అంటూ చురకలు అంటించారు. చంద్రబాబు, పవన్‌కు ప్రధాని మోదీ, అమిత్ షా ఢిల్లీలో అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదు కాబట్టే జగన్‌ను తీసుకువెళ్లాలని అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజల సమస్యలను అడ్డం పెట్టుకుని అఖిలపక్షం పేరుతో ఢిల్లీకి తీసుకువెళ్లాలంటూ సిగ్గులేకుండా అడుగుతున్నారని కొడాలి నాని ఆరోపించారు.

Exit mobile version